దశ తిరగనున్న ‘సంచారం’

Juluru Gowri Shankar article on nomadic tribes - Sakshi

సందర్భం
దాదాపు 50 ఏళ్లకు పైగా తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న 24 సంచార జాతులకు కుల సర్టిఫికెట్లను కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వగలిగితే, 2018లో సంచార జాతుల జీవితంలో కొత్త వసంతం చిగురించినట్లే.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 24 సంచారజాతుల కులాలకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అనేక విన్నపాలు బీసీ కమిషన్‌ దృష్టికి వచ్చాయి. వారు 1.బాగోతుల, 2.క్షత్రియ రామజోగి (రామజోగి), 3.బైలుకమ్మర, బైట కమ్మర (ఘిసాడి), 4. కాకిపడగల, 5.ఓడ్, 6. బొప్పల తోలుబొమ్మలాటవారు, 7.గంజికూటివారు, 8.ఏనూటివారు, 9.గుర్రపువాళ్లు, 10.అద్దపువారు, 11.మాసయ్యలు, 12. పటంవారు, 13.సాధనాసూరులు, 14.రుంజ, 15.పనస, 16.పెక్కర, 17.పాండవుల వారు, 18. గౌడజెట్టి, 19.ఆదికొడుకులు, 20. తెరచీరలు, 21.గవులి, 22.అహిర్‌ (యాదవ్‌), 23.సారోళ్లు, 24.వాఘిరి.

వీరికి కుల సర్టిఫికెట్లు అత్యవసరంగా అందించవల్సి ఉంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. కాబట్టి బీసీ కమిషన్‌ పని సులభమైంది. సంచార జాతులకు ప్రయోజనాలను చేకూర్చేందుకు కమిషన్‌ తనవంతు పాత్ర నిర్వహించనుంది. మొత్తం 24 కులాల జనాభా సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరికి ఈ కుల సర్టిఫికెట్లు ఇస్తే ఎంతో ఆసరాగా ఉంటుందని తమ పిల్లలు బడులు పోవడానికి మార్గం సుగమం అవుతుందని తెలియజేస్తున్నారు.

నిజంగానే గత 50 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన ఏలికలు తమకేమీ చేయలేదన్న నిరాసక్తతతో ఎంబీసీ, సంచారజాతుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణతో తమ బతుకులు మారతాయని సంచారజాతులు, ఎంబీ సీలు భావిస్తున్నారు. 24 కులాలను బీసీ కులాల జాబి తాలో చేర్చడం నూతన సంవత్సరంలో జరుగుతుందని, వచ్చే ఏడాది బడులు తెరిచేనాటికి  తమపిల్లలు తమ కుల సర్టిఫికెట్లతో వెళతారన్న నమ్మకం ఉంది. 2018లో తమకు మేలు జరుగుతుందన్న విశ్వాసం మొత్తం బీసీ వర్గాల్లో ఉంది. ప్రధానంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థలో బీసీల రిజర్వేషన్‌ 54 శాతానికి పెంచటం, దాంతో పాటుగా అన్ని వర్గాల బీసీల ప్రాతినిధ్యానికి, ఎంబీ సీలు, సంచారజాతులవారికి ఆ రిజర్వేషన్‌ ఫలాలందే విధంగా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ జరగాలని కోరుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2018లో ఎంబీసీలు, వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారికి విద్యా, ఉద్యోగ విషయాలలో ప్రత్యేక రాయితీలను కల్పించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో నాలుగు రోజులు సుదీ ర్ఘంగా చర్చించటం జరిగింది. ఆ కమిటీ ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ విషయంపై ముఖ్యమంత్రి తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ సందర్భంగానే బీసీలకోసం ప్రత్యేకంగా అసెం బ్లీని కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఆ అసెంబ్లీలోనే అనేక కీలక అంశాలను సీఎం ప్రకటించే అవకాశం ఉంది.

బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీలకు రుణాలు ఇవ్వాలని ఎప్పట్నించో చర్చ జరుగుతుంది. అది తొలిసారిగా నూతన సంవత్సరంలో ఆచరణ రూపానికి వచ్చే అవకాశం ఉంది. తరతరాలుగా సంచారం చేస్తూ స్థిరనివాసం లేని వారికి నివాసాలు కల్పించటం, వారి పిల్లలకు చదువులు చెప్పించటం జరగాలి. ఇప్పటికే గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై కొన్ని వందల కోట్ల రూపాయలను కేటాయించడం, వాటి ఫలాలను పొందే దిశగా ముందుకు సాగుతున్నారు. బీసీలలో వృత్తులనే నమ్ముకున్న వారు ఆధునిక వృత్తులలోకి వెళ్లేందుకు శిక్షణను ఇవ్వాల్సి ఉంది. ఎంట్రన్స్‌ పరీక్షలతో సంబంధం లేకుండా సంచార జాతుల పిల్లలకు గురుకులాలలో రిజర్వ్‌డ్‌ సీట్లను వీరికి కేటాయించాలని కోరుతున్నారు.

సంచారకులాల్లో కొందరిని ఇప్పటికీ నేరస్త కులాలుగా చూస్తున్నారు. ఆ నేరస్త కులాల పట్టికను రద్దుచేయాలి. ఎంబీసీలు, సంచార జాతుల వారికి వారు చేయగల్గిన పనులన్నింటికీ ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు నిధులిచ్చి, ప్రత్యేక శిక్షణలిచ్చి, ఆధునిక వృత్తుల్లోకి తీసుకు రావాలి. మొత్తం మీద 2018 బీసీ కులాలకు, తెగలకు, ఎంబీసీలకు, సంచార జాతులకు కలిసివచ్చే సంవత్సరంగా ఉంటుందని ఆ వర్గాలు ఆశి స్తున్నాయి.

తెలంగాణ సమాజం మొత్తంగా వారి ఆశలు నెరవేరాలని దీవించాలి. సంచార జాతులతో కూడిన సగం సమాజం బాగుపడితే మొత్తం తెలంగాణ సమాజం శక్తివంతమవుతుంది. ఈ 24 కులాల సంచార జాతులను బీసీ జాబితాలో చేర్చటం జరిగితే అదే తమకు కొత్త సంవత్సరపు సంతోషకరమైన వార్త అవుతుందని సంచార జాతుల వారు అంటున్నారు. ఇప్పటి వరకు కుల సర్టిఫికెట్లు లేని 24 కులాల వారికి కుల సర్టిఫికెట్లు ఇచ్చి నూతన సంవత్సరంలో విముక్తం చేస్తారన్న విశ్వాసాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. ఇది సంచార జాతులు, ఎంబీసీల సంవత్సరం, ఇది బీసీ వసంతం.


జూలూరు గౌరీశంకర్‌
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు
మొబైల్‌ : 94401 69896

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top