తమ్ముడూ లోకేశ్.. మాటలు కట్టిపెట్టు | ktr fire on lokesh nara | Sakshi
Sakshi News home page

తమ్ముడూ లోకేశ్.. మాటలు కట్టిపెట్టు

Jan 28 2016 3:41 AM | Updated on Aug 30 2019 8:24 PM

తమ్ముడూ లోకేశ్.. మాటలు కట్టిపెట్టు - Sakshi

తమ్ముడూ లోకేశ్.. మాటలు కట్టిపెట్టు

‘‘కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని తమ్ముడు లోకేశ్ అంటున్నాడు. మొన్ననే అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ తట్టెడు మట్టి..

కేంద్రం నుంచి  ఏపీకే నిధులు తేలేకపోయావు..
హైదరాబాద్‌కు ఏం తెస్తావు? హైదరాబాద్‌ను

చూసుకోవడానికి కేసీఆర్ ఉన్నారు
ఐటీ నిపుణులతో  ముఖాముఖిలో మంత్రి కేటీఆర్


సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని తమ్ముడు లోకేశ్ అంటున్నాడు. మొన్ననే అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లు ఇచ్చి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు సొంత రాష్ట్రానికి ఒక్క పైసా తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు పక్క రాష్ట్రానికి తెస్తానని చెబుతున్నారు.

వాళ్లను చూస్తే.. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానని బయలుదేరాడట అన్న సామెత గుర్తుకువస్తోంది..’’ అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ‘తమ్ముడూ లోకేశ్.. ముందు అమరావతికి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోండి. హైదరాబాద్‌ను చూసుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఉన్నారు..’’ అని సూచిం చారు. తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగులతో నిర్వహించిన ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడారు.

రాష్ట్ర విభజన వల్ల ఏపీకే మేలు జరిగిందని ఆయన చెప్పారు. ‘‘ఆనాడు ప్రజాభిప్రాయం విడిపోయింది. తెలంగాణ వస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే ఏ ఒక్కరికీ రక్షణ ఉండదని, ఎవరినీ ఇక్కడ బతకనీయరని, పెట్టుబడులు రావని, ఐటీ రంగమైతే తట్టాబుట్టా అన్నీ సర్దుకుని వెళ్లిపోతుందని దుష్ర్పచారం చేశారు. 18 నెలల్లో హైదరాబాద్ ఐటీ రంగం బాగైందా, చెడిపోయిందా?..’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. విభజనతో రెండు ప్రాంతాలకు మేలు జరుగుతుందని, ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు గా కలిసే ఉంటామని తాము చెప్పిందే నిజమైందని చెప్పారు. ఏపీకి 18 నెలల్లో కొత్తగా ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌లు మం జూరయ్యాయని... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతోందనీ, అమరావతి నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.

అమెరికా తర్వాత తెలంగాణే..
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు 14 శాతంకాగా.. తెలంగాణ సగటు 16 శాతమని కేటీఆర్ తెలిపారు. గత 18 నెలల్లో గూగుల్, అమెజాన్, ఉబర్ లాంటి కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్‌ల కోసం అమెరికా తర్వాత హైదరాబాద్‌నే ఎంచుకోవడం ఇక్కడి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని బొటానిక్స్, ఫోటానిక్స్, సైబర్ సెక్యూరిటీ , డిజైన్ ఇంజనీరింగ్ రంగాలపై దృష్టిసారించామని... యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

త్వరలో వరంగల్‌కు మూడు ఐటీ కంపెనీలను పరిచయం చేయబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్‌కు సైతం వెళ్లేందుకు కొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని.. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు పొందుతున్న ప్రయోజనాలను ఇతర పట్టణాల్లో వర్తింపజేసే విధంగా కొత్త ఐటీ పాలసీ ఉంటుందని తెలిపారు.

ఓటు వేయండి
హైదరాబాద్ తరహా నగరాల్లో చదువుకున్న యువత, ప్రధాన ఐటీ ఉద్యోగులు ఓటేయరనే అపవాదు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యావంతులు ఓటేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే సంతోషిస్తానని.. కనీసం ఎవరికైనా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్ ప్రజలు అందరికీ అవకాశం ఇచ్చారనీ... కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, మజ్లిస్ పార్టీల అభ్యర్థులు మేయర్ పీఠంపై కూర్చున్నారని చెప్పారు.

వారు పనిచేస్తే నగరంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఉండేవి కావని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.విశ్వేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్ నేత బి.ప్రకాశ్, టీటా వ్యవస్థాపకుడు సుదీప్ కుమార్ మక్తాల, ఫోనిక్స్ డెరైక్టర్ శ్రీకాంత్ బాడిగ, ఎండీ గోపీకృష్ణ పాల్గొన్నారు.

 చంద్రబాబువన్నీ అవాస్తవాలు..
హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు అంటున్నారని... అసలు ఒక వ్యక్తి వల్లో, ఒకప్రభుత్వం వల్లో ఒక రంగం పూర్తిగా అభివృద్ధి చెందదని కేటీఆర్ స్పష్టం చేశారు. 1996-2004 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండడం, దూకుడుగా మార్కెటింగ్ చేయడం సహకరించిందని చెప్పారు. అంతమాత్రాన ‘నేనే చేసాను.. నేనే కట్టాను.. నేనే కంప్యూటర్ కనిపెట్టాను.. నేనే ఇంటర్నెట్ కనిపెట్టాను అంటూ చంద్రబాబు చెప్పుకోవడంలో వాస్తవం లేద’ని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement