అడ్డగోలు స్టడీ సెంటర్లపై కొరడా
ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల అనుబంధ సంస్థల పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న స్టడీ సెంటర్లపై కఠిన చర్యలకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది.
- ఇతర రాష్ట్రాల వర్సిటీ విద్యా సంస్థలపై చర్యలు
- ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల అనుబంధ సంస్థల పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న స్టడీ సెంటర్లపై కఠిన చర్యలకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. అడ్డగోలుగా విద్యా వ్యాపారం చేస్తున్న ఇలాంటి వాటిపై కొరడా ఝుళిపించేందుకు ఉపక్రమిస్తోంది. బీఎస్సీ అగ్రికల్చర్‌తోపాటు వివిధ కోర్సులను ‘ఆఫ్ క్యాంపస్’ విధానంలో స్టడీ సెంటర్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఈ తరహా స్టడీ సెంటర్లపై నివేదిక రూపొందించింది.
ప్రభుత్వం దృష్టికి...
యూజీసీ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్ల పేరుతో మరో రాష్ట్రంలో కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. సదరు వర్సిటీలోనే చదివినట్టు సర్టిఫికెట్లు కూడా జారీ చేయకూడదు. విద్యా శాఖ దీనిపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేయడంతో పాటు, యూజీసీకి లేఖ రాసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మూడు వర్సిటీలవిగా చెప్పుకొంటున్న స్టడీ సెంటర్లు... తెలంగాణలో బీఎస్సీ అగ్రికల్చర్, ఇతర కోర్సులను నిర్వహిస్తున్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్‌ను విశ్వవిద్యాలయంలోనే అందించాలి. లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం గానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆమోదంతో గానీ నిర్వహించాలి.
అందుకు అనువైన వ్యవసాయ క్షేత్రాలు ఉండాలి. ఇవేవీ లేకుండానే తెలంగాణలో స్టడీ సెంటర్లు విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తూ సర్టిఫికెట్లు అందజేసే కేంద్రాలుగా మారిపోయాయి. అయితే వీటిపై ఉన్నత విద్యా శాఖ గానీ, ఉన్నత విద్యా మండలి గానీ నేరుగా చర్యలు చేపట్టే వీలులేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను తెస్తేనే బాగుంటుందని భావించిన ఉన్నత విద్యా మండలి, వ్యవసాయ వర్సిటీలు... దీనిపై పలు దఫాలుగా చర్చించి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. వీలైతే ఈనెల 14న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటును కోరాలనే ఆలోచనలో ఉన్నాయి.


