Sakshi News home page

విచారణ పేరుతో పిలిచి హింసిస్తున్నారు..

Published Fri, Aug 14 2015 6:20 PM

విచారణ పేరుతో పిలిచి హింసిస్తున్నారు.. - Sakshi

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఏసీబీ అధికారులు తనను సాక్షిగా పదే పదే విచారణకు పిలుస్తూ హింసిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం నేత వి.ప్రదీప్ చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పదే పదే పిలవకుండా, వేధింపులకు గురి చేయకుండా ఏసీబీ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతోనే ఏసీబీ అధికారులు వేధిస్తున్నారని వివరించారు. ఏసీబీ అధికారులు విచారణకు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారని, కొన్ని సందర్భాల్లో దురుసుగా వ్యహరిస్తున్నారని తెలిపారు. ఓటుకు కోట్లు కేసుతో పిటిషనర్ సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపకుండా వేధిస్తున్నారని ఆయన కోర్టుకు విన్నవించారు.

ఫలానా వారి పేర్లు చెప్పాలంటూ పిటిషనర్లపై ఏసీబీ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్నారు చెప్పారు. అయితే ఈ వాదనలను ఏసీబీ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్ వి.రవికిరణ్‌రావు తోసిపుచ్చారు. సాక్షిగా ఓ వ్యక్తిని ఎన్నిసార్లయినా విచారణకు పిలిచే అధికారం దర్యాప్తు సంస్థకు ఉందన్నారు.

పలువురిని విచారించినప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయని, వాటిని నిర్ధారించుకునేందుకు గతంలోని పిలిచిన వ్యక్తిని మరోసారి పిలిచి విచారించాల్సి ఉంటుందని, ఇది దర్యాప్తులో భాగం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని కోర్టుకు వెల్లడించాలని రవి కిరణ్‌రావుకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement