విశ్వసనీయత లేని అవిశ్వాసం

IYR Krishna Rao Comments On TDP No Confidence Motion - Sakshi

ఆ ముచ్చట కూడా తీరిపోయింది. కేంద్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అనుకున్నట్లుగానే వీగిపోయింది. ఇంతకూ ఏమి ఆశించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉన్నది. అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వంలో మార్పు వచ్చే అవకాశం లేదు అనేది ముందే తెలిసిన విషయం. ఇక విభజన అంశాలలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని అన్ని అంశాల మీద నిర్ద్వంద్వంగా చెప్పకనే చెప్పింది. అవిశ్వాసం వల్ల భయపడి వారి విధానంలో మార్పు వస్తుందని ఆశించే అవకాశం లేదు. ఇక ఎటు వచ్చి అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించగలిగిన ఒకే ఒక్క లక్ష్యం ప్రజల ముందు విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టటం. ఈ అంశం మిగిలిన రాష్ట్రాలకు ప్రధానమైన అంశం కాదు కనుక దీనిపై చర్చ కనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజలు స్పందించే అవకాశం ఎటు లేదు.

ఇక మన రాష్ట్రంలో ప్రజలు స్పందించడానికి ఈ అవిశ్వాసం ఒక్కటే మార్గం కానక్కర్లేదు. పైపెచ్చు కేంద్రాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా నిలదీయటానికి తెలుగుదేశం పార్టీకి కొన్ని సహజమైన పరిమితులు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడం, దానికి చట్టబద్ధత కావాలని కోరడం, కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించడం ఇవన్నీ జరిగిపోయాయి. ఆ ప్యాకేజీ కింద నిధులు పొందే సమయంలో తీసుకోవాల్సిన తదనంతర చర్యలు ఆపేసి రాష్ట్ర ప్రభుత్వం హోదా బాటపట్టింది. ఈ అంశంపై జరిగే చర్చలో కేంద్రాన్ని టీడీపీ నిలదీసే బదులు తెలుగుదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిలదీసే అవకాశాలు జాస్తి. అటువంటి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో పోయి అవిశ్వాస తీర్మానం పెట్టడం సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.

రెండో ముఖ్యాంశం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంతో కొంతలో కొంత సఖ్యత నిలుపుకుంటూ నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉన్నది. ప్రతిపక్షాల లాగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే వెసులుబాటు అధికారంలో ఉన్న పక్షానికి ఉండకపోవచ్చు. ప్యాకేజి ద్వారా ఎస్పీవీ పెట్టుకుంటే నిధులు వస్తాయంటే మేముపెట్టుకోము మాకు హోదా కావాలని భీష్మించే అవకాశం ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకి ఉండదు.

ఇక అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చను పరిశీలిస్తే.. టీడీపీ ఎంపీలు తప్ప మిగిలిన పార్టీల తరఫున మాట్లాడిన సభ్యులెవరికీ విభజన సమస్యలు, ప్రత్యేకహోదా ప్రధానాంశాలు కాకుండా పోయాయి. అందువలన చాలావరకు అవిశ్వాస తీర్మానం సాధారణ రాజకీయ పరిస్థితులపై చర్చకే పరిమితం కావడం జరిగింది. మరి అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల మద్దతు అడిగినప్పుడు టీడీపీ ఎంపీలు తమ తీర్మానానికి మద్దతు మాత్రమే అడిగారా లేక వారు ప్రసంగించేటప్పుడు విభజన అంశాల గురించి మాట్లాడవలసిందిగా అభ్యర్థించారా? ఆవిధంగా అభ్యర్థించి ఉంటే తప్పకుండా విభజన అంశాల ప్రస్తావన మిగిలిన పార్టీల సభ్యుల ప్రసంగాల్లో కూడా ప్రధానంగా వినిపించి ఉండేది. ఏపీ విభజన చట్టం చర్చించే సమయంలో దానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడిన టీఎంసీ పార్లమెంటు సభ్యులు సౌమిత్రి రాయ్‌ ఈసారి మాత్రం పెద్దగా స్పందించలేదు. ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా తీసుకు పోవటంలో టీపీపీ పూర్తిగా విఫలమైందని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శన చాలు.

ఈ అవిశ్వాస తీర్మానం మోదీకి రాజకీయంగా విస్తృత అంశాలపై స్పందించటానికి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చిందే కానీ రాష్ట్ర విభజన అంశాలు కానీ ప్రత్యేకహోదా అంశం కాని కేంద్ర బిందువుగా చర్చజరిగే అవకాశం కల్పించలేదు. చర్చ ముగించే ముందు వచ్చిన అవకాశాన్ని కేశినేని సరిగా వినియోగించుకోలేదు. ప్రభుత్వం నుంచి వివరణ హామీ కోసం నిర్దిష్ట అంశాలను లేవనెత్తి ఉండాల్సింది.
మొత్తం అవిశ్వాస తీర్మానం పై జరిగిన చర్చలో ఒక ప్రధానాంశాన్ని టిఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ లేవనెత్తారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? పరిశ్రమ రాయితీలు హోదాలో భాగమా? అన్నారు. నా దృష్టిలో దీనిమీద ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అది గమనించలేకపోవడం మన అవగాహనా రాహిత్యంగా కనిపిస్తూ ఉన్నది.

- ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top