పార్కుల్లో ప్రవేశం మరింత భారం

parks entrty fees hike - Sakshi

లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో ప్రవేశ రుసుం పెంపు

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబంతో సరదాగా గడిపేందుకు.. బంధుమిత్రులతో ఆనందంగా ఉండేందుకు పార్కులకు వచ్చే సందర్శకులకు ప్రవేశ రుసుం ఇక మరింత భారం కానుంది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) ఆధ్వర్యంలో నడుస్తున్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్కులలో ప్రవేశ రుసుం పెంచాలని అధికారులు నిర్ణయించారు. పిల్లల ప్రవేశ రుసుంను రూ.10 నుంచి రూ.15కు, పెద్దల ప్రవేశ రుసుం రూ.20 నుంచి రూ.25కు పెంచారు. పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.  

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా..
ఎన్టీఆర్‌ గార్డెన్‌తో పాటు లుంబినీ పార్కులు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డాగా మారాయి. శని, ఆదివారాల్లో కుటుంబసభ్యులు పిల్లలతో కలిసి ఈ పార్కులకు క్యూ కడుతుంటారు. ఇప్పటికే ఈ మూడు పార్కుల నుంచి నెలసరి ఆదాయం సీజన్‌లో రూ.1.20 కోట్ల వరకు వస్తుండగా, అన్‌సీజన్‌లో రూ.75 లక్షలు వస్తోంది. తాజాగా ప్రవేశ రుసుం పెంపుతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బీపీపీ అధికారులు భావిస్తున్నారు.  

వాకర్లకు తప్పని పెంపు..  
సంజీవయ్య పార్కులో ప్రతిరోజూ ఉదయం వేళలో దాదాపు 500 మందికిపైగా వాకర్లు వాకింగ్‌ చేస్తుంటారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నడవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే వీరికి నెలసరి పాస్‌ కింద రూ.75 వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రవేశ రుసుం పెంపు నిర్ణయంతో వాకర్లకు కూడా నెలకు వసూలు చేస్తున్న రూ.75ను రూ.100కు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top