 
															రోడ్లకు మైనస్
ప్రభుత్వం మంజూరు చేసిన పనులు.. వాస్తవంగా జరుగుతున్న పనులకు పొంతన లేకపోవటంతో కొత్త బడ్జెట్‌లో రోడ్లు, భవనాల శాఖకు కేటాయించే నిధుల్లో...
	గత బడ్జెట్‌లో భారీ కేటాయింపులు
	* పనుల్లో కనిపించని పురోగతి
	* దీంతో ఈసారి నిధుల్లో కోత
	సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం మంజూరు చేసిన పనులు.. వాస్తవంగా జరుగుతున్న పనులకు పొంతన లేకపోవటంతో కొత్త బడ్జెట్‌లో రోడ్లు, భవనాల శాఖకు కేటాయించే నిధుల్లో ప్రభుత్వం కోత పెట్టింది. గత బడ్జెట్ కంటే దాదాపు రూ. 1,600 కోట్ల నిధులు తగ్గించింది. గత బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చు చేయటంలో ఆ శాఖ విఫలం కావటంతో ప్రభుత్వం ఈసారి తక్కువ నిధులే సరిపోతాయని భావించి రూ. 4,322 కోట్లతో సరిపుచ్చింది.
	
	మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రెండు వరసల రోడ్లు.. నదులు, వాగులు, వంకలపై అవసరమైన ప్రాంతాల్లో వంతెనలు అంటూ గత సంవత్సరం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు రూ. 11,600 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ఊపింది. వీటిని నిర్వహించే క్రమంలో గత బడ్జెట్‌లో రూ. 5,917 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చేసరికి రూ. 2,576 కోట్లనే ఖర్చు చేయగలిగారు. ఈ సంవత్సరం బడ్జెట్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇదే విషయమై అధికారులను నిలదీశారు.
	
	కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పనులను వేగంగా నిర్వహించలేకపోయామని, ఇకనుంచి ఊపందుకుంటాయని సమాధానమిచ్చారు. ఇందుకోసం కొత్త బడ్జెట్‌లో రూ. 5,500 కోట్లు కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. కానీ ఈసారి కూడా అధికారులు అనుకున్న వేగంతో పనులు చేయించలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అన్ని నిధులివ్వలేనని తేల్చి చెప్పారు. అనుకున్నట్టుగానే తాజా బడ్జెట్‌లో భారీగానే కోత పెట్టారు. ఈసారి కొత్తగా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం పనులే ఈసారి కొనసాగే అవకాశం ఉన్నందున వాటితోనే సరిపుచ్చుకోవాలన్న సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది.  
	 
	* ముఖ్యమైన జిల్లా రహదారుల నిర్మాణం కోసం రూ. 1,137 కోట్లు కేటాయించారు.
	* గజ్వేల్ ప్రాంతీయ అభివృద్ధి మండలి, ఇతర అనుసంధాన రోడ్ల అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు కేటాయించారు.
	* ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానంగా నిర్మించే రేడియల్ రోడ్ల కోసం రూ. 250 కోట్లు ప్రతిపాదించారు.
	* కొత్త రైల్వే లైన్ల కోసం రూ. 50 కోట్లు ప్రతిపాదించారు.
	* కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రూ. 50 కోట్లు, జిల్లా కలెక్టరేట్ భవనాల కోసం రూ. 3.50 కోట్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం భవనం కోసం రూ. కోటి, తెలంగాణ జర్నలిస్టుల భవన నిర్మాణం కోసం రూ. కోటి, తెలంగాణ కళాభారతి, ఇతర భవనాల కోసం రూ. 50 కోట్లు, రాజ్‌భవన్‌లో నిర్మాణాల కోసం రూ. 50 కోట్లు, సీనియర్ అధికారుల నివాస భవనాల నిర్మాణం కోసం రూ. 20 కోట్లు ప్రతిపాదించారు.
	* తెలంగాణ రోడ్ సెక్టార్ కోసం రూ. 60 కోట్లు చూపారు.
	* కోర్ నెట్‌వర్క్ రోడ్లకు రూ. 360 కోట్లు ప్రతిపాదించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
