డబల్‌... డబల్‌

Sri Ramana Article On Political Leaders - Sakshi

అక్షర తూణీరం

జనం చెవుల్లో అరటి పూలు పూయించవచ్చునని అనుకుంటే, ఏదో రోజు జనం వారి చెవుల్లో కాగడాలు వెలిగిస్తారు.

రాజకీయ నాయకులు రూరల్‌ ఓటర్‌ కోసం కొత్త కొత్త గాలాలు, సరికొత్త వలసంచీలు తీసుకు తిరుగుతూ ఉంటారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ నమ్మపలికారు. పంచవర్ష ప్రణాళిక పూర్తి కావస్తున్నా, రైతుల మొహాన పొద్దు పొడవ లేదు. ఇంతకీ ఏ విధంగా రైతు ఆదాయం పెంచుతారో చెప్పనే లేదు. ఇంకో నాయకుడు పూర్తిగా శిథిలమైన పంచాయతీ వ్యవస్థని పునర్నిర్మి స్తానని చెబుతున్నారు. అధికార వికేంద్రీకరణకి రాజ కీయం తెల్సిన నాయకుడెవడూ మొగ్గుచూపడు. ఒకప్పుడు బెంగాల్‌లో కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకి గ్రామ పంచాయతీలే మూలమని గుర్తొస్తుంది. ఇంకేవుంది ఆ దారిలో ఏలేద్దామనుకుంటారు.

మన గ్రామ పంచాయతీలకి ఆదాయం లేదు. ముందు దాన్ని పెంచాలి. అన్ని లావాదేవీలపైన గ్రామాలకి వాటా పెట్టాలి. బళ్లు, గుళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటి విధుల్ని సక్రమంగా నిర్వర్తించేలా చూడాలి. గడచిన యాభై ఏళ్లుగా గ్రామాలు బస్తీలవైపు వెళ్తుంటే చూస్తూ కూర్చున్నాం. కులవృత్తులకు చెదపట్టింది. నేడు గ్రామాల్లో ఎనభై శాతం మంది పురుషులు మద్యానికి అలవాటుపడ్డారు. ప్రభుత్వాలు నిస్సిగ్గుగా మద్యం మీద బతుకుతున్నాయ్‌. రైతు ఆదాయం సబ్సి డీలతో పెంచుతారా? వాళ్లకి కూడా పింఛన్లు మంజూరు చేస్తారా? అదే మన్నా అంటే దళారీ వ్యవస్థని రూపు మాపుతామంటారు. అంతా వొట్టిది. అసలు మన రాజకీయ వ్యవస్థే అతిపెద్ద దళారీ వ్యవస్థ. ఆనాడు ఈస్టిండియా కంపెనీ ఏల కులు, లవంగాలు, ధనియాలు, దాసించెక్కలకి దళారీ హోదాతోనే దేశంలో అడుగుపెట్టింది. అందు కని మన నేతలకి అదొక దిక్సూచి. చిల్లరమల్లరగా ఓట్లు కొనుక్కుని ఓ ఎమ్మెల్యే తెర మీదికి వస్తాడు.

అవసరాన్నిబట్టి ఆ ఎమ్మెల్యే ఏదో ధరకి అమ్ముడవుతాడు. పగ్గాల మీద ఆశ ఉన్న వారంతా కొనుగోళ్లమీద దృష్టి సారిస్తారు. ప్రత్యేకించి పాలసీలేమీ వుండవ్‌. అందరూ ప్రజాసేవ నినాదంతోనే సాగుతూ, వారి వారి ‘స్టామినా’ని బట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు.ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే కొన్ని కొన్ని ఆదాయ వనరులు గ్రామాల్లో కనిపిస్తాయ్‌. ధాన్యాలు, కూరలు, పండ్లు, మాంసం, చేపలు, పాలు– వీటన్నింటినీ ఉత్పత్తి చేసేది గ్రామాలే. దళారీలు కబళించకుండా గ్రామాల్ని కాపాడితే చాలు. దాంతోపాటు గ్రామాల్ని బస్తీలకు దగ్గర చెయ్యాలి. అంటే రవాణాకి అనువైన చక్కని రోడ్లు, జలమార్గాలని ఏర్పాటు చేయాలి. కేరళలో అతి చౌకగా జల రవాణా ఎలా సాగుతోందో గమనించవచ్చు. మనకి బొత్తిగా జవాబుదారీతనం లేకుండా పోయింది.

నేతలకి సొంత మీడియా భుజకీర్తుల్లా అమరిన ఈ తరుణంలో ఎవర్నీ ఏమీ ప్రజలు ప్రశ్నించలేరు. అయిదువేలు జనాభా ఉన్న పంచాయతీలన్నింటికీ డ్రైనేజీ సౌకర్యం, పంచాయతీకి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేలా వెర్మి కంపోస్ట్‌ పరిశ్రమ మంజూరు చేసేశారు ఓ యువమంత్రి ఉదారంగా. జనం చెవుల్లో అరటి పూలు పూయించవచ్చునని అనుకుంటే, ఏదో రోజు జనం వారి చెవుల్లో కాగడాలు వెలిగిస్తారు. పాడుబడ్డ నూతులముందు నిలబడి నవ్వితే, తిరిగి నవ్వు వినిపి స్తుంది. అరిస్తే అరుస్తుంది. అడవుల్లో అజ్ఞానం కొద్దీ నక్కలు, ఎలుగులు అరుపు లతో వినోదిస్తూ ఉంటాయ్‌. నాయకులు మరీ ఆ స్థాయికి దిగకూడదు. ఈ నేల మీద పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ లాంటి సహజ ఇంధనాలు పుష్కలంగా పండుతున్నాయ్‌. వాటిని చీడపీడలు అంటవు. అతివృష్టి అనావృష్టి సమస్యలు లేవు. గాలులు, గాలి వానలు చెరచలేవు. అయినా సామాన్య పౌరుడు ఈ నిత్యావసరాలను ఎంతకి కొంటున్నాడు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి! మనదొక పెద్ద దళారీ రాజ్యం. మన నాయకుల మాటలన్నీ దళారీ మాటలు. ఇది నైరాశ్యం కాదు, నిజం.

శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top