ఈ నగరానికి ఏమైంది? | Increasing horrors | Sakshi
Sakshi News home page

ఈ నగరానికి ఏమైంది?

Apr 2 2015 11:50 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఈ నగరానికి ఏమైంది? - Sakshi

ఈ నగరానికి ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు దోపిడీలు...దొంగతనాలు... మరోవైపు లైంగిక దాడులు...

విస్తరిస్తున్న తుపాకీ సంస్కృతి
పెరుగుతున్న దారుణాలు
వరుస సంఘటనలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి

 
ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు దోపిడీలు...దొంగతనాలు... మరోవైపు లైంగిక దాడులు... హత్యా యత్నాలు... హ త్యోదంతాలు. ‘విశ్వ’ నగరం వైపు అడుగులు వేస్తున్నామని ఏలికలు చెబుతుంటే... వాస్తవ పరిస్థితులు భీతిగొల్పుతున్నాయి. గ్రేటర్... నేరాల రాజధానిగా మారుతోంది. తుపాకీ నీడలో...క్షణక్షణం భయంభయంగా జనం కాలం గడపాల్సి వస్తోంది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించి... నేర రహిత రాజధానిగా మారుస్తామని చెబుతున్న పోలీసు పెద్దల మాటలు నీటి మూటలవుతున్నాయి. నిత్యం ఏదో ఒక మూల తుపాకులు పేలుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. బుధవారం మధ్యాహ్నం జింకలబావి కాలనీలో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడగా...అదే రోజు అర్థరాత్రి సికింద్రాబాద్ పరిసరాల్లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలు నగరంలోని నేర సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ప్రజల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పోలీసుల పనితీరుకు సవాల్‌గా నిలుస్తున్నాయి.

మహా నగరంలో తుపాకీ సంస్కృతి (గన్ కల్చర్) పెరుగుతోంది. చిన్నపాటి సంఘటనలకే తుపాకులు పేలుతున్నాయి. జనం ప్రాణాలు హరిస్తున్నాయి. దీని వెనుక అధికార యంత్రాంగం వైఫల్యం ఉందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఎంత మందికి రివాల్వర్ లెసైన్స్‌లు ఉన్నాయి? వారు చెప్పిన చిరునామాలో ఉంటున్నారా? రీ-రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారా? ఎన్నికలు, పండుగల సందర్భంగా స్థానిక ఠాణాల్లో ఆయుధాలను డిపాజిట్ చేస్తున్నారా? ఏ పోలీసు స్టేషన్‌లో ఎంత మందికి రివాల్వర్ లెసైన్సులు ఉన్నాయి? ఈ ప్రశ్నలను మన పోలీసుల ముందు ఉంచితే మౌనమే సమాధానంగా వస్తోంది. వ్యక్తిగత భద్రత వంటి కారణాలను చూపి అనేక మంది హోం మంత్రిత్వ శాఖ, జిల్లా మెజిస్ట్రేట్లు, కమిషనర్ల నుంచి ఆయుధ లెసైన్సులు తీసుకుంటున్నారు. సాధారణ డ్రైవింగ్ లెసైన్సు ఇవ్వడానికే సవాలక్ష పరీక్షలు పెడుతుంటారు. కానీ కీలకమైన ఆయుధాల లెసైన్స్‌ల విషయంలో అలాంటివేమీ లేవు.నివాస ధ్రువపత్రం, నేరచరిత్ర లేకపోవడం... దుర్వినియోగ పరచడనే నమ్మకం ఉంటే చాలు లెసైన్స్ వచ్చేస్తుంది. ఆయుధాన్ని ఎలా భద్రపరచాలి? ఎప్పుడు వినియోగించాలి? అనే అంశాలపై ఆ వ్యక్తికి అవగాహన ఉందా? శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది కూడా పరిశీలించడం లేదు. ఫలితంగా అనేక సందర్భాల్లో ఇవి దుర్వినియోగమవుతున్నాయి.

జంట పోలీసు కమిషరేట్లలో ఉండే పోలీసు క్షేత్ర స్థాయి సిబ్బంది సంఖ్య దాదాపు 10 వేలు. ఇక్కడున్న లెసైన్సుడు ఆయుధాలను లెక్కిస్తే... అవీ దాదాపు 10 వేల వరకు ఉన్నాయి. ఇక అక్రమంగా ఉన్న ఆయుధాలకు అంతేలేదు. దీన్ని బట్టి నగరంలో ఏ స్థాయిలో గన్ కల్చర్ ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్తుత లెక్కల ప్రకారం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 4,685 మందికి లెసైన్సులు ఉండగా... వారి వద్ద ఉన్న ఆయుధాల సంఖ్య 6,054. అలాగే సైబారాబాద్‌లో 4,489 మందికి లెసైన్సులు ఉండగా 4,988 ఆయుధాలు కలిగి ఉన్నారు. జంట కమిషనరేట్‌ల పరిధిలో సుమారు 1622 మంది రీ-రిజిస్ట్రేషన్ చే యించుకోవడం లేదని...అవసరమైన సందర్భాల్లో ఠాణాలలో డిపాజిట్ చేయడం లేదని విచారణలో తేలింది.
 
రవాణాకు ప్రత్యేక ముఠాలు..

 
నగరానికి ఉత్తరాది నుంచి తుపాకులు సరఫరా చేయడానికి ప్రత్యేక ముఠాలు పని చేస్తున్నాయి. రైళ్లలోనూ, ట్రాన్స్‌పోర్ట్ లారీల్లోనూ అక్రమంగా ఆయుధాలను చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని అదనపు ఆదాయ మార్గంగా భావిస్తున్నారు. నగరంలో స్థిరపడిన బీహారీలు కొందరు ఆయుధాలను తీసుకువ చ్చి విక్రయిస్తున్నారు. దీనిపై పోలీసు నిఘా అంతంత మాత్రమే. ఓ ముఠా దొరికినప్పుడు అరెస్టు చేయడంతో సరిపెడుతున్నారు. ఎవరైనా చొరవ తీసుకుని దర్యాప్తు కోసం రాష్ట్రం దాటినా.. వారికి అక్కడి పోలీసుల నుంచి సహకారం అందడంలేదు. ఒక్కోసారి ఎదురుదాడులు జరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న అధికారులు సైతం మిన్నకుండి పోవాల్సి వస్తోంది.
 
రెన్యూవల్ ఏదీ...

 
లెసైన్స్‌లు పొంది, ఆయుధాలు తీసుకున్న వారిలో చాలా మంది తరచూ ఇళ్లు మారుతున్నారు. ఆ సమయాల్లో స్థానిక పోలీసులకు నెల రోజుల్లో తన ఆయుధం రెన్యూవల్ (రీ-రిజిస్టేషన్)కు దరఖాస్తు చే సుకోవాలి. ఇది పక్కాగా అమలు కావట్లేదు. దీనిపై వివిధ పోలీసు స్టేషన్లు, కమిషనరేట్ల మధ్య సమన్వయం కొరవడుతోంది. ఫలితంగా ఆయుధాలు కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? వారి కదలికలేమిటనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement