
పక్షం రోజుల్లోనే ఎన్నికలు పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు 26 రోజులు పడుతుంది.
► గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ కుదింపు..
► 26 రోజుల నుంచి 15 రోజులకు తగ్గింపు..
► నోటిఫికేషన్ తర్వాత నామినేషన్లకు 3 రోజులే గడువు
► నామినేషన్ల పరిశీలన తర్వాత
► ఉపసంహరణకు ఒక్కరోజే అవకాశం
► ఆ తర్వాత తొమ్మిది రోజుల్లో పోలింగ్
► జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేసిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు 26 రోజులు పడుతుంది. అయితే కేవలం 15 రోజుల్లో ఎన్నికలు ముగించేలా జీహెచ్‌ఎంసీ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది.
రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏ చట్టానికైనా సవరణలు జరపవచ్చని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 చెబుతోంది. ఈ వెసులుబాటు ఆధారంగా జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు దగ్గర పడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇకపై ఇలా ఉండనుంది.
► నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి నామినేషన్ల దాఖలుకు సెలవులతో సంబంధం లేకుండా గరిష్టంగా 3 రోజుల సమయం కేటాయిస్తారు. ఇంతకుముందు 4-7 రోజుల వ్యవధి ఉండేది.
► నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన మరుసటి రోజే పరిశీలన(స్క్రూటినీ) నిర్వహిస్తారు. సెలవులు వచ్చినా, రాకపోయినా ఇందులో మార్పు ఉండదు. ఇంతకు ముందు నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత 3 రోజుల వ్యవధిలో పరిశీలన జరిపేవారు.
► పరిశీలన తర్వాతి రోజే నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఇంతకుముందు 3 రోజుల గడువు ఉండేది.
► నామినేషన్ల ఉపసంహరణ రోజుతో కలిపి 9 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహిస్తారు. ఇంతకుముందు 12 రోజుల వ్యవధి ఉండేది.