జీహెచ్‌ఎంసీలో విచిత్రపరిస్థితి నెలకొంది. కొందరు అధికారులకు ఏ విభాగాలూ లేకపోగా...
కొందరు విధులకు దూరం
ఉన్న వారికి శాఖలేవో తెలియదు
మరికొందరికి అదనపు భారం
దిక్కుతోచని స్థితిలో అధికారులు
జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో విచిత్రపరిస్థితి నెలకొంది. కొందరు అధికారులకు ఏ విభాగాలూ లేకపోగా... మరికొందరు ‘అదనపు’ భారం మోయాల్సి వస్తోంది. వారు ఖాళీగా కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటే... వీరు అన్ని శాఖల పనులూ ఒక్కొక్కరే చేయలేక సతమతమవుతున్నారు. దీనికి పరిష్కారమేమిటో తెలియక ఇరువర్గాల వారూ తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ఈ నెల రెండోవారంలో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇద్దరిని స్పెషల్ కమిషనర్లుగా... ముగ్గురిని అడిషనల్ కమిషనర్లుగా నియమిస్తూ బదిలీ చేసింది. ఇద్దరు స్పెషల్ కమిషనర్లలో నవీన్‌మిట్టల్ మాత్రం విధుల్లో చేరారు. వీరబ్రహ్మయ్య చేరలేదు. ముగ్గురు అడిషనల్ కమిషనర్లలో డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాత్రమే చేరారు. మిగతా ఇద్దరు జి.కిషన్, దాసరి హరిచందనలు విధుల్లో చేరలేదు. వీరిలో వీరబ్రహ్మయ్య నెలరోజుల సెలవులో ఉన్నారు. ఆ తర్వాతైనా చేరతారా? లేక సెలవు పొడిగిస్తారా? అన్నది తెలియడం లేదు. మిగిలిన ఇద్దరు అడిషనల్ కమిషనర్లు సైతం సెలవులో ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీలో విధుల్లో చేరని వీరి సంగతలా ఉండగా... విధుల్లో చేరిన స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఇంతవరకు ఏ విభాగాలూ అప్పగించలేదని సమాచారం. మరో ఇద్దరు అడిషనల్ కమిషనర్లు శంకరయ్య, అన్నపూర్ణలకూ విభాగాలు లేవు. గతంలో క్రీడా విభాగాన్ని అన్నపూర్ణ పర్యవేక్షించగా... ఇటీవల దానిని కోఆర్డినేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న మరో అదనపు కమిషనర్ వెంకట్రామిరెడ్డికి అప్పగించారు.
సుమారు మూడు నెలల క్రితం బదిలీపై వచ్చిన శంకరయ్యకూ ఏ విభాగాన్నీ కేటాయించలేదు. ఇక మూడు జోన్లకు జోనల్ కమిషనర్లు లేరు. కీలకమైన వెస్ట్‌జోన్‌కు కమిషనర్ లేకపోవడంతో ఈస్ట్‌జోన్ కమిషనర్ రఘుప్రసాద్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. వీఐపీలతో పాటు రాజకీయ నేతలు, ఐఏఎస్‌ల తాకిడి ఎక్కువగా ఉండే సెంట్రల్‌జోన్‌కు రెగ్యులర్ కమిషనర్ లేరు. జీహెచ్‌ఎంసీలో పనిఒత్తిడి ఎక్కువగా ఉండే ఆరోగ్యం-పారిశుద్ధ్యం, రవాణా విభాగాలు చూస్తున్న రవికిర ణ్‌కు సెంట్రల్ జోన్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. కీలక మైన రె వెన్యూ- ప్రకటనలు, ఎన్నికల విభాగాలను పర్యవేక్షిస్తున్న హరికృష్ణకే నార్త్‌జోన్ బాధ్యతలు కట్టబెట్టారు. ఫైనాన్స్, యూసీడీ, ఐటీ శాఖలను జయరాజ్ కెన్నెడీ పర్యవేక్షిస్తున్నారు. ఇలా కీలక విభాగాలను పర్యవేక్షించే వారికి...అదనపు భారం పడుతుంటే... అస్సలు పని లేని వారిది గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి. పెద్దగా పని ఉండని విద్యుత్ విభాగాన్ని మరో అడిషనల్ క మిషనర్ వందన్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోని ఇతర విభాగాలతో పోలిస్తే విద్యుత్ శాఖలో పని ఒకింత తక్కువే. ఇక పరిపాలన, న్యాయ శాఖలను అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. గ తంలో ఇక్కడున్న ఐఏఎస్‌లు అహ్మద్‌బాబు, ప్రద్యుమ్నలు విభజన కేటాయింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. గతంలో వారు పర్యవేక్షించిన శాఖలను ఇంకా ఎవరికీ అప్పగించలేదు.
ఆస్తిపన్ను వసూలుకూ...
మరోవైపు, అందరికీ ఆస్తిపన్ను వసూళ్ల సూపర్‌వైజర్లుగా అదనపు బాధ్యతలున్నాయి. ప్రతిరోజూ వాటి నివేదికలు అందజేయడంతోపాటు అడపాదడపా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులెలా ముందుకు సాగుతాయో... ప్రజల ఫిర్యాదులెలా పరిష్కారమవుతాయో... కమిషనర్ ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.