breaking news
osmania university vice chancellor
-
రాహుల్ ఓయూ పర్యటనపై హౌజ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం పర్యటన అనుమతి వ్యవహారంపై మరో పిటిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓయూ వీసీ, హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పిటిషన్లో పేర్కొంది. దీంతో కాంగ్రెస్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని వీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మే 7వ తేదీన ఓయూలో పర్యటించి.. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆంక్షల నేపథ్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అందుకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించగా, నిర్ణయం వీసీదేనని హైకోర్టు సైతం పేర్కొంది. చదవండి: ఓయూకొచ్చి స్టూడెంట్స్‌తో నైట్ క్లబ్ గురించి చెప్తారా? -
Telangana: రాహుల్ టూర్ అనుమతిపై నిర్ణయం వీసీదే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. రాహుల్ టూర్ అనుమతిపై నిర్ణయాన్ని వీసీకే హైకోర్టు వదిలేసింది. దరఖాస్తును పరిశీలించాలని వీసీకి హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది. చదవండి👉: రాహుల్ రాకపై కాక! కాగా, రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చాంబర్ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. -
నన్ను వేధిస్తున్నారు.. రీసెర్చ్ స్కాలర్ ఆరోపణ
బషీర్‌బాగ్/ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్, కొంత మంది ప్రొఫెసర్లు గత కొంత కాలంగా తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని రీసెర్చ్ స్కాలర్, దళిత యువతి జ్యోతి పద్మ ఆరోపించారు. మంగళవారం పీయూసీఎల్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన రీసెర్చ్ గైడ్ సీహెచ్ ఆంజనేయులు లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఇతర ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. గైడ్ లైంగిక వేధింపులను సాకుగా తీసుకొని వైస్‌చాన్స్‌లర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎం.ఎస్.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మయ్య, ప్రొఫెసర్ సత్యనారాయణలు కూడా వేధించడం ప్రారంభించారన్నారు. ఈ విషయమై ఓయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కనీసం పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కమిటీ వేశారని, ఆ కమిటీ ముందుకు ఎవరూ హాజరు కాలేదన్నారు. పైగా వైస్‌చాన్సలర్‌తో పాటు ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు తనపై తప్పుడు కేసులు పెట్టి హతమార్చుతానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్య తీసుకోకుంటే ఆందోళన రీసెర్చ్ స్కాలర్, దళిత యువతి జ్యోతి పద్మను లైంగికంగా వేధిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాన్ని చేపడతానని పీయూసీఎల్ అధ్యక్షురాలు జయవింధ్యాల హెచ్చరించారు. ఓయూలో విద్యా వ్యతిరేక విధానాలు అమలు చేయడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే లైంగిక వేధింపుల సంఘటనపై కమిటీ వేసి విచారణ జరపాలని కోరారు. విద్యార్థి సంఘాల ఖండన ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.సత్యనారాయణపై పీహెచ్డీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని (జ్యోతి పద్మ) చేసిన ఆరోపణలు అసత్యమని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. వీసీ లైంగికంగా వేధిస్తున్నారని పూర్వవిద్యార్థిని చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు స్టాలిన్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సత్య, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నాగేశ్వర్రావు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు సాంబశివగౌడ్, రామారావుగౌడ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తదితరులు ఖండించారు. మానసిక పరిస్థితి బాగోలేని విద్యార్థిని గతంలో తన పీహెచ్డీ గైడ్ (పర్యవేక్షకుడి)పై లైంగిక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. నాలుగు నెలల కిత్రం వీసీకి అసభ్య సందేశాలు సెల్ ఫొన్ ద్వారా పంపించిన ఆమెపై ఓయూ పోలీసులు కేసు పెట్టారన్నారు. వీసీపై లైంగిక ఆరోపణలు చేసిన ఓయూ పూర్వవిద్యార్థినిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలను వీసీ ప్రొ.సత్యనారాయణ కొట్టిపారేశారు.