ఇక బయోమెట్రిక్ హాజరు | Biometric attendance | Sakshi
Sakshi News home page

ఇక బయోమెట్రిక్ హాజరు

Mar 17 2016 4:32 AM | Updated on Sep 3 2017 7:54 PM

ఇక బయోమెట్రిక్ హాజరు

ఇక బయోమెట్రిక్ హాజరు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్ల హాజరును ఇకపై పక్కాగా పర్యవేక్షించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.

ప్రతి స్కూల్లో నెలకు మూడుసార్లు సేకరణ
 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్ల హాజరును ఇకపై పక్కాగా పర్యవేక్షించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ప్రతి నెలా మూడుసార్లు ఒక్కో స్కూల్లో బయోమెట్రిక్ హాజరును సేకరించేందుకు సిద్ధమవుతోంది. పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు అమర్చడం, వాటి నిర్వహణ కష్టతరం అవుతుందనే ఉద్దేశంతో నెలలో 3 రోజుల పాటు ప్రతి పాఠశాలలను సందర్శించే ‘క్లస్టర్ రీసోర్సు పర్సన్’లకే (సీఆర్‌పీ) ఇంటర్నెట్ సదుపాయం కలిగిన ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. వాటికి బయో మెట్రిక్ పరికరాన్ని అనుసంధానించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ హాజరు ఆటోమేటిక్‌గా విద్యా శాఖకు చేరుతుంది.

రాష్ట్రంలో 2,500 మందికిపైగా సీఆర్‌పీలు ఉన్నారు. ఒక్కో సీఆర్ పీ పరిధిలో 10 నుంచి 15 వరకు పాఠశాలలున్నాయి. వాటిని నెలకు 3సార్లు సందర్శిస్తారు. ఇలా ప్రతి నెలా 25వేలకు పైగా స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల హాజరు తీరును అంచనా వేసి, తగిన చర్యలు చేపట్టవచ్చని విద్యా శాఖ భావిస్తోంది. సీఆర్‌పీలు బయోమెట్రిక్ హాజరును ఆకస్మికంగా సేకరిస్తారు. ప్రస్తుతం పాఠశాలల్లో పర్యవేక్షణ లేదన్న ఉపాధ్యాయ సంఘాల వాదనలకు దీంతో చెక్ పెట్టాలని విద్యా శాఖ భావిస్తోంది. అంతేకాకుండా ఎంత మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారన్నది తెలుసుకొని ఓ అంచనాకు రావచ్చు. ఇందులో భాగంగా ట్యాబ్‌లకు బయోమెట్రిక్ పరికరం, దాని సాఫ్ట్‌వేర్ అనుసంధానంపై వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో శాఖ చర్చలు జరుపుతోంది. త్వరలో ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement