నేటి నుంచి బడులు | Schools from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బడులు

Jun 12 2017 1:47 AM | Updated on Oct 1 2018 5:40 PM

నేటి నుంచి బడులు - Sakshi

నేటి నుంచి బడులు

బడిగంట మోగనుంది. వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

సర్కారీలో సమస్యలు..ప్రైవేటులో ఫీజులు
- 7,093 పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేవు
భారీగా ఫీజుల పెంచిన ప్రైవేటు స్కూళ్లు
అధ్యయనమంటూ ‘ఫీజుల కమిటీ’ వాయిదాలు
 
సాక్షి, హైదరాబాద్‌: బడిగంట మోగనుంది. వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఎప్పట్లాగే సర్కారీ స్కూళ్లలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనుండగా ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు మోతెక్కనున్నాయి. 20 శాతం నుంచి 50 శాతం ఫీజులు పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు రంగం సిద్ధం చేశాయి. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ నివేదిక సమర్పించడంలో వాయిదాల పర్వం కొన సాగుతోంది. గత ఏప్రిల్‌లో ప్రభు త్వం నియమిం చిన ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది.

మే మూడో వారంలోనే గడువు ముగిసినా అధ్యయనం పేరుతో 15 రోజుల గడువు కోరింది. ఆ గడువూ మే 29తో ముగిసిపో యింది. ఈ నేపథ్యంలో తమకు పలు విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాలని సూచిస్తూ తిరుపతిరావు కమిటీకి ప్రభుత్వం సూచించింది. దీంతో కమిటీ మరో నెల రోజుల గడువు కోరింది. ఇంకేముంది ఇప్పుడు స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఆ నివేదిక ఇప్పట్లో ప్రభుత్వానికి చేరదు.. నియంత్రణ అమల్లోకి రాదు. దీంతో ఫీజుల భారాన్ని తల్లిదండ్రులు భరించక తప్పని పరిస్థితి నెలకొంది. 
 
వర్షమొస్తే వంట బంద్‌..
రాష్ట్రంలో 25,183 ప్రభుత్వ పాఠశాల లుండగా 8,112 పాఠశాలల్లో ఇప్పటికీ కిచెన్‌ షెడ్లు లేవు. దీంతో రానున్న వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. వర్షం వస్తే వంట ఆపాల్సిన పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 348 పాఠశాలలు ఇంకా చెట్ల కిందే కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో వాటి పరిస్థితి గందరగోళమే. అలాగే 7,093 పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేవు. మరోవైపు స్కూళ్లల్లో 27 వేల వరకు టాయిలెట్లు అవసరం ఉంది. అందులో 12 వేల వరకు బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల అవసరమున్నట్లు విద్యా శాఖ లెక్కలేసింది. 2 వేలకు పైగా స్కూళ్లల్లో విద్యుత్‌ సదుపాయం లేకపోగా 10 వేల పాఠశాలలకు ప్రహరీ గోడల్లేవు.
 
బడిబాట తరువాతే హేతుబద్ధీకరణ..
పది మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని విద్యాశాఖ మొదట్లో భావించినా ఆ విషయాన్ని ప్రస్తుతం పక్కనపెట్టింది. బడిబాట కార్యక్రమం తరువాత లెక్కలు సేకరించి విలీనంపై ముందుకు సాగాలని.. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. 
 
రేపటి నుంచి బడిబాట..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాల వారీగా సీనియర్‌ అ«ధికారులను నియమించి పిల్లల నమోదుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఈనెల 13 నుంచి 17 వరకు బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5, 7, 8 తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేసిన వారంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే పైతరగతుల్లో చేరేలా చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రుల డిమాండ్, విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకటో తరగతిలో ఇంగ్లిష్‌ మీడియం మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement