బాబుగారు నంది అంటే నంది!

Chintakindi Srinivasa Rao Article On Chandrababu Naidu Attitude - Sakshi

అభిప్రాయం

‘‘మా ఇష్టం. మేం చెప్పిందే వేదం. మేం నంది అంటే నంది. కాదంటే కాదు. మేం అన్నట్టే మీరూ అని తీరాలి..’’ ఇదీ ఘనత వహించిన గత సర్కారువారు ఆంధ్రనాటకరంగం యావత్తూ ప్రతిష్టాత్మకంగా భావించే నంది నాటకోత్సవాల విషయంలో వ్యవహరించిన తీరు. చంద్రబాబు చేష్టలతో ఈ ఉత్సవాలు వాసితగ్గి, వన్నె తరిగి చివరకు పూర్తిగా చతికిలబడిపోయాయి. ఆంధ్రనాటకకళకు పూర్వవైభవం సాధించిపెట్టాలని, ఔత్సాహిక నాటకరంగాన్ని జనబాహుళ్యంలో ప్రవర్థమానం చేయాలని తలంచి నంది నాటకోత్సవాలను ఏలికలు ఎన్నో ఏళ్ల కిందటే ప్రారంభించారు. ఏడాదికోమారు ఈ నాటకోత్సవాలను నిర్వహించి ప్రతిభాప్రదర్శనలకు, వ్యక్తిగత నిపుణతకు నంది బహుమతులు అందజేయడం ఆరంభించారు. నంది పురస్కారాలు అందుకున్న నాటక సంఘాలు, నటీనటులు వాటిని కీర్తికిరీటాలుగా తలపోస్తుంటారు. 

ఒకప్పుడు నంది నాటకోత్సవాలకు దరఖాస్తు చేసుకునే నాటకసంఘాలు ముందుగా పరిశీలక బృందం ఎదుట తమ ప్రతిభా ప్రదర్శన చేస్తుండేవి. పద్యనాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక, బాలల నాటికలుగా విభజితమైన విభాగాల్లో గుణనిర్ణేతలు స్క్రూటినీ చేసేవారు. రాష్ట్రమంతా ఇలాంటి ప్రదర్శనలను తిలకించి నంది నాటకోత్సవాలకు నాటకాలను, నాటికలను ఎంపిక చేసేందుకు న్యాయనిర్ణేతలు స్వయంగా సమాజాల గడపల్లోకే వెళ్లేవారు. తమ నిర్ణయాన్ని వెల్లడించేవారు. ప్రతీ విభాగంలోనూ ఎంపికైన పదో పన్నెండో నాటకాలు, నాటికలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతంలో ప్రభుత్వం నిర్వహించే నంది నాటకోత్సవాలకు తరలివెళ్లేవి. సుమారుగా పదిరోజులపాటు నాటి కాలాన జరిగే ఈ నాటక మహోత్సవాలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారికీ కన్నుల పండుగచేసేవి. ఎక్కడెక్కడి వారూ నంది పోటీలకు హాజరయి చక్కని నాటకాలు అద్భుతంగా ప్రదర్శితమవుతుంటే హాయిగా చూస్తుండేవారు. 

ఇలా సాగుతున్న ఈ వ్యవహారంలోకి ‘తగుదునమ్మా..’ అని చొరబడిపోయిన చంద్రబాబు సర్కారు నంది నాటకాలు నవ్వులపాలయ్యేలా నిర్ణయాలు చేయడమే విషాదం. తమది విశాల హృదయమంటూ ఊదరగొట్టి నంది నిబంధనలను మూడేళ్ల కిందట పాలకులు ఇష్టానుసారం మార్చేశారు. స్క్రూటినీలకు తెరదించేశామని ప్రకటిస్తూ అడ్డదిడ్డమైన నాటక ప్రదర్శనలన్నింటికీ లాకులు ఎత్తేశారు. యువజన నాటకాలను కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పి, పిల్లల నాటికల విభాగంలో వ్యక్తిగత బహుమతులను రద్దు చేశారు. నంది నాటకాలకు స్క్రూటినీలు లేవని ప్రభుత్వమే ప్రకటించడంతో నాటకప్రదర్శనలు వరదలా పొంగు కొచ్చేశాయి. అందరూ అని చెప్పలేం గానీ, కొంతమంది మటుకు ప్రభుత్వ పారితోషికం కోసం తలాతోకాలేని నాటకాలను వేదికకు చేర్చారు. వందల్లో మందల్లో వచ్చిన ఈ నాటకాలను చూడలేక  ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. 

ఇక ‘నంది నాటకాలు ప్రదర్శించే వారికి పారితోషికం ఇస్తున్నాం కదా..’ అనే నెపం చూపించి ఉత్సవాలు జరిగే వేదికల వద్ద కనీస సదుపాయాలు కూడా అధికారగణం కల్పించడం మానేసింది. దీంతో దూరాభారాలనుంచి వచ్చే నటీనటులు ఆకలి బాధలతో, దాహం కేకలతో అల్లాడిపోవడం మొదలైంది. పోనీ అని, కప్పలతక్కెడగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గెలిచిన వారికయినా గౌరవంగా నంది పురస్కారాలు అందించారా అంటే అదీ లేదు. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులూ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువగానే చదివారు. గతేడాది నందులు పొందేందుకు విజేతలందరినీ ఏలూరు రమ్మనమని పిలిచి, వాళ్లకి నిలువ నీడ లేకుండా చేశారు. అందరినీ ఒక హాల్లో పడేసి సాయంత్రం సమావేశం వేళకి తోటకూరకాడల్లా వేళ్లాడిపోయే స్థితి కల్పించారు. అనేకానేక పథకాల పేరిట కోట్లాదిరూపాయల ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టిన బాబు సర్కారు కళాకారుల పట్ల నిర్దయగా వ్యవహరించడాన్ని అప్పట్లో నాటకరంగ ప్రముఖులే ఖండించారు. అయినప్పటికీ చంద్రుడు చలించలేదు. 

నంది నాటకాలు మళ్లీ గాడిన పడి పూర్వపు జిలుగులతో ఆంధ్రావనిలో విరాజిల్లాలంటే స్క్రూటినీలు నిర్వహించాలని పలువురు సీనియర్లు చెబుతున్న మాట. ఇప్పటి నంది నియమావళిని  ప్రక్షాళన చేసి, బాలల క్యాటగిరీలో వ్యక్తిగత బహుమతులను పునరుద్ధరించకపోతే నాటక వికాసం ఒట్టిమాటే అవుతుందని వారంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు హయాంలో బక్కచిక్కిపోయిన నందిని, నటరాజ ప్రాంగణంలో మిలమిల మెరిసే బంగారునందిగా తీర్చిదిద్దవలసిన సమయం ఆసన్నమైంది. నాటకరంగ ప్రముఖుల, దిగ్ధంతుల సూచనలతో కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ దిశలో పయనించాలనేదే నాటకరంగ కళాకారుల కోరిక. అభ్యర్థన.
వ్యాసకర్త ప్రసిద్ధ కథ, నవలా రచయిత, నాటక కర్త ‘ మొబైల్‌ : 88971 47067 


డా: చింతకింది శ్రీనివాసరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top