సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు! | agian tickets to sitting mlas | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు!

Mar 16 2014 2:54 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ హామీ ఇచ్చినట్టు మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు.

 దిగ్విజయ్ హామీ ఇచ్చారంటున్న ఎమ్మెల్యేలు
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ హామీ ఇచ్చినట్టు మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పి.కిష్టారెడ్డి,  ముత్యంరెడ్డి, అబ్రహం, ప్రతాప్‌రెడ్డి, కె.శ్రీధర్, మాలోతు కవిత, మిత్రసేన తదితరులు గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను కలిశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లభిస్తుందో లేదోననే భయంతోనే ఇతర పార్టీల్లోకి వెళుతున్నారని, పటాన్‌చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ అందుకు నిదర్శనమని ఆయనకు వివరించారు. మిగిలిన ఎమ్మెల్యేల్లోనూ ఆ భయం నెలకొందని, ఈ నేపథ్యంలో తగిన హామీ ఇవ్వాలని కోరారు. అనంతరం కేఎల్లార్ మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి దిగ్విజయ్ సానుకూలంగా స్పందించారని, సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే పీసీసీ వర్గాలు మాత్రం అలాంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నాయి.
 
 ఎమ్మెల్యేలు దిగ్విజయ్‌ను కలిసిన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు అక్కడే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తామని హామీతో కూడిన ప్రకటన చేయాలని ఆయా ఎమ్మెల్యేలు కోరగా.. ‘‘అలా ఎలా ప్రకటిస్తాం. దీనికో సిస్టమ్ ఉంది కదా! అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీ స్రీనింగ్ కమిటీ చూస్తుంది. నేనే ప్రకటిస్తే ఆ సిస్టమ్ ఎందుకు? అయినా టికెట్లు రావని మీరెందుకు భయపడుతున్నారు? మీకు ఓడిపోతామనే భయం ఉందా?’’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు అలాంటిదేమీ లేదని, సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని ప్రకటిస్తేనే బాగుం టుందని, దానివల్ల వలసలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. ‘‘నేనైతే అలాంటి ప్రకటన చేయలేను. కావాలంటే మీరు వెళ్లి సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తామన్నారనే మాటను మీడియాకు చెప్పుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు’’ అని డిగ్గీ పేర్కొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement