ఏసీబీ విచారణకు లోకేశ్ డ్రైవర్ డుమ్మా | Lokesh Driver Absent to ACB investigation | Sakshi
Sakshi News home page

ఏసీబీ విచారణకు లోకేశ్ డ్రైవర్ డుమ్మా

Aug 14 2015 12:00 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ విచారణకు లోకేశ్ డ్రైవర్ డుమ్మా - Sakshi

ఏసీబీ విచారణకు లోకేశ్ డ్రైవర్ డుమ్మా

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి ఏసీబీ విచారణకు గైర్హాజరయ్యారు.

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి ఏసీబీ విచారణకు గైర్హాజరయ్యారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ ఎదుట హాజరు కావాలన్న ఏసీబీ ఆదేశాలను బేఖాతరు చేశారు. అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం గురువారం ఉదయం 10.30 గంటల కల్లా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలి, కానీ రాలేదు. కొండల్‌రెడ్డి కోసం గురువారం రోజంతా ఎదురు చూసిన ఏసీబీ అధికారులు... తదుపరి కార్యాచరణపై దృష్టిసారించారు.

ప్రస్తుతం సీఆర్‌పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం జారీచేసిన నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో... నేరుగా సెక్షన్ 41ఏ (నిందితుడిగా అనుమానిస్తూ) నోటీసులు జారీచేసేందుకు ఏసీబీ కసరత్తు చేస్తోంది. అసలు ఈ కేసులో కీలకమైన వ్యక్తులంతా విచారణకు డుమ్మా కొడుతుండడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది. లోకేశ్ డ్రైవర్ సహా ఇలా డుమ్మా కొడుతున్న వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు నోటీసులు అందుకున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు. తాజాగా లోకేశ్ డ్రైవర్ కూడా డుమ్మా కొట్టారు.
 
‘పెద్ద’ల పాత్రను దాచేందుకే...?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.50 లక్షలిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏసీబీ చిత్రీకరించిన వీడియోలో రేవంత్ పదే పదే తమ ‘బాస్’ ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ఈ వీడియో, ఆడియో టేపులు వాస్తవమైనవంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలను ఛేదించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఒక్కొక్కరికీ నోటీసులిస్తూ ‘పెద్ద’ల పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. అందులో భాగంగా చంద్రబాబు తనయుడు లోకేశ్ పాత్రపై ఏసీబీకి కొంత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు లోకేశ్ సారథ్యంలోనే రూపకల్పన జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతోపాటు ఆర్థిక అంశాలపైనా బలమైన ఆధారాలను సేకరించేందుకు ఏసీబీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వీటి నుంచి తప్పించుకోవడానికే... లోకేశ్ తన డ్రైవర్‌ను అజ్ఞాతంలోకి పంపినట్లు అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement