 
															సెల్ టవర్ అంటే భయం వద్దు
సెల్‌టవర్ నుంచి ప్రమాదకరమైన స్థాయిలో రేడియో ధార్మిక శక్తి విడుదల కాదని, అది పూర్తిగా సురక్షితమేనని, ప్రజలు భయాందోళనలు లేకుండా ఉండొచ్చంటూ కేంద్రప్రభుత్వం
	- దాంతో ఎలాంటి హానీ లేదు
	- టెలికం శాఖ ముమ్మర ప్రచారం
	 
	 సాక్షి, హైదరాబాద్ : సెల్‌టవర్ నుంచి ప్రమాదకరమైన స్థాయిలో రేడియో ధార్మిక శక్తి విడుదల కాదని, అది పూర్తిగా సురక్షితమేనని, ప్రజలు భయాందోళనలు లేకుండా ఉండొచ్చంటూ కేంద్రప్రభుత్వం ముమ్మర ప్రచారానికి సిద్ధపడింది. టెలికం శాఖ దేశవ్యాప్తంగా  అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది.  రాష్ట్ర ప్రభుత్వంతో కలసి టెలికం శాఖ నగరంలో తొలి అవగాహన సదస్సు నిర్వహించింది. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ సజ్జనార్ తదితరులు రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మాజీ సలహాదారు టి.హనుమాన్ చౌదరి, ప్రముఖ వైద్య నిపుణులు కాకర్ల సుబ్బారావుతోపాటు టెలికం సీనియర్ డీటీజీ శివేంద్ర భట్నాగర్, డీడీజీ రఘునందన్, పలు మొబైల్ ఆపరేటర్లు తదితరులు హాజరయ్యారు.
	
	 టవర్లతో ప్రమాదం లేదు
	 సదస్సులో డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ సెల్ టవర్ల వల్ల మనకెలాంటి ప్రమాదం లేదని ప్రజలు అనవసరంగా భయపడకుండా నిశ్చితంగా ఉండొచ్చని అన్నారు. టి.హనుమాన్ చౌదరి మాట్లాడుతూ సెల్ ఫోన్, టవర్ల రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుందని, ఎలాంటి భయం వద్దని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
