ఆంధ్రా బ్యాంకు ఉన్నతాధికారులపై కేసులు


రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ ఆంధ్రా బ్యాంకు శాఖలో దొంగలు పడి లాకర్లలో సొత్తును కొల్లగొట్టిన కేసులో... బ్యాంకు ఉన్నతాధికారులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం రాత్రి దొంగలు బ్యాంకు వెనుక నుంచి లోపలికి ప్రవేశించి గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్లు తెరిచి అందులోని బంగారం, ఇతర సొత్తును ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. కాగా, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే చోరీ జరిగినట్టు మండలంలోని బుక్కానిగూడెం గ్రామానికి చెందిన ఆంధ్రా బ్యాంకు ఖాతాదారుడు నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


నరసింహారెడ్డికి చెందిన లాకర్ నుంచి కూడా దొంగలు 25 తులాల బంగారు ఆభరణాలు పట్టుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆంధ్రా బ్యాంకు చైర్మన్, డీజీఎం, ఏజీఎం, జీఎం, బ్రాంచ్ మేనేజర్ తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 82 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 4 కిలోల 620 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు బ్యాంకు అధికారులు తేల్చారు. ఈ మేరకు ఖాతాదారులకు నోటీసులు ఇవ్వనున్నారు.



 




 

Read also in:
Back to Top