ప్రేమ పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోసం | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోసం

Published Tue, Jan 5 2016 7:44 PM

Software engineer fraud in the name of love

ప్రేమ పేరుతో యువతులకు వలవేసి ఒకరి తర్వాత ఒకరిని పెళ్లిచేసుకున్న ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఛత్రినాక పోలీసులు  మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్మన్‌ఘాట్ గాయత్రీనగర్‌కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాప్ట్‌వేర్ ఇంజనీర్. సైదాబాద్‌కు చెందిన పుష్పలత(25) అనే యువతిని ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చక్కగా కాపురం చేసుకున్న ఇతగాడు రంగు మార్చాడు.


బీటెక్‌లో తనతో పాటు చదివిన గౌలిపురా శ్రీరాం కాలనీకి చెందిన స్వాతి (24)ని ప్రేమ ముగ్గులోకి దించాడు. అంతకు ముందు జరిగిన వివాహాన్ని దాచిపెట్టి 2015 జూన్ లో సీతాఫల్‌మండిలోని ఆర్యసమాజ్‌లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు.


తర్వాత మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకు రావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. కిరణ్ తో పాటు.. అతని కుటుంబ సభ్యులు కూడా పుష్పలతను వేధింపులకు గురిచేస్తూ ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెండో వివాహం సంగతి బయట పడింది. దీంతో పుష్పలత ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్‌తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా.. కిరణ్ కుమార్ తల్లి, అన్న, తమ్ముడు పరారీలో ఉన్నారు.

Advertisement
Advertisement