breaking news
chukka rammaiah
-
ఆకాశంలో ఆలోచనల్లోనూ సగం!
విశ్లేషణ మహిళలను అగౌరవంగా చూసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోను, తెలంగాణ రెండో స్థానంలో నిలిచి చదువుద్వారా పిల్లలకు మొక్కగా ఉండగానే విలువలు నేర్పాలన్న అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఇటీవలనే ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల 6వ సదస్సు హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న 1,500 మంది దేశదేశాల ప్రతినిధులలో సగానికిపైగా మహిళలే ఉండటం మంచి పరిణామం. అయితే వీరందరూ కూడా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని వచ్చి ప్రపంచ వేదికపై నిలబడిన వారు. అందుకే అమెరికా నారి ఇవాంకా నుంచి మన మహిళా క్రికెట్ సారథి మిథాలీరాజ్ వరకు చెపుతున్నదొక్కటే. అతివకు అవరోధాలు కల్పించొద్దని. సదస్సులో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఏదో ఒక దశలో లింగ వివక్షను ఎదుర్కొన్నవారే. లింగ సమానత్వాన్ని కోరుకున్నవారే. మన దేశంలో పార్లమెంటు చట్టాలున్నా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులున్నా, వీటిని అమలు చేసేందుకు పోలీసులు పెట్టే కేసులున్నా.. లింగ సమానత్వం ఎక్కడో ఒక చోట ఓడిపోతూనే ఉంటుంది. ఆకాశంలో సగం... అవకాశాలలో సగం అని మనం మురిసిపోవడమే తప్ప పనిలో, గనిలో, కార్ఖానాలో మహిళలను సమానంగా చూడాలని చట్టాలున్నా అవి ఎప్పుడూ బేఖాతరే. సాహసోపేతమైన సముద్రయానం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా, ఆటో రిక్షాల నుంచి ఆధునిక మెట్రో రైలును నడపడం వరకు అక్కడక్కడ మెరి సిన ముదితలు చుక్కల్లో చంద్రులే తప్ప ఆ ఉదాహరణలను సాధారణీకరించలేము. ఒక పక్క వేర్వేరు రంగాల స్టార్టప్‌లలో మన వనితలు ధ్రువతారల్లా మెరుస్తున్నారని మురిసిపోతుంటే మరోపక్క పల్లెల పొలిమేరల్లోనో, పట్టణాల శిథిలాలలోనో, నగర వాహనాలలోనో మహిళలపై దాష్టీకాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ నుంచి నేడు దేశంలోని వివిధ ప్రాంతాలలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో నింది తుల నేపథ్యం తెలుసుకుని వారెందుకిలా ప్రవర్తించారన్న అధ్యయనం చేసినపుడు వెల్లడయ్యే చేదు నిజం ఇదే. బాల్యం నుంచి ఆడదంటే అలుసుగా చూసే వాతావరణంలో పెరిగిన వారే ఎక్కువగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పురుషాధిక్య భావాలు చిన్నప్పటి నుంచి ఒంట బట్టించుకున్న వారే ఇటువంటి దాష్టీకాలకు పాల్పడుతున్నారు. అసలు తప్పులు చేయకుండా ఉండాలంటే, అసలు ఆడదంటే అల్పత్వ భావన మెదడులో ఏర్పడకుండా ఉండాలంటే చికిత్స ఇంకేదో జరగాలి. అది చట్టాలు, శాసనాల కంటే ముందుగా కొన్ని దశాబ్దాల పాటు జరగాలి. మగవాడి దృక్పథంలో దిద్దుబాటు జరగాలి. మూల చికిత్స చేయాలి. ఈ సామాజిక చికిత్స జరగాల్సినది విద్యాలయాలలో, చదువుకునే పాఠశాలల్లో. పలకాబలపం పట్టుకున్న నాటినుంచి, ప్యాంటుషర్ట్ వేసుకుని సమాజంలో సంచరించే వయస్సు వచ్చేలోపు విద్యాలయాలలో చదువుతోపాటు లింగ సమానత్వ భావనకు పిల్లల మనస్సుల్లో విత్తులు పడాలి. ఇందుకు పునాది 6 నుంచి 11 ఏళ్ల వయస్సు. ఈ వయస్సులో సాధారణంగా పిల్లలకు ప్రశ్నించేతత్వం ఉండదు. ఉపాధ్యాయుడు ఏం చెబితే అది స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. చిన్న చిన్న నీతికథల ద్వారా స్త్రీ పురుష సమానత్వాన్ని పరి చయం చేయాలి. అమ్మాయిలంటే ఎవరోకాదు మన అమ్మ, అక్కలాంటి వారే వంటి విషయాలను వివిధ పాఠ్యాం శాల రూపంలో పిల్లల మనసుల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేయవచ్చు. మన ఇతిహాసాలలోనే పురుషాధిక్యం చూపిన వారికి ఎలాంటి ముగింపు జరిగిందో చెప్పాలి. ఇక 12–18 ఏళ్ళ వయస్సులో ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయికి విద్యార్థి చేరతాడు. ఇది అత్యంత కీలక దశ. బాలబాలికల్లో శారీరక మార్పులు వస్తాయి. పాశ్చాత్య దేశాల్లో కౌమారదశలోని శారీరక మార్పు లను శాస్త్రీయంగా పాఠ్యాంశాలలో వివరించగలిగారు. ఇందుకు లైంగిక విద్యను ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టవచ్చు. దీనివల్ల కొన్ని భౌతికమైన మార్పులు జన్మతః వచ్చినవి తప్ప ఆడ, మగ ఒక్కటే అన్న భావన వారి హృదయాలలో బలంగా నాటుకుంటుంది. తోటి సహచరులను గౌరవించడం, మానవ విలువల పట్ల అవగాహన కల్పించడం ఈ దశలో జరిగితే ఆ తర్వాత వారు విశ్వవిద్యాలయ స్థాయికి చేరినా ఇది పునాది అవుతుంది. మహిళలను అగౌరవంగా చూసే రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలోను, తెలంగాణ రెండోస్థానంలో నిలిచి చదువుద్వారా పిల్లలకు మొక్కగా ఉండగానే విలువలు నేర్పాలన్న అవసరాన్ని నొక్కి చెప్పాయి. లింగ సమానత్వ జాఢ్యానికి అసలు కారణం వెతికి దానికి చికిత్స చేయాలే తప్ప... రోగం ఒకచోట ఉంటే చికిత్స మరో చోట చేసిన చందంగా మన ప్రయత్నాలు వృథా కారాదు. కొత్తగా వచ్చే విద్యావిధానం మరో రెండు దశాబ్దాల పాటు అమలులో ఉంచే అవకాశం ఉంది. మన యువతరాన్ని జ్ఞానవంతులుగా, యువ క్షిపణులుగా తీర్చిదిద్దడమే కాదు, లింగ సమానత్వం వంటి మౌలిక విలువలు సంతరించుకునే సంపూర్ణ మనిషిగానూ తీర్చిదిద్దాలి. జన్మనిచ్చి ఆలనా పాలనా చూసే, సోదరిగా నిలిచే, అర్థాంగిగా జీవితాన్ని అర్థవంతం చేసే స్త్రీని తనతో సమానంగా చూడమని చెప్పాలని మనం ఆలోచించడం ఏమిటి? ఆ భావన నరనరాల్లో ఇంకిపోవాలి. లింగ అసమానత్వం, లింగ సమానత్వం అన్న పదాలే భారతదేశ నిఘంటువు నుంచి తొలగి పోవాలంటే అందుకు చిన్ననాటి నుంచి చెప్పే చదువులే ఆలంబన కావాలి. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య -
‘ఉపాధి’లో మనమే ఫస్ట్!
విశ్లేషణ హైదరాబాద్ శతాబ్దాల చారిత్రక వారసత్వం ఉన్న నగరంగానే కాకుండా ప్రపం చంలో ఉత్తమ జీవన ప్రమాణాలు ఉన్న మహానగరంగా కూడా నిలిచింది. గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ ఐటి రంగంలో సాధిస్తున్న పురోగతిని అభినందించారు. తెలుగు సమాజం నుంచి ఐటి సేవల ద్వారా అమెరికా దేశానికి అందిస్తున్న సహకారం వల్ల మా దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందని అందుకే కృతజ్ఞతలు చెప్పేందుకే హైదరాబాద్‌కు వచ్చానని ప్రకటించారు. హైదరాబాద్ ఐటీలో మేటిగా నిలిచింది. ఇప్పుడు విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతుంది. కరెంటు కోతలు లేని నగరంగా నిలబడగలుగుతోంది. మెర్సర్ సంస్థ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఉత్తమ జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఉత్తమ నివాస యోగ్యమైన నగరంగా ప్రపంచంలో 139వ ర్యాంకును, సురక్షితమైన నగరాల జాబితాలో 121వ స్థానాన్ని హైదరాబాద్ పొందింది. ఇండియాలో ఉన్న అన్ని మహానగరాల కంటే హైదరాబాద్ ఐటీ, తదితర కంపెనీలు పెట్టడానికి అనువైన స్థలమని నిపుణులు నిర్ధారించారు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌కు వాతా వరణ స్థ్థితిగతులు బాగా కలసి వచ్చాయి. మద్రాసు, తదితర మహానగరాల కంటే హైదరాబాద్ వాతా వరణం నిశ్చితంగా ఉంటుంది. ఎండ తీవ్రత, చలి తీవ్రతలు అధికంగా ఉండవు. వాతావరణంలో ఊహిం చని పరిణామాలు ఇక్కడ కన్పించవు. ఈ స్థితి దేశంలోని ఏ ఇతర మహానగరాలకూ లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా ఒక మహత్తర పోరాటం జరి గింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చాక ఇక్కడ రాజకీయ స్థిరత్వం వచ్చింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. వివిధ బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ రావటానికి మక్కువ చూపిస్తు న్నాయి. ఇందుకు ఇక్కడి రాజకీయ స్థిరత్వం కూడా దోహదం చేసింది. మానవ వనరులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో పెట్టుబడి కూడా అక్కడికే పరుగెత్తుకు వస్తుంది. హైద రాబాద్‌లో ఉన్న మధ్య తరగతి వర్గం విద్యారంగంపైన పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. తమ పిల్లల చదువుల కోసం ఆస్తులమ్ముకుని పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. దానివలన ప్రైవేట్ రంగంలో ప్రాథమిక సెకండరీ విద్యలో ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో పోల్చదగిన విద్యాసంస్థలు కూడా ఇక్కడ వెలిశాయి. దాని నుంచి పటిష్టమైన సెకండరీ విద్యతో ప్రపంచంతో పోటీపడే స్థాయి మన పిల్లలకు వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్నత విద్యకు కావాల్సిన యోగ్యతను అందించే సంస్థలు రావటం జరిగింది. బిర్లా ఇనిస్టి ట్యూట్, ఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలు ఇక్కడికి వచ్చాయి. సమర్థవంతమైన సంస్థలు రావటం వలన విరివిగా ఇక్కడ మానవ వనరులు లభిస్తున్నాయి. ఇదే స్థితి బ్రెజిల్లో ఉంది. బ్రెజిల్లో సెకండరీ విద్య ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ ఉన్నత ప్రమాణాలను అందిం చింది. పబ్లిక్ రంగంలో ఉన్నత విద్య, పరిశోధనను అభివృద్ధి చేశారు. దీనివల్ల బ్రెజిల్లో సమర్థవంతమైన మానవ వనరులు లభించాయి. అదే అమెరికాలో స్కూలు ఎడ్యుకేషన్ పబ్లిక్రంగంలో, ఉన్నత విద్య ప్రైవేట్ రంగంలో ఉంది. ఈ రెండింటి వలన అమెరికాలో విద్యకు సంబంధించిన ఉపాధి అవకాశాలు పెరిగినాయి. మనదేశంలో విచిత్రం ఏమిటంటే ప్రైవేట్ రంగంలోనే ప్రైమరీ, ఉన్నత విద్య రెండూ ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవటానికై రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టాయి. ఇలా ఉన్నత విద్యారంగాన్ని ఆదుకోవటం వల్ల సామాన్యులు ఉన్నత విద్య గడప తొక్కారు. అట్టడుగు వర్గాలు ఉన్నత విద్యకు రావాలంటే స్కూలు ఎడ్యుకేషన్‌ను పటిష్టం చేసుకోవాలి. ఉన్నత విద్యారంగానికి వచ్చిన మను షులను ఆదుకొంటే మానవ వనరులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్రైవేటు రంగాలు ఒకదాని కొకటి కాంప్లిమెంట్ అయితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేకాకుండా కేవలం సాంకేతిక విద్య పైనే దృష్టిపెడితే అందులో ఉద్యోగ అవకాశాలు దినదినం తగ్గుతున్నాయి. లిబరల్ ఎడ్యుకేషన్‌ను కూడా పెంచుకోవాలి. అందుకు స్కూలు ఎడ్యుకేషన్‌ను ప్రభుత్వరంగంలో పటిష్టం చేసుకొని ఉన్నత విద్యారంగంలో ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ను తీసుకుంటే హైదరాబాద్‌కు మరింత బంగారు భవిష్యత్తు ఉంటుంది. దాంతో సహా లిబరల్ ఎడ్యుకేషన్‌లో కూడా అత్యున్నత ప్రమాణాలు గల ఉన్నత విద్యను తీసుకురాగలిగితే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈనాడు మహానగరాల భవిష్యత్తు అంతా ఉపాధిపైననే ఆధారపడి ఉంటుంది. మన హైదరా బాద్‌కు ఎన్నో అనుకూల పరిస్థితులున్నాయి. రాజకీయ, ఆర్థికరంగంలో ఉన్న నాయకత్వం దీన్ని ఉపయోగిం చుకుంటే ఇప్పటికంటే మరింత భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుజరపబోయే కేజీ టు పీజీ విద్య పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా అమలు జరిగితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే సమర్ధవంతమైన మానవ వనరులను అందించగలిగిన తెలంగాణ రాష్ట్రం భవిష్య త్లో ప్రపంచానికి మరింత శక్తివంతమైన మానవ వనరులను అందించగలదు. అందరికీ ప్రమాణాలు గల విద్య ఎంత వేగంగా అందించగలిగితే హైదరాబాద్ అంత వేగంగా విశ్వనగరంగా రూపుదాల్చుతుంది. హైదరాబాద్‌కు ఐటి మణిహారం కాబోతుంది. తెలం గాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి నాణ్యమైన చదువును కేజీ టు పీజీ విద్య ద్వారా అందించగలిగితే మరింత శక్తివంతంగా ప్రపంచం ముందు నిలిచి తీరుతాం. హైదరాబాద్ మానవవనరుల సంపదల చిరునామాగా నిలుస్తుంది. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్య మాజీ శాసనమండలి సభ్యులు