వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో 18వ తేదీ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి.
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో 18వ తేదీ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆ వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
మూడో రోజు 18వ తేదీ బుధవారం మొత్తం 45 కి.మీ. మేర వైఎస్ జగన్ ప్రచారం సాగనుంది. బుధవారం ఉదయం జితేందర్నగర్లో ప్రారంభమై పెద్దమ్మగడ్డ, పోచమ్మ మైదాన్, గొర్రెకుంట క్రాస్, గీసుకొండ, శంభునిపేట జంక్షన్, శివ నగర్ మీదుగా సాయంత్రం హన్మకొండ చౌరస్తాకు ఎన్నికల ప్రచారం చేరనుంది. బుధవారం సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవచారి గ్రౌండ్స్లో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
చివరి రోజు 19వ తేదీ గురువారం మొత్తం 62 కి.మీ. మేర వైఎస్ జగన్ ప్రచారం జరగనుంది. గురువారం ఉదయం హన్మకొండలో ప్రారంభమై ధర్మాసాగర్, స్టేషన్ ఘనపూర్, మీదుగా రఘనాథపల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి వైస్ జగన్ హైదరాబాద్ పయనమవుతారు. గురువారం స్టేషన్ ఘనపూర్లో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం నుంచి వరంగల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.