
దెబ్బతిన్న అచ్చంపేట– క్రోసూరు రోడ్డు
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎన్‌బీ రోడ్లు ఛిద్రం అయ్యాయి. తారు రోడ్లులో కంకర తేలి మోకాలి లోతు గుంతలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మట్టి రోడ్లను తలపిస్తున్నాయి ఆ రోడ్లలో ప్రయాణం అంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధానంగా వినుకొండ, పెదకూరపాడు, వేమూరు, మాచర్ల, గురజాల ప్రాంతాల్లో ఆర్‌ఎన్‌బీ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో, తాజాగా ఆర్‌ఎన్‌బీలో పనులు చేసేందుకు అధికారులు ముందుకు రావటం లేదు. దీంతో అధికారులు కనీసం మెయిన్ టెయిన్స్ కింద గుంతలను పూడ్చలేని దుస్థితిలో అధికారులున్నారు. పెదకూరపాడు నియోజక వర్గంలో రోడ్లలో ప్రయాణం అంటే ప్రజలు హడలి పోతున్నారు. ఈపూరు–ముప్పాళ్ల రహదారిలో 8 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే, గంటకు పైగా సమయం పడుతోందంటే ఆ రోడ్ల దుస్థితిని ఆర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పలు రోడ్లు దెబ్బతినడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేయాలని ప్రజలు అధికారులకు విన్న విస్తున్నా, నిధుల సమస్యతో చేతులేత్తేస్తున్నారు.
మరీ అధ్వానం ఈ రోడ్లు...
జిల్లాలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎన్‌బీ పరిధిలోని రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. వినుకొండ నియోజక వర్గంలో ఈపూరు–ముప్పాళ్ల, ముప్పాళ్ల బోగ్గరం, ఇనిమెళ్ల తో పాటు బొల్లాపల్లి మండలంలో సైతం రోడ్లు చితికి పోయాయి. పెదకూరపాడు నియోజక వర్గంలో అచ్చంపేట మండలం నుంచి క్రోసూరు. కస్తల, దొడ్ల వేరు–బెల్లంకొండ, అమరావతి–క్రోసూరు రోడ్లు మోకాలి లోతు గుంతలు పడటం, ఆ ప్రాంతంలో ఇసుక లారీలు సైతం తిరుగతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేమూరు నియోజక వర్గంలో జంపని–బూత్ మల్లి, వేమూరు–చంపాడుకు వెళ్లే రహదారులు కంకర తేలి, మట్టి రోడ్లను తలపిస్తున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తినడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నిధులు ఇవ్వకుండా..సీఎం హెచ్చరికలు
గత ఏడాదిగా ఆర్‌ఎన్‌బీలో చేసిన పనులకు బిల్లులు మంజూరు కాక పోవడంతో కాంట్రాక్టర్లు, ఆర్‌ఎన్‌బీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది పుష్కరాలలో చేసిన పనులకు ఇంకా బిల్లులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గత నెలలో సీఎం నివాసం ఉండవల్లిలో కలెక్టర్ల సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్‌ఎన్‌బీ శాఖ పనితీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎన్‌బీ రోడ్లలను తనిఖీ చేస్తానని, గుంతలు కనిపిస్తే, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం ఏడాదిగా నిధులు కేటాయించకుండా, రోడ్లలో గుంతలు ఉంటే అధికారులను సస్పెండ్ చేస్తామన్నమాటలకు అధికారులు విస్తుపోతున్నారు. నిధులు కేటాయించకుండా తప్పును తమపై నెట్టేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, ఇది ఎంత వరకు సబబు అని ఆర్‌ఎన్‌బీ అధికారులలోనే చర్చ సాగడం గమనార్హం.