నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఓటర్ల ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది.
ఓటర్ల ప్రజాభిప్రాయ సేకరణ సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్ అధికారి ఈ నెల 15న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ స్వచ్ఛంద సంస్థ ‘స్పార్క్’ ఏపీ కార్యదర్శి నున్నా రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపిస్తూ... రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వులు ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల్లో ఎన్నిక ప్రారంభం కావడానికి 48 గంటల ముందు నుంచి మాత్రమే సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు.