స్వయంకృతం

K Ramachandra Murthy Write Article On Chandra Babu Naidu - Sakshi

తాము ఏది చేసినా చెల్లుతుందనీ, ఏదైనా తాము మాత్రమే చేయగలమనే భావన స్వానురాగం ఆవహించినవారిలో బలంగా ఉంటుంది. ఎదుటివారి శక్తిని వారు పరిగణనలోకి తీసుకోరు. ఎంతటివారైనా తన శక్తియుక్తుల ముందు బలాదూరని నమ్ముతారు. ఇటువంటి మానసిక స్థితిని నార్సిసిజంగా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. ప్రస్తుత స్థితే ప్రధానం. అంతకు ముందు, ఆ తర్వాత స్థితిగతులు ముఖ్యం కాదు. ఎప్పటికీ తమదే పైచేయి కావాలి. ప్రతి పోరాటంలో తామే గెలవాలి. గెలుపు కోసం ఏమి చేసినా తప్పులేదు. వర్తమాన పరిస్థితిలో తాము చేసే ఆలోచనలే వారికి శిరోధార్యం. వాటినే బలంగా నమ్ముతారు. ఈ రోజుకు ముందు అదే విషయంపైన ఏమి అన్నారో పట్టించుకోరు. నిన్న చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఈ రోజు చెప్పి అదే సత్యమంటూ నిస్సంకోచంగా వాదిస్తారు. తమను తాము అమితంగా ప్రేమించుకుంటారు. తమ లోపాలను తాము గుర్తించడానికి నిరాకరిస్తారు. ఇతరులను అనుకరించినప్పుడు కూడా తామే ఆ పని ప్రప్రథమంగా చేస్తున్నట్టు భావిస్తారు. అటువంటి ఆలోచన తమకి తప్ప మరెవరికీ రాజాలదని అనుకుంటారు. స్వానురాగం జీర్ణించుకున్నవారు ఎవ్వరినీ విశ్వసించరు. తమ నీడను సైతం నమ్మరు. ఎవ్వరినీ ప్రేమించరు. ప్రేమించినట్టు నటిస్తారు. వారిని ఎవ్వరూ నమ్మరు. ఎవ్వరూ ప్రేమించరు. 

వాడుకోవడం, వదిలేయడం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కోవకి చెందిన వ్యక్తి. రాజకీయాలలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తారు. అందుకే కమ్యూనిస్టులతో, బీజేపీతో విడతల వారీగా పొత్తులు పెట్టుకునే విషయంలో స్వీయప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటారు. 1994లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రచార సారథి లక్ష్మీపార్వతీ సహిత ఎన్‌టి రామారావు. అప్పటికే చంద్రబాబుకి పార్టీపైన పూర్తి పట్టు వచ్చింది. చాలామంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులతో మమేకమై పనిచేశారు.

1995లో ఎన్‌టి రామారావుని గద్దె దింపి పగ్గాలు చేతపట్టిన తర్వాత చంద్రబాబు వైఖరి మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా చెప్పుకోవడానికి ఇష్టపడేవారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయంలో కమ్యూనిస్టులు సంస్కరణలకు ఆటంకమని నిందించారు. వారిని పక్కన పెట్టారు. కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ వాదించి వారిని అవమానపరిచారు. ఆ తర్వాత కమ్యూనిస్టు భావజాలానికి పూర్తి విరుద్ధమైన భావజాలం కలిగిన బీజేపీతో చెలిమికి మొగ్గు చూపించారు. 1999లో కార్గిల్‌ యుద్ధంలో విజయం తర్వాత వాజపేయి ప్రాబల్యం దేశమంతటా పెరి గిందనే అంచనాతో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు.

అఖిలపక్ష సమావేశాలకి సీపీఐ ప్రతినిధులను ఆహ్వానించేవారు కాదు. శాసనసభలో ఆ పార్టీ సభ్యులు ఎవ్వరూ లేరు కనుక పార్టీని పిలువనక్కరలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అవసరం లేదని అనుకుంటారు. మొత్తం ప్రజలందరికీ తానే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వేరే వ్యక్తులు ఎందుకని భావిస్తారు. మంత్రివర్గం అంటూ ఒకటి ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కనుక సొంతంగా ఆలోచించలేని వారిని, విధేయులను ఎంపిక చేసి మంత్రులుగా నియమిస్తారు. అయినప్పటికీ ఐఏఎస్‌ అధికారులతో స్వయంగా మాట్లాడి ఏ పని చేయాలో, ఏ పని చేయరాదో చెబుతారు. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికలలో పరాజయం అనంతరం బీజేపీకి దూరంగా జరిగారు.

2009లో తిరిగి కమ్యూనిస్టు పార్టీలతో సయోధ్య కుదుర్చుకున్నారు. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ దూరంగా ఉండాలనే విధానంతో కమ్యూనిస్టులు రాజీపడ్డారు. అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏకి మద్దతు ఉపసంహరించుకున్న కమ్యూనిస్టులకు తాజా శత్రువు కాంగ్రెస్‌. టీడీపీతో తిరిగి భుజం కలపడానికి అభ్యంతరం లేకపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే ఏకైక ఎజెండా కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి సైతం మహాకూటమిలో స్థానం కల్పించారు. ఎట్లాగైనా గెలవాలనీ, కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనీ ఉద్దేశం. చిరంజీవి నాయకత్వంలోని పీఆర్‌పీ టీడీపీకి అవరోధంగా ఉండనే ఉన్నది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. పీఆర్‌పీ ఆశించినంతగా ఓట్లు సంపాదించలేకపోయింది. మహాకూటమి సైతం ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే చంద్రబాబు టీఆర్‌ఎస్‌కి దూరమైనారు. 

అవకాశవాదానికి పరాకాష్ఠ

2014 నాటికి యూపీఏ–2 అప్రతిష్ఠపాలైనదని గ్రహించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రజలను మెప్పించడం గమనించారు. కమ్యూనిస్టు సోదరులతో తెగతెంపులు చేసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాభదాయకం అని లెక్కకట్టారు. అయినప్పటికీ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీపై గెలవడం కష్టమని భావించారు. ఎందుకైనా మంచిదని సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్ళి తనకు మద్దతుగా నిలవాలని అడిగారు. భావసామ్యం లేదు. అవకాశవాదమే నడిపించింది. మోదీ, తానూ, పవన్‌ కల్యాణ్‌ కలసి విస్తృతంగా ప్రచారం చేశారు. అడ్డూఅదుపూ లేకుండా హామీలు గుప్పిం చారు. వైఎస్‌ఆర్‌సీపీ కంటే రెండు శాతం తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.

మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు నాలుగేళ్ళూ అమరావతి నిర్మాణం పేరుతో సింగపూర్, జపాన్, ఇంగ్లండ్‌ వగైరా దేశాలన్నీ ప్రత్యేక విమానంలో చుట్టి వచ్చారు. మొదటి నుంచీ విదేశాల పట్ల మోజు ఎక్కువ. అమరావతిలో రాజధాని నిర్మాణం ఎక్కడ జరుగుతుందో సన్నిహితులకు రహస్యంగా సమాచారం అందించారు (ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌). వారు విలువైన స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో రైతులను నయానాభయానా ఒప్పించి ముప్పయ్‌ వేల పైచిలుకు ఎకరాల భూమిని సేకరించారు. ప్రపంచంలోని అయిదు అద్భుత నగరాలలో అమరావతి ఒకటి కావాలన్న కలను పలవరిస్తూ పదవీ కాలంలో అయిదింట నాలుగో వంతు గడిపేశారు.

పోలవరం కింద మునిగిపోయే ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని పట్టుబట్టానని తన పుట్టినరోజు ఏప్రిల్‌ 20న చేసిన ధర్మదీక్ష సమయంలో కూడా పునరుద్ఘాటించారు. ఇది నిజమో, కాదో నరేంద్రమోదీ మాత్రమే చెప్పగలరు. ఆయన మౌనంగా ఉంటారనే చంద్రబాబు నమ్మకం. చంద్రబాబునాయుడూ, బాలకృష్ణ గావు కేకలు పెట్టినా, తర్జని చూపుతూ హెచ్చరించినా, ఎన్‌డీఏ నుంచి టీ డీపీ నిష్క్రమించినా, కేంద్ర మంత్రిమండలి నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులు వైదొలిగినా మోదీ మౌనం వీడలేదు. ఈ పరిణామాలపైన అమిత్‌షా మాట్లాడారు కానీ మోదీ నోటి నుంచి ఇంత వరకూ ఒక్క మాటకూడా రాలేదు. 

ఏప్రిల్‌ 30న తిరుపతిలో నిరసన సభ నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎందుకు? తిరుపతిలోనే ప్రత్యేకహోదాపైన మోదీ హామీ ఇచ్చారు కనుక. నాలుగేళ్ళ కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చాలా కాలం పాటు ప్రణాళికా సంఘం ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వవలసిందిగా ప్రణాళికా సంఘాన్ని మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఆదేశిం చింది. ఆ ఆదేశాలను అమలు చేయాలని ఒక్కసారి కూడా చంద్రబాబు ప్రణాళికా సంఘాన్ని కానీ, దాని అధ్యక్షుడు మోదీని కానీ అడగలేదు. విదేశీ పర్యటన రంధిలోనే పుణ్యకాలం గడిచి పోయింది. అంతలో నీతిఆయోగ్‌ వచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చాయి. ప్రత్యేకహోదా అనేది ఇక మీదట ఏ రాష్ట్రానికీ ఇవ్వడం సాధ్యం కాదనీ, అందుకు ఆర్థిక సంఘం అంగీకరించదనీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2016 సెప్టెబర్‌ 8వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటిస్తే అదే రాత్రి చంద్రబాబు అమరావతిలో మీడియా గోష్ఠి నిర్వహించి ప్యాకేజీని స్వాగతిం చారు. ప్యాకేజీని సమర్థిస్తూ రకరకాలుగా మాట్లాడారు.

ప్యాకేజీని వ్యతిరేకిస్తే, ప్రత్యేకహోదా కావాలంటూ ఉద్యమిస్తే పీడీ యాక్టు కింద జైల్లో పెడతానంటూ హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? తన శక్తి మీద తనకు అపరిమితమైన నమ్మకం ఉండటం వల్ల. అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలైనా ఇవ్వవచ్చుననీ, ఎన్ని పనులైనా చేయవచ్చుననీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేయవచ్చుననీ, దేనినైనా అమలు పరచవచ్చుననీ, అమలు చేయకుండా ఎగవేయవచ్చుననీ విశ్వాసం. ఎన్నికలు కనుచూపు మేరలో లేవు కనుక ప్యాకేజీకి ప్రజలను బలవంతంగానైనా ఒప్పించవచ్చునని భావించారు. ప్రతిపక్షాలకి జవాబు చెప్పవలసిన అవసరాన్ని ఆయన ఎన్నడూ గుర్తించలేదు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడి స్వపక్షీయులతో చప్పట్లు కొట్టించుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. 

బెడిసికొట్టిన ప్యాకేజీ

ప్యాకేజీ కథ చంద్రబాబు ఆశించినట్టు జరగలేదు. ప్రజలు ప్రత్యేకహోదాను విస్మరించలేదు. ప్రతిపక్ష నాయకుడు యువభేరి పేరుతో సమావేశాలు నిర్వహించి యువతీయువకులకు ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరించారు. పాదయాత్రలోనూ అదే విషయాన్ని నిత్యం పునరుద్ఘాటిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కొత్త పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ రాష్ట్రానికి రాలేదు. ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాననీ, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి కింద రెండువేల రూపాయల వంతున చెల్లిస్తామనీ చేసిన ఎన్నికల వాగ్దానాలు గాలికి కొట్టుకొనిపోయాయి. పాదయాత్రలో జనసందోహం నానాటికీ పెరిగి పోతోంది. జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా గాలి వీస్తున్నదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మరో వంక దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గుజరాత్‌ ఎన్నికలలో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన బతుకు జీవుడా అన్నది.

ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ కోల్పోయింది. మోదీకి జనాదరణ తగ్గిపోతోంది. ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్‌ కోలుకుంటోంది. 2019నాటి ఎన్నికలలో ప్రజలకు చూపించేందుకు తన ప్రభుత్వం సాధించిన విజయం ఒక్కటీ లేదు. ప్రత్యేక విమానంలో పర్యటనలు జరుపుతుండగానే నాలుగేళ్ళూ గడిచిపోయాయి. అమరావతి నగర నిర్మాణంలో ఒక్క ఇటుకను కూడా పేర్చలేదు. పోలవరం పేచీ పరి ష్కారం కాలేదు. రైల్వేజోన్‌ లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు. దిక్కు తోచలేదు. 

ఇంతలో ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్‌ అధికారి జైన్‌ వచ్చి గంటన్నర సేపు మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం తనపైన కేసులు పెడుతుందనే భయం వెంటాడుతున్నట్టు దీక్ష చివరలో చేసిన ప్రసంగం స్పష్టం చేస్తున్నది. ఈ సంగతి చంద్రబాబునాయుడికి చాలా కాలంగా అనుమానం ఉన్నది. అందుకే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసినా టీడీపీ ఎంపీల చేత రాజీ నామా చేయించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నట్టు కనిపించినా కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గంలోని చిదంబరం, గులాంనబీ ఆజాద్‌తో సంబంధాలు పెట్టుకున్నట్టే బీజేపీ అగ్రనాయకులు కొందరితో సంబంధాలు కొనసాగిస్తున్నారు.

అందుకే మహారాష్ట్ర ఆర్థికమంత్రి సతీమణికి తిరుమల తిరుపతి దేవస్థానం మండలిలో సభ్యత్వం ఇచ్చారు. స్వామికార్యం, స్వకార్యం కోసం మాజీ మంత్రి సుజనా చౌదరికి బీజేపీ నాయకులతో సంబంధాలు పెట్టుకోక తప్పదు. ఇటువంటి గందరగోళం కారణంగా చంద్రబాబు ఒక మాట మీద నిలబడలేకపోవడం, ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోవడం కనిపిస్తున్నది. లోపల పీడిస్తున్న భయాందోళనలను కప్పిపుచ్చుకోవడానికే గట్టిగా, సుదీర్ఘంగా గంటల తరబడి మాట్లాడటం. అంతా స్వయంకృతం. ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. హెచ్చులకు పోయి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు.


కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top