అవ్వా కావాలి..బువ్వా కావాలి

enganeering students survey on present youth attitude - Sakshi

ఆధునికతను ఆస్వాదిస్తున్నా వీడని సంప్రదాయ అలవాట్లు

చిరుతిళ్లలో ఫాస్ట్‌ఫుడ్‌కు పెద్ద పీట

సౌందర్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం

ఇంజినీరింగ్‌ విద్యార్థినుల వినూత్న సామాజిక సర్వే

నేటి యువత పొద్దుపొద్దున్నే కాఫీకి నో చెబుతూ గ్రీన్‌ టీకి గుడ్‌ మార్నింగ్‌ పలుకుతున్నారు. ఒక వైపు సంప్రదాయ రైస్‌ను తీసుకుంటూనే వైట్‌ రైస్, మంచూరియా, నూడుల్స్‌ వంటి జంక్‌ ఫుడ్‌లపైనా మోజు పెంచుకుంటున్నారు. మరో వైపు హ్యాండ్‌ వాషింగ్, బ్రాండెడ్‌ టూత్‌ పేస్ట్, బ్రష్‌లకు ఓటేస్తూ పరిశుభ్రతకు అగ్ర తాంబూలమిస్తున్నారు.  ఇంకో వైపు మగువల హ్యాండ్‌ బ్యాగుల వెంట తిరిగే ఫేస్‌ వాష్, బాడీ లోషన్‌ వంటి సౌందర్య సాధనాలనూ.. మగమహారాజులు తమ పాకెట్‌లలో పదిలంగా దాచుకుంటున్నారు. ఇటీవల తెనాలి విద్యార్థినుల సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

సాక్షి, తెనాలి: విద్యార్థులకు నేటి సమాజం గురించిన అవగాహన, చుట్టూ ఏం జరుగుతోందన్న స్పృహను కలిగి ఉండటం అవసరం. ఇందుకు ప్రత్యేకించి తరగతులు లేకున్నా, సొంతగా కాస్తంత ఆసక్తి, తగిన ప్రోత్సాహం ఉంటే అవకాశాలు అవే వస్తాయి. పాఠ్యాంశాల్లోనే కాకుండా సామాజికాంశాల్లోనూ తొంగి చూడొచ్చు. అబ్బుపరచే అనేక విశేషాలు తెలుసుకోవచ్చు. వాటిని పది మందికీ అందుబాటులోకి తేవచ్చు. ఈ తరహా పరిజ్ఞానం జ్ఞానాభివృద్ధికే కాదు, పోటీపరీక్షలు, ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత విజయాల సాధనకు తోడ్పడుతుంది. స్థానిక ఏఎస్‌ఎన్‌ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజి విద్యార్థినులు తాజాగా చేసిన సామాజిక సర్వే ఈ కోవలోకే వస్తుంది.

41 అంశాలపై సర్వే
రోజూ నిద్ర లేచాక బ్రష్‌ చేయటం నుంచి, భోజనం చేసేవరకు దైనందిన జీవితంలో మనం కాఫీ, టీ, శీతల పానీయాలు, కాస్మటిక్స్, ఆహార పధార్ధాలను వినియోగిస్తుంటాం. ఇందులో రకరకాలుంటాయి. మారుతున్న జీవనశైలి, సంబంధిత వ్యాధులు, తినే ఆహారపదార్ధాలపై ప్రభావం చూపుతోందా? అనే అంశాలను సర్వేతో తెలుసుకోవాలని కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ ఫైనలియర్లో ఉన్న కీర్తి శివపార్వతి, తనూజ చెరుకూరి, మంజూషలు ఉత్సుకత చూపారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో భాగమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా చేయాలని తలపెట్టారు. ఇందుకు డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కొలసాని రామ్‌చంద్‌ ప్రోత్సాహం లభించింది. ఇంటిల్లపాదీ వాడే టూత్‌ పేస్ట్‌ నుంచి నిత్యం ఉపయోగించే వినిమయ వస్తువులు, ఆహార పదార్థాల వరకు 41 అంశాలపై సర్వే చేశారు. ఒక్కో అంశానికి మల్టిపుల్‌ చాయిస్‌లో సమాధానాలు సేకరించారు.. ఇతరమైనవి అనే చాయిస్‌కు అవకాశం కల్పించారు. రెండు నెలల క్రితం చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వెయ్యి మంది అభిప్రాయాలను తీసుకున్నారు.  

అధునికతతోపాటు వదలని సంప్రదాయం...  
ఈ వివరాలతో క్రోడీకరించిన నివేదిక ఆధునికతను అందిపుచ్చుకుంటున్న వైనం స్పష్టమవుతోంది. జీవనశైలి వ్యాధులు సతమతం చేస్తున్నప్పటికీ ఆహారపు అలవాట్లలో మార్పులురాని వైనాన్నీ బహిర్గతం చేసింది. సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులపై వ్యామోహమూ తేటతెల్లమైంది. ఉదాహరణకు ఆహారంలో బియ్యం వినియోగం తగ్గించాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నా, 99.8 శాతం ప్రధాన ఆహారం బియ్యం కావటం ఇందుకో నిదర్శనం. ఇందులో తెల్లబియ్యాన్ని 85 శాతం వినియోగిస్తున్నారు. మరో వైపు ఫాస్ట్‌ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచూరియా, నూడుల్స్, బర్గర్స్‌కు ఎక్కువ రేటింగ్‌ వచ్చింది. అన్నింటికంటే మంచూరియా, తర్వాత స్థానంలో నూడుల్స్‌ ఉండటం గమనార్హం. శక్తినిచ్చే పానీయాల వినియోగం 93.4 శాతం ఉందట. ఆరోగ్యకరమైన తేనీరు స్థానంలో గ్రీన్‌ టీ వినియోగం పెరగటం మంచి మార్పు. హ్యాండ్‌వాష్‌కు ప్రాధాన్యనిస్తుండటం మరో శుభపరిణామం. టూత్‌ బ్రష్, టూత్‌ పేస్ట్‌తో సహా పలు వస్తువుల వినియోగంలో బ్రాండెడ్‌పైనే ఆదరణ చూపుతున్నారు.

సౌందర్య సాధనకు మెరుగులు...
వ్యక్తిగత పరిశుభ్రత, సౌందర్య సాధనకు ప్రాధాన్యత పెరగటం మరో కీలకాంశం. యువత/మహిళల్లో పెర్‌ఫ్యూమ్స్‌ వాడకం 88 శాతం ఉండగా, పెదవుల రక్షణ క్రీముల వినియోగం 92.6 శాతంగా కనిపించింది. మగవారూ ఇందుకు తీసిపోలేదు సుమా! ఒక విధంగా వారిని మించిపోయారు. బాడీ లోషన్స్‌ను 94.6 శాతం, ముఖం శుభ్రం చేసుకొనే లోషన్స్‌ను 90.2 శాతం వాడుతుండగా మొత్తంగా 94.8 శాతం యువత/మగవారు పెర్‌ఫ్యూమ్స్‌ను వినియోగిస్తున్నట్టు తమ సర్వేలో తేలిందని శివపార్వతి, తనూజ చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టులో భాగంగా ఈ నివేదికను యూనివర్సిటీకి సమర్పించారు. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో పొందుపరచి, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ, మార్పులను అధ్యయనం చేయనున్నట్టు మంజూష చెప్పారు. సెకండియర్‌లో తామంతా ఆన్‌లైన్‌ సినిమా టికెట్లపై ప్రాజెక్టును రూపొందించినట్టు వెల్లడించారు.
  
వాస్తవాల అధ్యయనంతో మార్పు
ఇంజినీరింగ్‌లో ప్రాజెక్టులు కీలకమని తెలి సిందే. చిత్తశుద్ధితో నిజా యితీగా చేసే విద్యార్థులకు జాబ్‌ స్కిల్స్‌ అలవడతాయి. జీవితంలో విజేతలవుతారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసినప్పుడు ఏవైనా సమస్యలు దృష్టికి వస్తే సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిష్కారాన్ని కనుగొనే అవకాశముంటుంది. ఇలాంటి సర్వేలను ఎంకరేజ్‌ చేసి  స్టార్టప్‌ స్థాయికి తీసుకెళ్లాలనేది లక్ష్యం.
       - కొలసాని రామ్‌చంద్, ప్రిన్సిపాల్, ఏఎస్‌ఎన్‌ డిగ్రీ కాలేజీ

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top