పసిడి దొంగలు | Gold thieves | Sakshi
Sakshi News home page

పసిడి దొంగలు

Jan 3 2014 3:53 AM | Updated on Aug 25 2018 6:22 PM

నగరంలో బంగారమే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక్క గురువారమే ఆయా ప్రాంతాల్లో పంజా విసిరి 34 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.

=  వేర్వేరు ప్రాంతాల్లో రెచ్చిపోయిన స్నాచర్లు  
 =  34 తులాల ఆభరణాలు చోరీ
 =  రెండు ల్యాప్‌టాప్‌లు కూడా..

 
 పంజగుట్ట,చాంద్రాయణగుట్ట,న్యూస్‌లైన్:  నగరంలో బంగారమే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక్క గురువారమే ఆయా ప్రాంతాల్లో పంజా విసిరి 34 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. విచిత్రమేమంటే.. ఒకే భవనంలోని రెండిళ్లలో చొరబడి నగలు, రెండు ల్యాప్‌టాప్‌లను దొంగిలించారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి..పంజగుట్ట ఇమాంగూడలో ఓ మూడంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో నివాసముండే హజ్రాబేగం గృహిణి. ఇదే భవనంలో కింది అంతస్తులో ఆమె మరిది మహ్మద్‌ఖలీల్ నివాసముంటాడు.

పెంట్‌హౌస్‌లో సత్యనారాయణ, బాలసుబ్రహ్మణ్యం అనే ఇద్దరు బ్యాచిలర్స్ అద్దెకుంటున్నారు. గురువారం ఉదయం హజ్రాబేగం సమీపంలో ఉండే తల్లిని చూసేందుకు వెళ్లింది. పెంట్‌హౌస్‌లో ఉండే బ్యాచిలర్స్ మధ్యాహ్నం ఇంటికొచ్చి చూడగా రెండు ల్యాప్‌టాప్‌లు కనిపించలేదు. దొంగతనం జరిగిందని గ్రహించి కిందకొచ్చి చూడగా హజ్రాబేగం ఇంటి గడియ విరగ్గొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. సమాచారమందుకున్న హజ్రాబేగంకు వచ్చి చూడగా బీరువాలో ఉన్న 14తులాల బంగారు ఆభరణాలు, మూడు గడియారాలు, రూ.8వేల నగదు కనిపించలేదు. హజ్రాబేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
మరో ఘటనలో..: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి బంగారు, వెండి ఆభరణాలు తస్కరించిన ఘట న ఇది. ఎర్రమంజిల్ క్వార్టర్‌లో నివాసముండే సయ్యద్‌మోయినుద్దీన్ ఓ దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్. ఇతని భార్య షబానా సుల్తానా టీచర్. గురువారం ఉదయం భార్యాభర్తలిద్దరూ విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో మోయినుద్దీన్ ఇంటికి రాగా ఇంటి తాళం విరగ్గొట్టి తలుపులు తెరిచివున్నాయి. లోపలికి వెళ్లిచూడగా బీరువా లాకర్‌లో ఉన్న పదితులాల బంగారు ఆభరణాలు, 15తులాల వెండి కనిపించలేదు. దొంగతనం అనంతరం వెళ్లిపోయే సమయంలో చెవి మాటీలు కిందపడి ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
మెరుగు పెడతామని : బంగారు నగలకు మెరుగు పెడ్తామని ఇద్దరు వ్యక్తులు అత్తాకోడళ్లను బురిడీకొట్టించి 10 తులాల ఆభరణాలు దోచుకె ళ్లారు. ఛత్రినాక లలితాబాగ్ సెయింట్‌మేరియా పాఠశాల సమీపంలో అరవింద్‌కుమార్ భార్యపిల్లలతో నివాసముంటున్నాడు. గతనెల 31న ఉదయం ఇంట్లో ఆయన భార్య సబిత(25), తల్లి సక్కుబాయి (52)లు ఇద్దరే ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పాత వస్తువులకు మెరుగుపెడ్తామని నమ్మబలికారు. మొదట తలుపు గొళ్లెంకు మెరుగులు దిద్ది కాంతివంతంగా తయారు చేశారు. దీంతో కాళ్ల పట్టీలు ఇవ్వగా.. వాటిని ధగధగా మెరిసేలా చేశారు.

దీన్ని నమ్మిన ఆ అత్తా కోడళ్లు తమ వద్ద ఉన్న పదితులాలు బంగారు గొలుసులను మెరుగుదిద్దాలని కోరగా..వాటిని టిఫిన్‌లో వేసి స్టౌపై ఉంచారు. తాము కంపెనీ నుంచి వచ్చామని..మీరు సంతకం చేయాలని చెప్పి సబిత వద్ద సంతకం కూడా తీసుకున్నారు. పదినిమిషాల అనంతరం టిఫిన్ బాక్స్ మూతతీయాలని చెప్పి అక్కడ్నుంచి జారుకున్నారు. తర్వాత మూత తీసిచూడగా గొలుసులు కనిపించలేదు. కంగుతిన్న వారు బయటకెళ్లి చూడగా దొంగలు కనిపించలేదు. చేసేదిలేక ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement