
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది ఆయకట్టులో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టునూ రక్తపు బొట్టులా జాగ్రత్తగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఆయకట్టు హక్కుదారులందరికీ నీళ్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఎస్సారెస్పీ ఆయకట్టుపై సీఈ శంకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కలెక్టర్ దేవసేన, జెడ్పీ చైర్మన్ తుల ఉమతో ఈటల సమీక్షించారు.
నిరంతర విద్యుత్ వల్ల కాల్వ పరిధిలోని మోటార్లు నీటినంతా లాగేస్తున్నాయని, ఈ దృష్ట్యా కాల్వ పరీవాహక ప్రాంతాల్లో సరఫరాను 9 గంటలకు తగ్గించాలని కోరినట్లు చెప్పారు. ఎల్‌ఎండీ ఎగువన మరో 4 తడులు, దిగువన మరో 3 తడులు నీళ్లు ఇచ్చే అంశంపై చర్చించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 27, ఎల్‌ఎండీలో 10 టీఎంసీల నీరుందని సీఈ వివరించగా.. తాగునీటి అవసరాలు కాపాడుకుంటూనే సాగు నీరు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని మంత్రి సూచించారు. ఆయకట్టు పరిధిలో పంటలు కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ విపక్షాలు పంటలను ఎండబెట్టేలా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.