రిజర్వేషన్ల అమలులో అవకతవకలు

R Krishnaiah Article On Reservations - Sakshi

సందర్భం

సమ సమాజం, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ నిర్మాతలు – పీడిత, అణగారిన, అణచివేతకు గురైన కులాలకు అధికారంలో వాటా ఇవ్వడానికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల అమలులో అధికారులు ఏదేదో సాకుతో రిజర్వేషన్‌ సూత్రాలకు, సిద్ధాంతాలకు వక్రభాష్యం  చెబుతూ  నిర్వచిస్తూ తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సాధికారత కల్పించడానికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపి  జీవో నంబర్‌ 550–జీవో నంబర్‌ 519 జారీ చేయడం జరిగింది. 1986 నుంచి అనేక సర్క్యులర్స్‌ జారీ చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులకు రిక్రూట్‌మెంట్‌ అధికారులు వక్రభాష్యం చెబుతు ఈ వర్గాల ప్రయోజనాలను, అభివృద్ధిని కాలరాస్తున్నారు. ఇటీవల కాలంలో ఎం.బి.బి.ఎస్‌ అడ్మిషన్లలో, పంచాయతీరాజ్‌ సెక్రటరీ పోస్టుల నియామకాలలో, పోలీస్‌ నియామకాల్లో, టీఎస్‌పీఎస్‌సీ  ద్వారా జరిగిన టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌లో, సాంఘిక సంక్షేమ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా జరిపిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల అమలులో అవకతవకలు,అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బీసీ కమిషన్‌కు, ఎస్సీ/ఎస్టీ కమిషన్‌ కు ఫిర్యాదులు వచ్చాయి. 
రిజర్వేషన్లు అమలులో రిక్రూట్‌ మెంట్‌ అధికారులు నాలుగు రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు.  
1) ఆప్షన్‌ పేరుమీద – ఉద్యోగాల నియామకాలలో పోస్టు ఆప్షన్‌ పేరుమీద, శాఖ ఆప్షన్‌ పేరుమీద, జిల్లా ఆప్షన్‌ పేరుమీద– కాలేజి అడ్మిషన్లలో కాలేజి ఆప్షన్‌ పేరుమీద రిజర్వేషన్ల అవకతవకలు–అక్రమాలకు పాల్పడుతున్నారు. 
2) రెండవది– లోకల్‌– నాన్‌ లోకల్‌ రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల అమలులో తప్పుడు విధానం అవలంబిస్తున్నారు. 
3) మూడవది– రెండవ లిస్టు– మూడవ లిస్టు ఆ తర్వాత వేసే క్రమంలో  స్లై్లడింగ్‌–రివైజ్‌ చేయడం లేదు. 
4) నాలుగవది–సెలక్షన్‌ సమయంలోనే సీనియారిటీ పేరుమీద 100 పాయింట్లు రోస్టర్‌ పాయింట్లలో ఫిక్స్‌ చేయడం పేరు మీద అన్యాయం చేస్తున్నారు. 
మొదటి పద్ధతిలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 రిక్రూట్‌ మెంట్‌లలో వివిధ శాఖలలో కలిపి ఎక్కువ కేటగిరీల పోస్టులు ఉండటం వలన పోస్టుల ఆప్షన్ల పేరు మీద పోస్టు–పోస్టుకు రిజర్వేషన్లను వేరు, వేరుగా అమలు చేస్తున్నారు. దీని మూలంగా ఎక్కువ మార్కులు వచి్చన అభ్యర్థులు కూడా ప్రాదాన్యత గల పోస్టులను ఎంపిక చేసుకుంటే రిజర్వేషన్‌ కేటగిరి క్రిందకు వెళుతున్నాయి.  అలాగే సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల టిచర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జరిపిన టిచర్‌ పోస్టులలో కూడా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బి.సి వెల్ఫేర్‌ స్కూళ్ళ టిచర్ల రిక్రూట్‌ మెంట్‌లో ఆప్షన్ల పేరు మీద రిజర్వేషన్‌ వర్గాలకు అన్యాయం జరిగింది. మొత్తం రిక్రూట్‌మెంట్‌ను యూని ట్‌గా తీసుకొని మొత్తం పోస్టుల సెలక్షన్‌ చేసిన తర్వాత ఆప్షన్‌కు అవకాశం కలి్పంచాలి. కాని సెలక్షన్‌– ఆప్షన్‌ ఒకే సమయంలో ఇచ్చి అన్యాయం చేశారు.   
ఇక రెండవ పద్ధతి తప్పుడు నిర్వచనం చూస్తే లోకల్‌–నాన్‌ లోకల్‌ పేరుమీద రిజర్వేషన్‌ అమలు చేసే విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. మొదట నాన్‌ లోకల్‌–ఆ తర్వాత లోకల్‌ కేటగిరిలలో–మొదట ఓపెన్‌ కాంపిటీషన్‌ భర్తీ చేసిన తర్వాతనే రిజర్వేషన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలి. కానీ అలా కాకుండా నాన్‌ లోకల్‌ కోటాలో ఓపెన్‌ కేటగిరి, రిజర్వేషన్‌ కేటగిరి పోస్టులు భర్తీ చేసిన తర్వాతనే లోకల్‌ కోటా ప్రారంభించి భర్తీ చేస్తున్నారు. ఇది అన్యాయం. దీని మూలంగా ఎక్కువ మార్కులు ఉన్న రిజర్వుడు అభ్యర్థులు లోకల్‌ కోటాలో ఓపెన్‌ కాంపిటిషన్‌లో వస్తారు. కానీ మొదట నాన్‌ లోకల్‌ రిజర్వేషన్‌ కోటా భర్తీ చేయడంతో ఎక్కువ మార్కులు ఉన్న రిజర్వుడు అభ్యర్థులు నాన్‌ లోకల్‌లో రిజర్వేషన్‌లోకి వెళుతున్నారు. ఈ తప్పును సరిదిద్దడం లేదు.  

ఇక మూడవ పద్ధతిలోని అన్యాయం చూస్తే మొదటి లిస్టు, రెండవ లిస్టు, మూడవ లిస్టులు వేసేటప్పుడు ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. రెండవ లిస్టు, మూడవ లిస్టు వేసేటప్పుడు స్లైడింగ్, రివైజ్‌ లిస్ట్‌ లాంటి ప్రక్రియలు చేపట్టకుండా అన్యాయం చేస్తున్నారు. మొదటి లిస్టులో రిజర్వేషన్‌లో వచి్చన అభ్యర్థులు కొందరు ఎక్కువ మార్కులు ఉన్నవారు. రెండు– మూడవ లిస్టులలో వచ్చే సరికి మార్కులను బట్టి ఓపెన్‌ కేటగిరికి వెళ్లి పోతారు. కాని అలా రివైజ్‌ చేస్తూ స్లై్లడింగ్‌ చేయడం లేదు. దీని మూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. 1992లో విద్యుత్‌ శాఖ వారు ఏఈ పోస్టుల నియామకాలలో రెండవ లిస్టు సంద ర్భంగా రివైజ్‌ చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  అన్యాయం చేశారు. ఇక విద్యా సంస్థల అడ్మిషన్లలో కూడా ఎం.బి.బి.ఎస్‌ అడ్మిషన్లలో కాలేజీ ఆప్షన్‌ పేరుమీద, పీజీ అడ్మిషన్లలో కోర్సు ఆప్షన్‌ పేరుమీద అన్యాయం చేస్తున్నారు.

నాలుగో పద్ధతిలో అన్యాయం చూస్తే రోస్టర్‌ పాయింట్‌ పేరుమీద మెరిట్‌లో వచి్చన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ అభ్యర్థులను ఇరికించి అన్యాయం చేస్తున్నారు. పాయింట్‌ టు పాయింట్‌ ప్రకారం, మెరిట్‌ మార్కుల ఆధారంగా ఒకటి నుండి సీరియల్‌గా రిక్రూట్‌ చేయడం వలన ఓసీ పాయింట్లలో  ఓసీని– ఆ తర్వాత వచ్చే బి.సి పాయింట్లలో ఎక్కువ మార్కులు వచి్చన బీసీలను రిజర్వేషన్‌ పాయింట్లలో ఫిక్స్‌ చేసి అన్యాయం చేస్తూవచ్చారు. దీనిని 1986–87 లోనే గుర్తించి బి.సి సంక్షేమ సంఘం పోరాటం చేయగా మార్పులు–చేర్పులు చేసి సరిదిద్దారు. ఇప్పటికి ఇంకా కొన్ని రిక్రూట్‌మెంట్‌ సంస్థలు రోస్టర్‌కు వక్ర భాష్యం చెబుతూ, రిజర్వేషన్లకు గండి కొట్టే కుట్రలు మానుకోవడం లేదు. ఖాళీలు భర్తీ చేసేటప్పుడు మెరిట్‌ లిస్టు మరియు రిజర్వేషన్‌ కేటగిరీలో లిస్టు వేరువేరుగా తయారు చేసిన తర్వాత రోస్టర్‌ కం మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల జాబితాను తయారుచేసి నియామక పత్రాలు ఇవ్వాలి. కానీ అలా కాకుండా రిక్రూట్‌మెంట్‌ బోర్డుల నుండి వచ్చిన జాబితానే యధాతధంగా అమలుపరిచి తాము జారీ చేసిన ఉత్తర్వులను వారే తుంగలో తొక్కిపెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా  రిజర్వేషన్ల అమ లులో అవకతవకలకు పాల్పడుతున్నారు.   

వ్యాసకర్త: ఆర్‌. కృష్ణయ్య, అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
‘ మొబైల్‌ : 90000 09164  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top