పినరయి విజయన్‌ (కేరళ సీఎం) రాయని డైరీ

Guest Column By Madhav Singa Raju - Sakshi

మాధవ్‌ శింగరాజు

స్టేట్‌లో ఉన్నది ఒకటే సీటైనా, స్టేటంతా తమదే అన్నట్లు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు బీజేపీ భక్తులు. ‘బీజేపీని ఆపగలుగుతున్నాం కానీ, బీజేపీలోని భక్తిని ఆపలేకపోతున్నాం సర్‌..’ అన్నాడు లోక్‌నాథ్‌ బెహెరా ఫోన్‌ చేసి! ఒక డీజీపీ అనవలసిన మాట కాదు. ‘‘బీజేపీ, భక్తి రెండూ ఒకటే అయినప్పుడు బీజేపీని ఆపితే ఆటోమేటిగ్గా బీజేపీలోని భక్తి కూడా ఆర్డర్‌లోకి రావాలి కదా లోక్‌నాథ్‌’’ అని అడిగాను. ‘‘కానీ సర్, బీజేపీ కన్నా, బీజేపీలోని భక్తే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంది. పట్టలేకపోతున్నాం. దాన్నే పట్టగలిగితే బీజేపీని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందుకోసమే ట్రయ్‌ చేస్తున్నాం సర్‌’’ అన్నాడు. 
‘‘ఎందుకోసం?’’ అన్నాను.  

‘‘అదే సర్, బీజేపీలోని భక్తిని పట్టుకోవడం కోసం’’ అన్నాడు. భక్తినెలా పట్టుకుంటాడో అర్థం కాలేదు! ‘‘లోక్‌నాథ్, మీరు భక్తిని పట్టుకునే ప్రయత్నంలో మిమ్మల్ని భక్తి పట్టుకోకుండా జాగ్రత్త పడండి’’ అని చెప్పాను. ‘‘సర్, శబరిమల నుంచి ఫోన్‌’’ అంటూ గాభరాగా వచ్చాడు టామ్‌ జోస్‌. ‘‘ఎవరికొచ్చింది? ఎవరు చేశారు?’’ అని అడిగాను. ‘‘కనుక్కుంటాను సర్‌’ అని, నాకివ్వబోయిన ఫోన్‌ని మళ్లీ తన చెవి దగ్గర పెట్టుకున్నాడు! టామ్‌ జోస్‌ కొత్తగా వచ్చిన చీఫ్‌ సెక్రటరీ. పాల్‌ ఆంటోని ప్లేస్‌లో వచ్చాడు. పాల్‌ ఆంటోని రిటైర్‌ అయ్యాడని టామ్‌ జోస్‌ని తెచ్చుకుంటే, టామ్‌ జోస్‌ రిటైర్‌ కాకుండానే ‘ఆషా థామస్‌ని తెప్పించుకోండి నేను పోతున్నా..’ అనేసేలా ఉన్నాడు.

ఆషా థామస్‌.. అతడి తర్వాత లైన్‌లో ఉన్న చీఫ్‌ సెక్రటరీ. శబరిమల నుంచి ఫోన్‌ వచ్చిన ప్రతిసారీ, శబరిమల ఇంకే స్టేట్‌లోనైనా ఎందుకు లేకపోయిందా అన్నట్లు ఫీలింగ్‌ పెట్టేస్తున్నాడు టామ్‌ జోస్‌. రెండు వేల ఇరవై వరకు ఉంది అతడి టెన్యూర్‌. ఈ మకరజ్యోతి కాకుండా, ఇంకో మకరజ్యోతిని కూడా చూడాలి అతడు. ఇద్దరు మహిళలు గుడిలోకి ఎంటర్‌ అవడంతో గుడిని శుద్ధి చేశారనే వార్త వచ్చిన వెంటనే అతడికో ఆలోచన వచ్చింది. ‘‘ఈసారి మకరజ్యోతి కనిపించదేమో సర్‌’’ అన్నాడు సడన్‌గా! ‘‘ఎందుకని?’’ అన్నాను.

 ‘‘గుడిని అపవిత్రం చేస్తుంటే సీపీఎం చూస్తూ కూర్చున్నందుకు అయ్యప్పకు కోపం వచ్చిందని ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు మకరజ్యోతిని కనిపించనీయకుండా చెయ్యొచ్చు కదా సర్‌’’ అన్నాడు!! షాక్‌ తిన్నాను. సీపీఎంకి ఐడియాలు ఇచ్చేందుకు చీఫ్‌ సెక్రెటరీగా పెట్టుకుంటే బీజేపీవాళ్లకు ఐడియాలు ఇచ్చేలా ఉన్నాడు టామ్‌ జోస్‌. మకరజ్యోతికి ఇంకో వారమే ఉంది. ఈలోపు ఏవైతే జరగకూడదో వాటన్నిటినీ గొప్ప భక్తి పారవశ్యంతో దగ్గరుండి మరీ జరిపించేలా ఉంది బీజేపీ. మోదీకి ఫోన్‌ చేశాను. ‘‘బోలియే.. విజయన్‌జీ.. ఎప్పుడో వరదల్లో కలిశారు, మళ్లీ ఇన్నాళ్లకు!’’ అన్నాడు.

 ‘‘ఇప్పుడూ వరదలే మోదీజీ. భక్తి వరద’’ అన్నాను. ‘‘నేనేం చేయగలను విజయన్‌జీ.. పేద భక్తుడిని’’ అన్నాడు!  ‘‘భక్తిని, పేదరికాన్ని దాచిపెట్టుకోవాలి మోదీజీ. ప్రదర్శనకు పెట్టకూడదు. భక్తిని ప్రదర్శిస్తే భక్తిలోని లేమి మాత్రమే బయటికి కనిపిస్తుంది. పేదరికాన్ని ప్రదర్శిస్తే ‘లేని సంపన్నత’పై భక్తిగా మాత్రమే లోకం దాన్ని చూస్తుంది. లోపల ఉంచుకోవడమే నిజమైన భక్తి. లేమిని దాచుకోవడమే నిజమైన సంపన్నత’’ అన్నాను. అన్నానే కానీ, లైన్‌ ఎప్పుడు కట్‌ అయిందో చూసుకోలేదు. 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top