ఇద్దరు దొంగలు జతకట్టారు. దేవుళ్లనే దోచుకున్నారు.
పూజారి దృష్టి మళ్లించి చోరీలు
జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి
మళ్లీ చోరీకి వచ్చి పట్టుబడిన వైనం
సిటీబ్యూరో: ఇద్దరు దొంగలు జతకట్టారు. దేవుళ్లనే దోచుకున్నారు. పూజారి దృష్టి మరల్చి గర్భగుడిలోకి వెళ్లి దేవుళ్ల నగలు, పూజా సామగ్రి ఎత్తుకెళ్లడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు 57 గుళ్లను దోచుకున్నారు. గతంలో పలుమార్లు జైలుకెళ్లి వచ్చారు. అయినా బుద్ధిమార్చుకోకుండా మళ్లీ రెండేళ్లుగా జంట కమిషనరేట్ల పరిధిలో పంజా విసురుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ద్వయం చివరకు జూబ్లీహిల్స్ పోలీసులకు మంగళవారం చిక్కింది. పోలీసుల విచారణలో నగరంతో పాటు సైబరాబాద్‌లో మొత్తం 22 చోరీలకు పాల్పడినట్టు తేలింది. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈమని రాంబాబు అలియాస్ రాంపవన్ (48) చైతన్యపురిలోని సాయినగర్‌కాలనీలో ఉంటున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్ మణి అలియాస్ బాలాజీ (52) సుల్తాన్‌బజార్‌లో ఉంటున్నాడు. ఇద్దరూ గతంలో వేర్వేరుగా చిన్న చిన్న చోరీలు చేసి జైలుకెళ్లారు. అక్కడ ఇద్దరికీ పరిచయం అయింది. బయటకు వచ్చాక ఇద్దరూ ముఠాగా ఏర్పడి గుళ్లలో చోరీ చేస్తున్నారు.
దృష్టి మరల్చి...
ముందుగా ఇద్దరూ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తారు. తర్వాత టార్గెట్ చేసిన గుడి వద్దకు బైక్‌పై వస్తారు. ఒకడు బయట బైక్ పార్క్ చేసి నిలబడగా.. మరొకడు గుడి లోపలికి వెళ్లి పూజారికి మాయమాటలు చెప్పి దృష్టి మళ్లిస్తాడు. నెమ్మిదిగా గర్భగుడిలోకి వెళ్లి దేవుడి మెడలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, పూజసామగ్రి మూటకట్టుకొని బయటకు వస్తాడు. బయట సిద్ధంగా ఉన్న బైక్‌పై పారిపోతారు. ఇలా వీరు నగరంలో జూబ్లీహిల్స్, షాహినాత్‌గంజ్, ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, సంతోష్‌నగర్, మాదన్నపేట, హుస్సేనీఆలం, చార్మినార్, కాచిగూడ, అంబర్‌పేట, సైదాబాద్, ఓయూ, మలక్‌పేట, గోపాలపురం, తుకారాంగేట్, బోయిన్‌పల్లి, అబిడ్స్, ఎల్బీనగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. గతంలో రాంబాబు, బాలా జీ కలిసి కుషాయిగూడలో- 3, చిక్కడపల్లిలో -4, ముషీరాబాద్‌లో 2, బేగంపేట, కామాటిపురా, పంజగుట్ట, చాదర్‌ఘాట్, మల్కాజిగిరి, నాపంల్లి, సుల్తాన్‌బజార్, సైదాబాద్, అంబర్‌పేటలలో ఒ క్కొక్కటి చొప్పున, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 15 ఆలయాలను దోచుకున్నారు.
ఇలా పట్టుబడ్డారు...
రాంబాబు, బాలాజీలు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఓ ఆలయంలో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహిస్తుండగా వీరిపై అనుమానం వచ్చి అదనపు ఇన్‌స్పెక్టర్ కె.ముత్తు, ఎస్‌ఐ కె.రమేష్ అదుపులోకి తీసుకున్నారు. విచారించగా రెండేళ్లలో నగరంలో 20, సైబరాబాద్‌లో 2 చోరీలు చేసినట్లు అంగీకరించారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 3 తులాల బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, చోరీల నివారణ కోసం నగరంలోని ప్రతీ గుడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు.