
విద్యార్థులకు రవాణా ఖర్చుల మంజూరు
ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాస ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు గాను రవాణా ఖర్చులు ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది.
సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఇందుకు ఆమోదం తెలపడంతో విద్యార్థులకు ఈ మొత్తాన్ని అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు అందుబాటులో లేని ఆ విద్యార్థులకు ఈ మొత్తాన్ని అందజేయనుంది. ట్రాన్స్‌పోర్టు సదుపాయం వినియోగించుకునే విద్యార్థులు బ్యాంకు అకౌంట్ నంబర్లు, వారి వివరాలు, ఆధార్ నంబరు ఇస్తే ఆ మొత్తాన్ని అందజేస్తామని పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని డీఈవోలను పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ఆదేశించారు.