గోప్యత హక్కుకు పునాది

Madhabhushi Sridhar Writes on Article 21

విశ్లేషణ
ఆర్టికల్‌ 21 జీవన స్వేచ్ఛ పరిధిలోకి గోప్యత, రతి విషయంలో ఐచ్ఛికత వస్తాయని చౌదరి అన్నారు. సాంకేతిక సమాచార విప్లవం వల్ల ప్రైవసీపై ప్రతికూల దాడుల ప్రభావాన్ని కూడా జస్టిస్‌ చౌదరి 1983లోనే దర్శించగలిగారు.

భార్యాభర్తలలో ఒకరు అకారణంగా దాంపత్య జీవనం నుంచి ఉపసంహరించుకుని విడిగా ఉంటే మరొకరు కోర్టుకు వెళ్లి ‘కలసి కాపురం చేసే’ హక్కుందంటూ డిక్రీ పొందవచ్చునని హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 9 పేర్కొన్నది. కాపురం హక్కు దాంపత్య హక్కు అని కవితాత్మకంగా చెప్పే ఈ హక్కు అసలు రూపం ఏమంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రతిలో పాల్గొనాలని ‘బలవంతపు రతి హక్కు’. చట్టం ద్వారా దంపతులలో ఒకరు మరొకరిని ఒప్పించే హక్కు కాదు, ఒప్పుకోకపోయినా రతికి రప్పించే హక్కు. వైవాహిక అత్యాచారం చెల్లదంటూ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. గోప్యత, స్వత్వం, ఎంపిక హక్కులతో కూడిన ప్రైవసీ ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో జస్టిస్‌ చౌదరి 1983లో ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పు గుర్తుకొస్తుంది.

16 ఏళ్ల సరితతో వెంకటసుబ్బయ్య వివాహం జరిగింది. కాని అయిదేళ్లుగా వారు విడిగా ఉన్నారు. సరిత పెద్ద సినీనటిగా ఎదిగినారు. వెంకటసుబ్బయ్య తనకు సరితతో కాపురం చేసే హక్కు ఉందని డిక్రీ సాధించారు. అది ఇష్టం లేని వివాహమని, తనను బలవంతంగా కాపురానికి పంపకూడదని, అసలు సెక్షన్‌ 9 రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో సరిత  సవాలు చేశారు. శారీరకంగా మరొకరితో కలియడమా, లేదా అనే విషయంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ సహజంగా ఉందని, ఇష్టంలేని రతి డిక్రీలు ఇవ్వడం అన్యాయమనీ ఆమె వాదించారు.

జస్టిస్‌ చౌదరి కాపురం హక్కులో రెండు భావాలు ఉన్నాయన్నారు. 1. దంపతులలో ఒకరికి మరొకరితో కలసి ఉండే హక్కు. 2. వైవాహిక సంయోగం. అన్నాసాహెబ్‌ వర్సెస్‌ తారాబాయి కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పునిస్తూ, భర్త ప్రవర్తనలో లోపం లేనపుడు, భార్యకు ఇష్టం లేకపోయినా ఆమెతో కాపురం చేయాలని ఆదేశించే డిక్రీని సమర్థించింది. ఇక ఆ తారాబాయి గతేమిటో చదువరుల ఊహకే వదలాలి అని జస్టిస్‌ చౌదరి వ్యాఖ్యానించారు. మహాకవి శ్రీశ్రీ చెప్పిన రాక్షస రతి ఇదేననీ, ఇది క్రూరమైన చట్టమనీ చౌదరి అన్నారు. బతికే హక్కు అంటే జంతువు వలె ఏదో రకంగా ప్రాణం నిలబెట్టుకోవడం కాదు, ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించడాన్ని ఆర్టికల్‌ 21 ఆశిస్తున్నది. ఖరక్‌ సింగ్‌ కేసులో సుబ్బారావు అసమ్మతి తీర్పును ఉటంకిస్తూ, ఆర్టికల్‌ 21 జీవన స్వేచ్ఛ పరిధిలోకి గోప్యత, రతి విషయంలో ఐచ్ఛికత వస్తాయని చౌదరి అన్నారు.

సాంకేతిక సమాచార విప్లవం వల్ల ప్రైవసీపై ప్రతికూల దాడుల ప్రభావాన్ని కూడా చౌదరి 1983లోనే దర్శించగలిగారు. సుబ్బారావు అసమ్మతి తీర్పు, గోవింద్‌ కేసు, అమెరికాలో గ్రిస్‌ వరల్డ్‌ జానే రో కేసులను చౌదరి ప్రస్తావించి విశ్లేషించారు. కుటుంబ సభ్యుల మధ్య సామీప్యత, ఆంతరంగికత, వైవాహిక సంబంధాలు, మాతృత్వం, పిల్లలను కనిపెంచడం వంటి అంశాలన్నీ గోప్యతా హక్కు పరిధిలో ఉన్నాయని, మానవ జీవన ఆనందానికి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశాలు ఏలిన వారి జోక్యం వల్ల దెబ్బతింటే రిట్‌ పిటిషన్‌లో అడిగే హక్కు ఉందని, పాలకులు ప్రమాద ఘంటికలు వినబడితే తప్ప ఇటువంటి విషయాల్లో అనవసరంగా, అసమంజసంగా జోక్యం చేసుకునే వీల్లేదని గోవింద్‌ కేసులో సుప్రీంకోర్టు చేసిన విశ్లేషణను చౌదరి సమర్థించి మరింత విస్తరించారు. ఓంస్టెడ్‌ కేసులో జస్టిస్‌ బ్రాండీస్‌ అసమ్మతి తీర్పుతో చౌదరి తన వాదాన్ని మరింత పరిపుష్ఠం చేశారు. ప్రశాంతత, చొరబాటులేని ఏకాంతత, ఆంతరంగిక నిర్ణయ స్వేచ్ఛ అనేవి గోప్యతలో మూడు కీలకమైన అంశాలని గేరీ ఎల్‌. బోస్ట్‌ విక్‌ అనే రచయిత పేర్కొన్నారు.

జస్టిస్‌ చౌదరి ఈ అంశాలన్నీ పరిశీలించి, సెక్షన్‌ 9 కింద బలవంతపు కాపురపు ఉత్తర్వులివ్వాలనే చట్ట నియమం రాజ్యాంగ ప్రా«థమిక హక్కుల సూత్రాలకు పూర్తి భిన్నంగా ఉందని, కనుక చెల్లదని వెల్లడించారు. జస్టిస్‌ చౌదరి తీర్పు ఆనాడు ఢిల్లీ హైకోర్టును మెప్పించలేకపోయింది. హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 9 చెల్లుతుందని, వివాహం అనే వ్యవస్థను రక్షించడానికి అంగీ కారంతో ప్రమేయం లేకుండా కాపురం హక్కు డిక్రీ అధికారం ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది, ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. జస్టిస్‌ సుబ్బారావు, గోవింద్, అమెరికా తీర్పులు, బోస్‌ విక్, గ్రిస్వాల్డ్‌ కేసులు చర్చిస్తూ జస్టిస్‌ చౌదరి ఇచ్చిన తీర్పులో అంశాలను ఆ కేసులనే ప్రస్తావిస్తూ, తొమ్మిదిమంది న్యాయమూర్తుల ధర్మాసనం గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించడం ద్వారా1983 నాటి ఆయన ఆలోచనకు గౌరవం లభించినట్టయింది.

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top