ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు ఆపకుంటే ప్రభుత్వం చేపట్టే రాష్ట్రస్థాయి పోటీ, ప్రవేశ పరీక్షల నిర్వహణకు
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు ఆపకుంటే ప్రభుత్వం చేపట్టే రాష్ట్రస్థాయి పోటీ, ప్రవేశ పరీక్షల నిర్వహణకు సహకరించొద్దని సర్వసభ్య సమావేశంలో పలు ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1, రెండో తేదీల్లో జరిగే టెట్, ఎంసెట్‌ను ప్రైవేటు విద్యాసంస్థల కేంద్రాల్లో బహిష్కరించాలని సూచించారు. ప్రవేశ పరీక్షలను అడ్డుకుంటే ప్రజలు, ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడ్డారు.
కేజీ టు పీజీ ప్రైవేటు విద్యాసంస్థలకు యాజమాన్యాలు స్వచ్ఛంధంగా తాళాలు వేసి డిప్యూటీ సీఎంకు తాళం చెవులు అప్పగించాలని ఇంకొందరు సూచించారు. వీటన్నింటి కంటే ముందుగా విద్యాసంస్థల్లో పోలీసుల జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించి, తనిఖీలపై స్టే ఆర్డర్ తెచ్చుకుంటే మంచిదన్నారు. మరోపక్క పోలీసుల తనిఖీలను నిరసిస్తూ... బహిరంగ సభ నిర్వహించాలని కొందరు నాయకులు సూచించారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ డిమాండ్లను వివరించి, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని ఆయా సంఘాల నాయకులు ప్రతిపాదించారు.