డీఏపీ ధరలు పెంపు!

DAP prices up - Sakshi

రూ.1,215కు చేరిన బస్తా ధర

రూ.57 నుంచి రూ.120 వరకు పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చిన కొత్త ధరలు

రబీ, రానున్న ఖరీఫ్‌లో రాష్ట్ర రైతులపై రూ.1,940 కోట్ల భారం

ఒక్కో ఎకరాకు రూ.వెయ్యి వరకు అదనపు ఖర్చు

కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే ధరలు పెంచిన కంపెనీలు!

జూన్‌లో మళ్లీ ధరలు పెంచాలని కంపెనీల యోచన

సాక్షి, హైదరాబాద్‌: సాగు ఖర్చు తగ్గించాలని, 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఇటీవల బడ్జెట్‌లోనూ రైతు ఆదాయం రెట్టింపుపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధమైన చర్యలకు దిగింది. సాగు ఖర్చు పెరిగేలా చర్యలకు ఉపక్రమించింది.

కేంద్ర కనుసన్నల్లోనే ఎరువుల ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ ప్రకారం పెరిగిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఎరువుల ధర పెరిగిన కారణంగా ఒక్కో ఎకరాకు అదనంగా రూ.వెయ్యి వరకు రైతుపై భారం పడుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రబీలో రైతులకు ఇది శాపంగా మారుతుందని భావిస్తున్నారు. వచ్చే జూన్‌లో మరోసారి ధరలను పెంచాలని కంపెనీలు యోచిస్తుండటం గమనార్హం.

డీఏపీ బస్తా రూ.1,215
ప్రస్తుతం రబీ సీజన్‌లో వరి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. వరి నాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు విరివిగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచేశాయి. డీఏపీ 50 కిలోల బస్తా ప్రస్తుత ధర రూ.134 పెంచాయి. దీంతో రూ.1,081గా ఉన్న ధర, తాజా పెంపుతో రూ.1,215కు చేరింది. 0.5 శాతం జింక్‌ ఉండే డీఏపీ ప్రస్తుత ధర రూ.1,107 కాగా, రూ.1,240 పెరిగింది. అంటే కంపెనీలు బస్తాకు రూ.133 అదనంగా పెంచేశాయి. ఇక కాంప్లెక్స్‌ ధరలు రూ.57 నుంచి రూ.120 వరకు అదనంగా పెరిగాయి.

రూ.1,940 కోట్ల భారం
ప్రస్తుత రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలు. రానున్న ఖరీఫ్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈసారి 1.42 కోట్ల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని అంచనా. అవిగాక మరో 20 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి. మొత్తంగా ఖరీఫ్‌లో 1.62 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఒక ఎకరాకు డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు ఏడు బస్తాలు వాడుతారని అంచనా.

ఆ ప్రకారం చూస్తే పెంచిన ధరల ప్రకారం రైతుపై అదనంగా రూ.వెయ్యి భారం పడుతుంది. అంటే ఈ రబీలో రైతులపై అదనంగా రూ.320 కోట్ల అదనపు భారం పడుతుంది. రానున్న ఖరీఫ్‌లో 1.62 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెరుగుదల కారణంగా రైతులపై రూ.1,620 కోట్ల అదనపు భారం పడనుంది. మొత్తంగా రబీ, ఖరీఫ్‌ సీజన్‌లో రైతులపై రూ.1,940 కోట్ల అదనపు భారం పడుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

ఎరువులకూ సరిపోని ‘పెట్టుబడి’!
ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌లో 1.62 కోట్ల ఎకరాలకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి పథకం కింద సాయం చేయనుంది. అయితే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకే ఈ మొత్తం ఇస్తుంది. ఆ ప్రకారం వచ్చే ఖరీఫ్‌కు రూ.6,480 కోట్లు ఇవ్వనుంది. ఆ మేరకు బడ్జెట్‌ ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ పంపింది.

ఆ మొత్తంలో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కొనుగోలుకే రైతులు అదనంగా రూ.1,620 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో.. అదనపు ధరలకే రైతులు 25 శాతం వరకు ఖర్చు చేస్తారని అర్థమవుతోంది. ఎరువుల వాస్తవ ధర, యూరియా ధరలను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వం వారికిచ్చే సొమ్ము సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top