‘మరడు’ చెబుతున్న గుణపాఠం 

Mangari Rajender Article On Maradu Case - Sakshi

సందర్భం

నదీ ప్రవాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం కూల్చి వేసినప్పుడు మీడియా గగ్గోలు పెట్టింది. నదీ ప్రవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకూడదు.  తెలంగాణ రాష్ట్రంలో కూడా 111 జీవో ఒకటి ఉంది. ఈ జీవో వర్తించే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలని చేపట్టకూడదు. ‘మరడు’ ఉదంతం ద్వారా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే. కేరళ రాష్ట్రంలోని కొచ్చి ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉన్న నది పరీవాహక ప్రాంతం వెంబనాడ్‌ నది పరీవాహక ప్రాంతం. ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న ‘సీఆర్‌జెడ్‌’ ప్రకటనలు ఉన్నాయి. ఒకవేళ చేపడితే ప్రభుత్వాలు ఉపేక్షించినా కోర్టులు ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అందుకు ఉదాహరణే ‘మరడు’ కూల్చివేత ఉదంతం.

 నాలుగువందల కుటుంబాలు నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ని కొచ్చీ దగ్గరలోని మరడులో నాలుగు నిర్మాణ సంస్థలు నిర్మించాయి. ఆ నిర్మాణాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో జనవరి 11, 12న ఇంప్లోషన్‌ పద్ధతిలో కూలి్చవేశారు. హోలీ ఫెమిత్‌ బిల్డర్స్‌ ఫ్లాట్స్‌ నిర్మాణం కోసం మరడు గ్రామ పంచాయతీ నుంచి 18.8.2006 నాడు అను మతి తీసుకున్నారు. ఆల్ఫా వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 19.9.2006 రోజున పంచాయతీ నుంచి ఫ్లాట్స్‌ నిర్మాణానికి అనుమతి తీసుకుంది. ఈ నిర్మాణాలలో చాలా ఉల్లంఘనలు ఉన్నాయని సీనియర్‌ టౌన్‌ ప్లానర్‌ కేరళ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీకి తెలియజేశాడు. దీంతో సంబంధిత నిర్మాణ సంస్థలకు షోకాజ్‌ నోటీసులను జారీ చేయమని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గ్రామ పంచాయతీని ఆదేశించారు. గ్రామ పంచాయతీ నుంచి నోటీసు అందగానే ఆ నిర్మాణ సంస్థలు కేరళ హైకోర్టులో రిట్‌ దాఖలు చేసి సింగిల్‌ జడ్జి ద్వారా స్టే ఉత్తర్వులు పొంది తమ నిర్మాణాలని పూర్తి చేశారు. ఆ తరువాత గ్రామ పంచాయతీ నుంచి నెంబర్లని కూడా పొందారు. ఆ తరువాత ఆ నోటీసులను సింగిల్‌ జడ్జి కొట్టివేశారు.

 ఈ ఉత్తర్వులకి వ్యతిరేకంగా మరడు గ్రామ పంచాయతీ, మరడు మున్సిపాలిటీలు డివిజన్‌ బెంచి ముందు అప్పీలుని 2013లో దాఖలు చేశాయి. ఈ రెండింటినీ హైకోర్టు 2 జూన్‌ 2015న తన తీర్పుని బిల్డర్స్‌ వైపున చెప్పింది. రివ్యూ దరఖాస్తుని కూడా కొట్టివేసింది. కేరళ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి దరఖాస్తుని 2016లో దాఖలు చేసింది. నవంబర్‌ 27, 2018 రోజున సుప్రీంకోర్టు, ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ జోన్‌లో ఆ నిర్మాణాలు ఉన్నాయో లేదా చూడాలని కమిటీని ఆదేశించింది. ఈ కట్టడాలు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ పరిధిలోకి వస్తాయని కమిటీ సుప్రీంకోర్టుకి తెలియచేసింది. కమిటీ నిర్ణయాంశాలని అంగీకరిస్తూ న్యాయమూర్తులు అరుణ్‌మిశ్రా, నవీన్‌ సిన్హాలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ నిర్మాణాలని ఒక నెల లోపు కూలి్చవేయాలని మే 8, 2019న ఆదేశించింది. తమ వాదనలని వినలేదని ఆ ఫ్లాట్స్‌లో నివాసం ఉంటున్న వ్యక్తులతో బిల్డర్స్‌ వేసవి రోజుల్లో దరఖాస్తులు దాఖలు చేసి ఆరువారాల స్టేని పొందారు. వేసవి సెలవుల తరువాత ఈ కేసు మళ్లీ న్యాయ మూర్తి అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచి ముందుకు వచ్చింది. ‘బెంచి హంటింగ్‌’ పద్ధతిని విమర్శిస్తూ ఆ దరఖాస్తులని జూలై 5, 2019 రోజున కొట్టివేశారు. ఆ తరువాత బిల్డర్స్‌ దాఖలు చేసిన రివ్యూ దరఖాస్తులని కూడా కొట్టివేశారు.

 తమ ఉత్తర్వులని అమలుపరచడంలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తూ సెపె్టంబర్‌ 20 లోగా కూల్చివేయాలని, అలా చేయని పక్షంలో సెపె్టంబర్‌ 23 రోజున కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచి సెపె్టంబర్‌ 6, 2019న ఆదేశించింది. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెపె్టంబర్‌ 23న సుప్రీంకోర్టు ముందు హాజరైనాడు. కూల్చివేత అమలు గురించి ప్రణాళికను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించమని కోర్టు ఆదేశించింది. కూల్చివేత వల్ల తమ ఇళ్లు దెబ్బతింటాయని మరికొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ ఫ్లాట్స్‌లోని నివాసితుల నష్టపరిహారం అంచనా వేయడానికి ఓ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బాలక్రిష్ణన్‌ నాయర్‌ని కోర్టు నియమించింది. మార్చి 2018 కోస్టల్‌ జోన్‌ నియమాలకి సవరణలు తీసుకొని వచ్చారని, దాని ప్రకారం తమ నిర్మాణాలు సక్రమమేనని, ప్రొసీజరల్‌ తప్పిదాన్ని సరిచేసుకోవచ్చని, నాలుగు వందల కుటుంబాల జీవితం ఈ కూలి్చవేతతో ముడిపడి ఉందని బిల్డర్స్‌ కోర్టుకి విన్నవించారు. కోర్టు ఈ వాదనని అంగీకరించలేదు.


మంగారి రాజేందర్‌ 
మొబైల్‌ : 94404 83001
(వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్‌ జడ్జీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యునిగా పనిచేశారు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top