వైద్యఅంగడిలో బందిపోట్లు

Doctors Heart Stent Mafia In India - Sakshi

విశ్లేషణ

బందిపోట్లు స్టెన్‌గన్‌లతో దోచుకుంటే స్టెతస్కోప్‌లతో వైద్యం చేసే డాక్టర్లు స్టెంట్‌ పోట్లతో రోగుల గుండెల్లో పొడిచారు. ఒక లాయర్‌ సాంగ్వాన్‌. ఫరీదాబాద్‌లో తన మిత్రుడికి కరొనరీ స్టెంట్‌ కావాలంటే వైద్యశాలకు వెళ్లాడు. రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి వీలుగా తీగతో అల్లిన స్టెంట్‌ అనే వస్తువును మూసుకుపోయిన గుండెనాళాల్లో అమరుస్తారు. ఆ స్టెంట్‌  గరిష్ట ధర ఎంత అనడిగితే చెప్పేవాడే లేడు. మీరు కొన్న రశీదు ఇవ్వండి అంటే అదీ ఇవ్వడు. పోనీ నాకు ఈ ధరకు స్టెంట్‌ అమ్మినట్టు రశీదు ఇవ్వండి అంటే అదీ లేదు. ఆ నల్లకోటు లాయర్‌ ఈ తెల్లకోటు వ్యాపారుల దోపిడీమూలాలు కనుక్కోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. మనదేశంలో చికిత్స పేరుతో కొందరు డాక్టర్ల తెల్లకోటు చాటున ఆరులక్షల 70 వేల కోట్ల రూపాయల నల్ల దందా జరుగుతున్నదని తేల్చాడు సాంగ్వాన్‌. ఈ దేశంలో రూ. 3,300 కోట్ల దాకా కరొనరీ స్టెంట్ల పరిశ్రమ వర్థిల్లుతున్నది. అసలా రోగికి స్టెంట్‌ అవసరమా లేదా అనేది వేరే కుంభకోణం.

స్టెంట్‌ ధర దానికదే ఒక భయంకరమైన కుంభకోణం. మనదేశంలో కార్డియోవాస్కులార్‌ సమస్యలతో, గుండెపోటు తదితర గుండె జబ్బులతో మృత్యుముఖంలోకి వెళుతున్న అయిదు కోట్ల మందికి బతకాలంటే స్టెంట్‌లు తప్పనిసరి అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ డాక్టర్‌ కార్పొరేట్‌ అనైతిక వ్యాపార సంబంధాల వల్ల నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి నిరంతర కృషి చేయడం వల్ల జనించిన కృత్రిమ స్టెంట్‌  మార్కెట్‌ విపరీత లాభాపేక్షా దుర్బుద్ధిని మరింత పెంచింది. వీరు స్టెంట్‌ను అసలు ధర కన్న 654 శాతం ఎక్కువకు అమ్ముతున్నారు. మన వైద్యవస్తువులు ఔషధాల ధరలను నిర్ధారించే జాతీయ ఫార్మాసూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ సంస్థ ఇన్నాళ్లూ ఏంచేసిందో తెలియదు కాని ఫిబ్రవరి 13, 2017 నాడు కోటింగ్‌ లేని అసలు స్టెంట్‌ ధర 7,260 రూపాయలకన్న మించరాదని చెప్పింది. లక్షలాది మంది హృద్రోగులు హృదయంలేని హృదయ సజ్జనుల (సారీ.. సర్జనుల) దోపిడీకి బలైన తరువాత, సాంగ్వాన్‌ వంటి సామాన్యులు ఆర్టీఐ ద్వారా పిల్‌ ద్వారా ఈ కుంభకోణాన్ని బయటికి తీసిన తరువాత తీరిగ్గా ఈ ధరానిర్ధారణాధికార సంస్థ ఈ రహస్యాన్ని ప్రకటించింది.

ఔషధాన్ని స్రవించే అత్యాధునిక స్టెంట్‌ను కూడా 29 వేల 600 రూపాయల కన్నా ఎక్కువ ధరకు అమ్మకండిరా తెల్ల వ్యాపారుల్లారా అని చెప్పిందా? స్టెంట్‌ కొనుక్కున్న గుండె వ్యాపారులు ఇప్పటివరకు ఎంత చెల్లించారో లెక్కవేసుకోండి. అప్పటిదాకా రూ. 7,260ల స్టెంట్‌ను ఈ దొంగలు రూ. 45 వేలకు, రూ. 29,600ల అత్యాధునిక స్టెంట్‌ను లక్షా 20 వేలకు సగటున కొన్నేళ్ల పాటు అమ్ముకున్నారు. సాంగ్వాన్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మెట్రో హాస్పిటల్‌ వారు 3.2  లక్షల రూపాయల కన్న ఎక్కువ వసూలు చేశారని పేర్కొన్నారు. సాంగ్వాన్‌ వరసగా ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ మొత్తం 54 ఆస్పత్రుల వారు రకరకాల రేట్లు వేసి గుండెలో స్టెంట్‌ పేరుతో నెత్తురు తోడుకున్నారని వివరించారు.

స్టెంట్లను కూడా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చి వాటి ధరలను ఇష్టం వచ్చినట్టు వైద్యశాలలు పెంచకుండా నిరోధించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై తగిన చర్య తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు భారత రసాయనిక, ఎరువుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కాని కొన్ని నెలలయినా ఏ చర్యా తీసుకోలేదు. అక్టోబర్‌ 2015 నాడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సవాలు చేస్తూ కోర్టుధిక్కార పిటిషన్‌ వేయకతప్పలేదు. ఏడాది తరువాత, జూలై 2016లో ప్రభుత్వానికి వేడి తగిలి స్టెంట్‌లను ఆ జాబితాలో చేర్చింది.ఒక ఆర్టీఐ సవాల్, ఒక పిల్, ఒక ఫిర్యాదు, ఒక కోర్టు ధిక్కార పిటిషన్, వెరసి సుదీర్ఘ పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం అనే మత్తగజానికి చీమ కుట్టినట్టు కాలేదు. పంపిణీదారులు, వైద్యశాలలు, డాక్టర్లు కూడా తోడుదొంగలుగా మారి రోగులను విపరీతంగా దోచుకున్నారని ఆవేదనతో  ఆవేశంతో సాంగ్వాన్‌ అనే ఒక యువలాయర్‌ డాక్టర్లతో కలిసి సాగుతున్న ఈ దోపిడీని సవాల్‌ చేశాడు. ఒక్క డాక్టరు కూడా అడగలేకపోయాడా? తెలిసి నోరుమూసుకుంటే నేరంలో భాగస్వాములే. వారే చేతులుకలిపితే చెప్పేదేముంది? కార్పొరేట్‌ మేనేజర్లు ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం స్టెంట్లు అమ్మక తప్పదనేవారిని ఏమనాలి? డాక్టర్లు అనా బ్రోకర్లు అనా? వైద్య వృత్తి పవిత్రతను దిగజార్చిందెవరు? వైద్యులు కాదా?

- మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top