గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్లో మార్పు ఉండదు | no changes to ghmc elections suhedule | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్లో మార్పు ఉండదు

Jan 7 2016 1:50 AM | Updated on Sep 3 2017 3:12 PM

గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్లో మార్పు ఉండదు

గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్లో మార్పు ఉండదు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియకు ప్రభుత్వం మరోమారు చట్ట సవరణ చేసింది.

     ► జీహెచ్‌ఎంసీ చట్టానికి మళ్లీ సవరణలు
     ► షెడ్యూల్ కుదింపుతో వైరుధ్యమున్న నిబంధన తొలగింపు
     ► చట్టం నుంచి సెక్షన్ 40(1)ని తొలగిస్తూ ఉత్తర్వులు
     ► సెలవు దినాల్లోనూ ఎన్నికల సిబ్బంది పనిచేయాల్సిందే
 
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియకు ప్రభుత్వం మరోమారు చట్ట సవరణ చేసింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 33 (ఏ-డీ)కి సవరణల ద్వారా ఎన్నికల షెడ్యూల్ కాలాన్ని 26 రోజుల నుంచి 15 రోజులకు తగ్గిస్తూ ఈ నెల 4న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాధారణ సెలవు దినాల్లో సైతం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియల కోసం ఎన్నికల యంత్రాంగం పనిచేసేలా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసింది.

అయితే, జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 40(1) ప్రకారం ఎన్నికల షెడ్యూల్లో సాధారణ సెలవులు వస్తే ఆ మరుసటి రోజుకు సంబంధిత ప్రక్రియను పొడిగించాల్సిందే. సెక్షన్ 33(ఏ-డీ)కి చేసిన సవరణలు, సెక్షన్ 40(1) మధ్య పరస్పర వైరుధ్యం ఏర్పడటంతో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టానికి మళ్లీ సవరణలు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సెక్షన్ 40(1) అడ్డంకిగా మారే అవకాశం ఉండడంతో.. ఏకంగా ఈ సెక్షన్‌ను జీహెచ్‌ఎంసీ చట్టం నుంచి తొలగిస్తూ బుధవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చట్టాల సవరణ కోసం పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 కల్పిస్తున్న వెసులుబాటును మరోమారు వినియోగించుకుంది. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే.. నామినేషన్ల ఉపసంహరణ 14వ తేదీతో ముగియనుంది. అయితే, 14, 15 తేదీల్లో సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. సెలవు రోజుల్లో సైతం ఎన్నికల ప్రక్రియ యథాతథంగా కొనసాగేలా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
 
నామినేషన్ పత్రంలో సవరణలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాల నమూనా (ఫారం-8)లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 36(1)లోని 7, 8, 10 నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీనిపైనా పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫారం-8లో ఈ కింది సమాచారాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

 -అభ్యర్థి ఓటును కలిగిన వార్డుకి సంబంధించిన ఓటరు జాబితా పేరు, సంఖ్య
 -వార్డు ఓటరు జాబితాలో అభ్యర్థి పార్ట్ నంబర్, సీరియల్ నంబర్
 -వార్డు ఓటరు జాబితాలో అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి పార్ట్ నంబర్, సీరియల్ నంబర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement