ఏపీపీఎస్సీ గ్రూప్స్ సిలబస్ ఖరారు


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను కమిషన్ ఒక కొలిక్కి తెచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు తుది ముసాయిదా సిలబస్‌ను కమిషన్ అధికారులు దాదాపుగా ఖరారు చేశారు. ఈ సిలబస్‌ను కమిషన్ శుక్రవారం తన అధికారిక వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది. అయితే ఈ ముసాయిదాకు స్వల్పంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది సిలబస్‌ను త్వరలో అభ్యర్ధులకు అందుబాటులోకి తేనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి.



ప్రస్తుతం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in లో దీన్ని ఫైనల్ సిలబస్‌గా అప్‌లోడ్ చేశారు. ఫైనల్ సిలబస్‌గా అప్‌లోడ్ చేసినప్పటికీ వాటిలో కొన్నిటికి స్వల్ప మార్పులు చేయనున్నామని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, 4లకు మాత్రమే సిలబస్‌ను ఇచ్చేది. ఈసారి గ్రూప్ 3 సిలబస్‌ను రూపొందించి వెబ్‌సైట్లో పెట్టింది.



2011 గ్రూప్1 పోస్టులలో కోత..

ఇదిలా ఉండగా 2011 గ్రూప్1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల్లో దాదాపు 30 పోస్టులకు కోతపెట్టాలని ఏపీపీఎస్సీ చూస్తోందని ఆ గ్రూప్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 గ్రూప్1 పోస్టులకు సంబంధించి మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నోటిఫికేషన్లోని 312 పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ, తెలంగాణలకు సంబంధించినవి. ప్రస్తుతం తొలగించాలని భావిస్తున్న పోస్టులు 30 పోస్టులను రెండు రాష్ట్రాల పోస్టులనుంచి తొలగించాల్సి ఉంది.



కానీ ఏపీపీఎస్సీ ఏకపక్షంగా విభజిత ఏపీకి సంబంధించిన కోటాలోని 172 పోస్టుల నుంచి మినహాయించాలని చూస్తోందని అభ్యర్ధులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల ఏపీలోని అభ్యర్ధులు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నారు. ఉమ్మడి నోటిఫికేషన్లోని పోస్టులను తగ్గించాల్సి వస్తే రెండు రాష్ట్రాల పోస్టుల నుంచి తొలగింపు ఉండాలే తప్ప ఒక్క రాష్ట్రం నుంచే మినహాయించడం సరికాదని వారంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top