
విశ్లేషణ
మహిళలను అగౌరవంగా చూసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోను, తెలంగాణ రెండో స్థానంలో నిలిచి చదువుద్వారా పిల్లలకు మొక్కగా ఉండగానే విలువలు నేర్పాలన్న అవసరాన్ని నొక్కి చెప్పాయి.
ఇటీవలనే ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల 6వ సదస్సు హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న 1,500 మంది దేశదేశాల ప్రతినిధులలో సగానికిపైగా మహిళలే ఉండటం మంచి పరిణామం. అయితే వీరందరూ కూడా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని వచ్చి ప్రపంచ వేదికపై నిలబడిన వారు. అందుకే అమెరికా నారి ఇవాంకా నుంచి మన మహిళా క్రికెట్ సారథి మిథాలీరాజ్ వరకు చెపుతున్నదొక్కటే. అతివకు అవరోధాలు కల్పించొద్దని. సదస్సులో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఏదో ఒక దశలో లింగ వివక్షను ఎదుర్కొన్నవారే. లింగ సమానత్వాన్ని కోరుకున్నవారే.
మన దేశంలో పార్లమెంటు చట్టాలున్నా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులున్నా, వీటిని అమలు చేసేందుకు పోలీసులు పెట్టే కేసులున్నా.. లింగ సమానత్వం ఎక్కడో ఒక చోట ఓడిపోతూనే ఉంటుంది. ఆకాశంలో సగం... అవకాశాలలో సగం అని మనం మురిసిపోవడమే తప్ప పనిలో, గనిలో, కార్ఖానాలో మహిళలను సమానంగా చూడాలని చట్టాలున్నా అవి ఎప్పుడూ బేఖాతరే. సాహసోపేతమైన సముద్రయానం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా, ఆటో రిక్షాల నుంచి ఆధునిక మెట్రో రైలును నడపడం వరకు అక్కడక్కడ మెరి సిన ముదితలు చుక్కల్లో చంద్రులే తప్ప ఆ ఉదాహరణలను సాధారణీకరించలేము. ఒక పక్క వేర్వేరు రంగాల స్టార్టప్‌లలో మన వనితలు ధ్రువతారల్లా మెరుస్తున్నారని మురిసిపోతుంటే మరోపక్క పల్లెల పొలిమేరల్లోనో, పట్టణాల శిథిలాలలోనో, నగర వాహనాలలోనో మహిళలపై దాష్టీకాలు జరుగుతూనే ఉన్నాయి.
నిర్భయ నుంచి నేడు దేశంలోని వివిధ ప్రాంతాలలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో నింది తుల నేపథ్యం తెలుసుకుని వారెందుకిలా ప్రవర్తించారన్న అధ్యయనం చేసినపుడు వెల్లడయ్యే చేదు నిజం ఇదే. బాల్యం నుంచి ఆడదంటే అలుసుగా చూసే వాతావరణంలో పెరిగిన వారే ఎక్కువగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పురుషాధిక్య భావాలు చిన్నప్పటి నుంచి ఒంట బట్టించుకున్న వారే ఇటువంటి దాష్టీకాలకు పాల్పడుతున్నారు. అసలు తప్పులు చేయకుండా ఉండాలంటే, అసలు ఆడదంటే అల్పత్వ భావన మెదడులో ఏర్పడకుండా ఉండాలంటే చికిత్స ఇంకేదో జరగాలి. అది చట్టాలు, శాసనాల కంటే ముందుగా కొన్ని దశాబ్దాల పాటు జరగాలి. మగవాడి దృక్పథంలో దిద్దుబాటు జరగాలి. మూల చికిత్స చేయాలి.
ఈ సామాజిక చికిత్స జరగాల్సినది విద్యాలయాలలో, చదువుకునే పాఠశాలల్లో. పలకాబలపం పట్టుకున్న నాటినుంచి, ప్యాంటుషర్ట్ వేసుకుని సమాజంలో సంచరించే వయస్సు వచ్చేలోపు విద్యాలయాలలో చదువుతోపాటు లింగ సమానత్వ భావనకు పిల్లల మనస్సుల్లో విత్తులు పడాలి. ఇందుకు పునాది 6 నుంచి 11 ఏళ్ల వయస్సు. ఈ వయస్సులో సాధారణంగా పిల్లలకు ప్రశ్నించేతత్వం ఉండదు. ఉపాధ్యాయుడు ఏం చెబితే అది స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. చిన్న చిన్న నీతికథల ద్వారా స్త్రీ పురుష సమానత్వాన్ని పరి చయం చేయాలి. అమ్మాయిలంటే ఎవరోకాదు మన అమ్మ, అక్కలాంటి వారే వంటి విషయాలను వివిధ పాఠ్యాం శాల రూపంలో పిల్లల మనసుల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేయవచ్చు. మన ఇతిహాసాలలోనే పురుషాధిక్యం చూపిన వారికి ఎలాంటి ముగింపు జరిగిందో చెప్పాలి.
ఇక 12–18 ఏళ్ళ వయస్సులో ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయికి విద్యార్థి చేరతాడు. ఇది అత్యంత కీలక దశ. బాలబాలికల్లో శారీరక మార్పులు వస్తాయి. పాశ్చాత్య దేశాల్లో కౌమారదశలోని శారీరక మార్పు
లను శాస్త్రీయంగా పాఠ్యాంశాలలో వివరించగలిగారు. ఇందుకు లైంగిక విద్యను ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టవచ్చు. దీనివల్ల కొన్ని భౌతికమైన మార్పులు జన్మతః వచ్చినవి తప్ప ఆడ, మగ ఒక్కటే అన్న భావన వారి హృదయాలలో బలంగా నాటుకుంటుంది. తోటి సహచరులను గౌరవించడం, మానవ విలువల పట్ల అవగాహన కల్పించడం ఈ దశలో జరిగితే ఆ తర్వాత వారు విశ్వవిద్యాలయ స్థాయికి చేరినా ఇది పునాది అవుతుంది.
మహిళలను అగౌరవంగా చూసే రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలోను, తెలంగాణ రెండోస్థానంలో నిలిచి చదువుద్వారా పిల్లలకు మొక్కగా ఉండగానే విలువలు నేర్పాలన్న అవసరాన్ని నొక్కి చెప్పాయి. లింగ సమానత్వ జాఢ్యానికి అసలు కారణం వెతికి దానికి చికిత్స చేయాలే తప్ప... రోగం ఒకచోట ఉంటే చికిత్స మరో చోట చేసిన చందంగా మన ప్రయత్నాలు వృథా కారాదు.
కొత్తగా వచ్చే విద్యావిధానం మరో రెండు దశాబ్దాల పాటు అమలులో ఉంచే అవకాశం ఉంది. మన యువతరాన్ని జ్ఞానవంతులుగా, యువ క్షిపణులుగా తీర్చిదిద్దడమే కాదు, లింగ సమానత్వం వంటి మౌలిక విలువలు సంతరించుకునే సంపూర్ణ మనిషిగానూ తీర్చిదిద్దాలి. జన్మనిచ్చి ఆలనా పాలనా చూసే, సోదరిగా నిలిచే, అర్థాంగిగా జీవితాన్ని అర్థవంతం చేసే స్త్రీని తనతో సమానంగా చూడమని చెప్పాలని మనం ఆలోచించడం ఏమిటి? ఆ భావన నరనరాల్లో ఇంకిపోవాలి. లింగ అసమానత్వం, లింగ సమానత్వం అన్న పదాలే భారతదేశ నిఘంటువు నుంచి తొలగి పోవాలంటే అందుకు చిన్ననాటి నుంచి చెప్పే చదువులే ఆలంబన కావాలి.
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి మాజీ సభ్యులు
చుక్కా రామయ్య