మరో దళిత ఉద్యమం భీం ఆర్మీ | Bhim Army is Another Dalit movement | Sakshi
Sakshi News home page

మరో దళిత ఉద్యమం భీం ఆర్మీ

May 22 2017 8:50 PM | Updated on Sep 5 2017 11:44 AM

మరో దళిత ఉద్యమం భీం ఆర్మీ

మరో దళిత ఉద్యమం భీం ఆర్మీ

దిల్లీలో ప్రజాందోళలనకు వేదిక జంతర్‌ మంతర్‌ ఆదివారం పది వేల మంది దళితులతో నిండిపోయింది.

న్యూఢిల్లీ: దిల్లీలో ప్రజాందోళలనకు వేదిక జంతర్‌ మంతర్‌ ఆదివారం పది వేల మంది దళితులతో నిండిపోయింది. దళితులు ప్రధానంగా చర్మకారులైన జాటవ్‌ల కొత్త రాజకీయ ఉద్యమం భీం ఆర్మీ నాయకత్వాన ఎవరూ ఊహించని రీతిలో ఇంతటి జన ప్రదర్శన జరగడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం రెండేళ్ల క్రితం సహారన్‌పూర్‌ జిల్లాలో పుట్టిన దళితుల సమరశీల యువ సైన్యం భీం ఆర్మీ ఇప్పుడు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ షబ్బీర్‌పూర్‌లో మే 9న జరిగిన హింసాకాండకు బాధ్యులనే కారణంతో తమను వెంటాడుతున్న యూపీ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి పోయిన భీం ఆర్మీ నేతలు ‘అడ్వకేట్‌’ చంద్రశేఖర్‌ ఆజాద్‌(రావణ్‌), వినయ్‌రతన్‌సింగ్‌లు ఈ జంతర్‌మంతర్‌ ర్యాలీలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జేఎన్‌యూ విద్యార్థిసంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యా కుమార్‌ కూడా చంద్రశేఖర్‌ ఆజాద్‌తో పాటు ప్రదర్శనలో కనిపించారు.

350 స్కూళ్లు నడుపుతున్న భీం ఆర్మీ
కాలేజీ చదువులు పూర్తి చేసుకుని చంద్రశేఖర్‌, వినయ్‌రతన్‌ 2015 జులై 21న భీం ఆర్మీ ప్రారంభ సమావేశం ఏర్పాటుచేశారు. దళితుల పిల్లల కోసం పాఠశాలలు ఆరంభించాలని నిర్ణయించారు. సర్కారీ బడుల్లో అంతంత మాత్రం బోధనతో నష్టపోతున్న దళిత బాలల కోసం సహారన్‌పూర్‌ జిల్లా ఫతేపూర్‌ భాదో గ్రామంలో మొదటి పాఠశాల స్థాపించారు. ఇక్కడ పిల్లలకు తరగతి పాఠాలతోపాటు, అంబేడ్కర్‌ బోధనలు కూడా వివరిస్తారు. భీం ఆర్మీ స్కూళ్ల సంఖ్య కొద్దికాలంలోనే 350కి చేరుకుంది. అయితే, దళితులపై జరిగే అత్యాచారాలపై పోరాడుతూ, భూస్వామ్య శక్తులను ప్రతిఘటించే క్రమంలో యూపీ పోలీసులు భీం ఆర్మీకి నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించడమేగాక దాని నేతలపై జాతీయభద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

న్యాయం, తగిన నష్ట పరిహారం
షబ్బీర్‌పూర్‌ దళితవాడపై ఠాకూర్లు జరిపిన దాడి, దహనకాండలో నష్టపోయిన దళితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఆస్తి నష్టపోయిన వారికి సవరించిన ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధకచట్టం ప్రకారం తగినంత నష్టపరిహారం చెల్లించాలని మాత్రమే జంతర్‌మంతర్‌ ర్యాలీకి వచ్చిన దళితులు కోరారు. అంబేడ్కర్‌ బతికున్న కాలంలోనే అనేక రంగాల్లో పైకొచ్చిన పశ్చిమ యూపీ జిల్లాల నుంచే కొత్త దళిత చైతన్య ఉద్యమం పుట్టుకురావడం సహజమే. అందుకే వేలాదిగా తరలివచ్చిన భీం ఆర్మీ సేనలను పోలీసులు దిల్లీకి రాకుండా అడ్డుకోలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement