breaking news
suhedule
-
గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్‌కు షాక్
-
గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్లో మార్పు ఉండదు
► జీహెచ్ఎంసీ చట్టానికి మళ్లీ సవరణలు ► షెడ్యూల్ కుదింపుతో వైరుధ్యమున్న నిబంధన తొలగింపు ► చట్టం నుంచి సెక్షన్ 40(1)ని తొలగిస్తూ ఉత్తర్వులు ► సెలవు దినాల్లోనూ ఎన్నికల సిబ్బంది పనిచేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియకు ప్రభుత్వం మరోమారు చట్ట సవరణ చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 33 (ఏ-డీ)కి సవరణల ద్వారా ఎన్నికల షెడ్యూల్ కాలాన్ని 26 రోజుల నుంచి 15 రోజులకు తగ్గిస్తూ ఈ నెల 4న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాధారణ సెలవు దినాల్లో సైతం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియల కోసం ఎన్నికల యంత్రాంగం పనిచేసేలా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసింది. అయితే, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 40(1) ప్రకారం ఎన్నికల షెడ్యూల్లో సాధారణ సెలవులు వస్తే ఆ మరుసటి రోజుకు సంబంధిత ప్రక్రియను పొడిగించాల్సిందే. సెక్షన్ 33(ఏ-డీ)కి చేసిన సవరణలు, సెక్షన్ 40(1) మధ్య పరస్పర వైరుధ్యం ఏర్పడటంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టానికి మళ్లీ సవరణలు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సెక్షన్ 40(1) అడ్డంకిగా మారే అవకాశం ఉండడంతో.. ఏకంగా ఈ సెక్షన్‌ను జీహెచ్ఎంసీ చట్టం నుంచి తొలగిస్తూ బుధవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చట్టాల సవరణ కోసం పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 కల్పిస్తున్న వెసులుబాటును మరోమారు వినియోగించుకుంది. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే.. నామినేషన్ల ఉపసంహరణ 14వ తేదీతో ముగియనుంది. అయితే, 14, 15 తేదీల్లో సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. సెలవు రోజుల్లో సైతం ఎన్నికల ప్రక్రియ యథాతథంగా కొనసాగేలా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. నామినేషన్ పత్రంలో సవరణలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాల నమూనా (ఫారం-8)లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 36(1)లోని 7, 8, 10 నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీనిపైనా పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫారం-8లో ఈ కింది సమాచారాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. -అభ్యర్థి ఓటును కలిగిన వార్డుకి సంబంధించిన ఓటరు జాబితా పేరు, సంఖ్య -వార్డు ఓటరు జాబితాలో అభ్యర్థి పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ -వార్డు ఓటరు జాబితాలో అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ -
పక్షం రోజుల్లోనే ఎన్నికలు పూర్తి
► గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ కుదింపు.. ► 26 రోజుల నుంచి 15 రోజులకు తగ్గింపు.. ► నోటిఫికేషన్ తర్వాత నామినేషన్లకు 3 రోజులే గడువు ► నామినేషన్ల పరిశీలన తర్వాత ► ఉపసంహరణకు ఒక్కరోజే అవకాశం ► ఆ తర్వాత తొమ్మిది రోజుల్లో పోలింగ్ ► జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు 26 రోజులు పడుతుంది. అయితే కేవలం 15 రోజుల్లో ఎన్నికలు ముగించేలా జీహెచ్ఎంసీ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏ చట్టానికైనా సవరణలు జరపవచ్చని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 చెబుతోంది. ఈ వెసులుబాటు ఆధారంగా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు దగ్గర పడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇకపై ఇలా ఉండనుంది. ► నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి నామినేషన్ల దాఖలుకు సెలవులతో సంబంధం లేకుండా గరిష్టంగా 3 రోజుల సమయం కేటాయిస్తారు. ఇంతకుముందు 4-7 రోజుల వ్యవధి ఉండేది. ► నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన మరుసటి రోజే పరిశీలన(స్క్రూటినీ) నిర్వహిస్తారు. సెలవులు వచ్చినా, రాకపోయినా ఇందులో మార్పు ఉండదు. ఇంతకు ముందు నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత 3 రోజుల వ్యవధిలో పరిశీలన జరిపేవారు. ► పరిశీలన తర్వాతి రోజే నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఇంతకుముందు 3 రోజుల గడువు ఉండేది. ► నామినేషన్ల ఉపసంహరణ రోజుతో కలిపి 9 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహిస్తారు. ఇంతకుముందు 12 రోజుల వ్యవధి ఉండేది. -
వైఎస్ జగన్ ప్రచారంలో స్వల్ప మార్పులు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో 18వ తేదీ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆ వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మూడో రోజు 18వ తేదీ బుధవారం మొత్తం 45 కి.మీ. మేర వైఎస్ జగన్ ప్రచారం సాగనుంది. బుధవారం ఉదయం జితేందర్‌నగర్‌లో ప్రారంభమై పెద్దమ్మగడ్డ, పోచమ్మ మైదాన్, గొర్రెకుంట క్రాస్, గీసుకొండ, శంభునిపేట జంక్షన్, శివ నగర్ మీదుగా సాయంత్రం హన్మకొండ చౌరస్తాకు ఎన్నికల ప్రచారం చేరనుంది. బుధవారం సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవచారి గ్రౌండ్స్‌లో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. చివరి రోజు 19వ తేదీ గురువారం మొత్తం 62 కి.మీ. మేర వైఎస్ జగన్ ప్రచారం జరగనుంది. గురువారం ఉదయం హన్మకొండలో ప్రారంభమై ధర్మాసాగర్, స్టేషన్ ఘనపూర్, మీదుగా రఘనాథపల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి వైస్ జగన్ హైదరాబాద్ పయనమవుతారు. గురువారం స్టేషన్ ఘనపూర్‌లో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం నుంచి వరంగల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.