జల గరళం | Incuro chemicals into the ground | Sakshi
Sakshi News home page

జల గరళం

Aug 10 2015 11:48 PM | Updated on Sep 3 2017 7:10 AM

జల గరళం

జల గరళం

అదో ప్రత్యేక ప్రపంచం. అక్కడ ‘మంచినీరు’ దొరకదు.

భూమిలోకి ఇంకుతున్న రసాయనాలు
కలుషితమవుతున్న జలం
ఇళ్ల పేరిట అనుమతి... గోదాముల నిర్మాణం
చోద్యం చూస్తున్న అధికార గణం
ఇదీ దూలపల్లి పారిశ్రామిక వాడ దుస్థితి

 
కుత్బుల్లాపూర్  అదో ప్రత్యేక ప్రపంచం. అక్కడ ‘మంచినీరు’ దొరకదు. తాగునీటి కోసం అక్కడి జనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన దుస్థితి. పొరపాటున ఎవరైనా బోరు వేసి... నీటిని ఒడిసి పడదామని ప్రయత్నించినా... రసాయనాలతో కూడిన ఎర్రటి జలం ఉబికి వస్తుంది. అది తాగితే అంతే. ఇదీ దూలపల్లి పారిశ్రామివాడ పరిస్థితి. ఆ ప్రాంతంలోని రసాయన గోదాముల పుణ్యమా అని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ బోర్లు వేసినా వచ్చేది ఎర్ర నీరే. ఫలితంగా స్థానికులు తాగునీటి కోసం అల్లాడాల్సిన దుస్థితి నెలకొంటోంది.

 భూమిలోకి రసాయనాలు  ఈ పారిశ్రామికవాడలో ఒక్కో గోదామును సుమారు
1000 నుంచి 1500 గజాల విస్తీర్ణంలో  నిర్మించారు. వీటిలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చే రసాయన డ్రమ్ములు (సాల్వెంట్ల) శుభ్రం చేయగా... వచ్చే వ్యర్ధాలను భూమిలో ఇంకే లా ఇంకుడు గుంతల వంటివి తవ్వుతున్నారు. తద్వారా రసాయనాలు భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. దీంతో దూలపల్లితో పాటు ఫాక్స్‌సాగర్ సమీపం వరకు ఎక్కడ బోర్లు వేసినా రంగు నీరే వస్తుంది. అతి ప్రమాదకరమైన రసాయనాలు ఇక్కడికి తీసుకువచ్చి శుద్ధి పేరిట భూమిలోకి వదలడంతో చెట్లు కూడా మోడువారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో గేదెలు ఇక్కడి రసాయనాలు కలిసిన నీటిని తాగి మృత్యువాత పడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో దూలపల్లి నీటి కోసం భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
 
అక్రమాలకు నెలవు...
 అక్కడివన్నీ అక్రమ రసాయన గోదాములే. అది తెలిసినా... ఎప్పుడోగానీ అధికారులు కదలరు. ఎప్పుడైనా తనిఖీలకు వారు సిద్ధపడితే గోదాములకు తాళాలు పడతాయి. గతంలో అక్కడ జరిగిన అగ్ని ప్రమాదాలలో ఎంతో మంది అమాయకులు మృత్యువాత పడ్డారు.ఇంత జరుగుతున్నా నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో వారు సులువుగా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మాటకొస్తే వారి కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నట్టు సమాచారం. గతంలో ఈ గోదాముల వ్యవహారంలో ఇద్దరు ఈవోలు సస్పెండయ్యారు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. పత్రికల్లో కథనాలు వచ్చినపుడు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసి హడావుడి చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. పీసీబీ అధికారులకు ఇటువైపు చూడాలన్న ఆలోచనే ఉన్నట్టు లేదు.
     
దూలపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 137లో 13.3 ఎకరాలు ఉంది. ఇంటి నిర్మాణం పేరుతో కొందరు పంచాయతీలో అనుమతి తీసుకుని బహుళ అంతస్తులను తలపించేలా గోదాములు నిర్మిస్తున్నారు. వీటిలో 81 గోదాములకు అనుమతులు లేకపోవడంతో ఇటీవల పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు.{పశాంత్‌నగర్ సర్వే నెంబరు 182లో 15.7 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. 2004 ముందు ఎస్సీలకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అనంతరం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక్కడ రెవెన్యూ రికార్డుల లో ప్రభుత్వ స్థలం అని ఉండగా...  గజం స్థలం ఖాళీ లేకుండా ప్రమాదకర పరిశ్రమలను ఏర్పాటు చేశారు.
 
అంతా నిమిషాల్లోనే..
 గోదాముల్లో రసాయన డ్రమ్ములను నిల్వ చేయాలన్నా... ఇక్కడి నుంచి ఇతర ప్రదేశాలకుతరలించాలన్నా నిమిషాల్లోనే పని జరిగిపోతుంది. గోదాములకు తాళం వేసి, రాత్రి వేళల్లో ఎక్కువగా కార్యకలాపాలు కొనసాగిస్తారు. పగటి వేళల్లో వాహనాల్లో వచ్చే  రసాయన డ్రమ్ములను లోపలికి తీసుకెళ్లి... పది నిమిషాల్లోనే నిల్వ చేసి జారుకుంటారు. ఒకవేళ ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే... దాడులకు పాల్పడిన సంఘటనలు అనేకం.

 స్టీ‘రింగ్’ తిప్పుతారు
 గోదాముల నిర్వాహకులు రింగై... ఓ సొసైటీని ఏర్పాటు చేసుకుని ఒకరికి బాధ్యతలు అప్పగించారు. ఆయన కనుసన్నల్లోనే తతంగమంతా జరిపిస్తుంటారు. ప్రతి నెలా నిర్వాహకుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ, పీసీబీ అధికారులకు మామూళ్ల రూపంలో అందజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయగా... గోదాముల నిర్వాహకులంతా కలసి పెద్ద మొత్తంలో ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తమ్మీద అధికారుల అలసత్వం తమ ప్రాణాల మీదకు తెస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement