నన్ను వేధిస్తున్నారు.. రీసెర్చ్ స్కాలర్ ఆరోపణ | reasearch scholar raises complaint in press club agianst professors | Sakshi
Sakshi News home page

నన్ను వేధిస్తున్నారు.. రీసెర్చ్ స్కాలర్ ఆరోపణ

Dec 11 2013 1:38 AM | Updated on Jul 28 2018 8:40 PM

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్, కొంత మంది ప్రొఫెసర్లు గత కొంత కాలంగా తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని రీసెర్చ్ స్కాలర్, దళిత యువతి జ్యోతి పద్మ ఆరోపించారు.

 బషీర్‌బాగ్/ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్:
 ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్, కొంత మంది ప్రొఫెసర్లు గత కొంత కాలంగా తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని రీసెర్చ్ స్కాలర్, దళిత యువతి జ్యోతి పద్మ ఆరోపించారు. మంగళవారం పీయూసీఎల్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన రీసెర్చ్ గైడ్ సీహెచ్ ఆంజనేయులు లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఇతర ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. గైడ్ లైంగిక వేధింపులను సాకుగా తీసుకొని వైస్‌చాన్స్‌లర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎం.ఎస్.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మయ్య, ప్రొఫెసర్ సత్యనారాయణలు కూడా వేధించడం ప్రారంభించారన్నారు. ఈ విషయమై ఓయూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కనీసం పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కమిటీ వేశారని, ఆ కమిటీ ముందుకు ఎవరూ హాజరు కాలేదన్నారు. పైగా వైస్‌చాన్సలర్‌తో పాటు ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు తనపై తప్పుడు కేసులు పెట్టి హతమార్చుతానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 చర్య తీసుకోకుంటే ఆందోళన
 రీసెర్చ్ స్కాలర్, దళిత యువతి జ్యోతి పద్మను లైంగికంగా వేధిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాన్ని చేపడతానని పీయూసీఎల్ అధ్యక్షురాలు జయవింధ్యాల హెచ్చరించారు. ఓయూలో విద్యా వ్యతిరేక విధానాలు అమలు చేయడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే లైంగిక వేధింపుల సంఘటనపై కమిటీ వేసి విచారణ జరపాలని  కోరారు.
 
 విద్యార్థి సంఘాల ఖండన
 ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.సత్యనారాయణపై పీహెచ్‌డీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని (జ్యోతి పద్మ) చేసిన ఆరోపణలు అసత్యమని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. వీసీ లైంగికంగా వేధిస్తున్నారని పూర్వవిద్యార్థిని చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు స్టాలిన్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సత్య, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు నాగేశ్వర్‌రావు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు సాంబశివగౌడ్, రామారావుగౌడ్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తదితరులు ఖండించారు.
 
 మానసిక పరిస్థితి బాగోలేని విద్యార్థిని గతంలో తన పీహెచ్‌డీ గైడ్ (పర్యవేక్షకుడి)పై లైంగిక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. నాలుగు నెలల కిత్రం వీసీకి అసభ్య సందేశాలు సెల్ ఫొన్ ద్వారా పంపించిన ఆమెపై ఓయూ పోలీసులు కేసు పెట్టారన్నారు. వీసీపై లైంగిక ఆరోపణలు చేసిన ఓయూ పూర్వవిద్యార్థినిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలను వీసీ ప్రొ.సత్యనారాయణ కొట్టిపారేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement