బాబు ప్రగల్భాలకు ఇక చెల్లుచీటీ

Chandrababu Naidu Takes Many U Turns On Special Status - Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు అతి ప్రధాన శత్రువైన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాడగల సమర్థుడిని నేనే.. నేనే.. అంటూ ఏపీ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు కొన్ని నెలలుగా  ఇంటా బయటా ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నారు. పైగా మోదీపై తాను విరుచుకుపడుతున్నట్లు వైఎస్‌ జగన్‌ విరుచుకుపడటం లేదని బాబు ఆరోపణ. కానీ ప్రజల కోసం మాటతప్పనని, తాననుకున్న ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి తీరుతానని, తన తండ్రి వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడవడమే కాకుండా, మరింత నిబద్ధతతో, మరింతగా ప్రజాశ్రేయస్సు మార్గాన పయనిస్తాను అని హుందాగా, ధైర్యంగా ప్రకటించిన యువనేత జగన్‌. ఆయన ఔచిత్యం ముందు బాబు ఉన్మత్త ప్రేలాపనలు అపహాస్యం పాలవుతున్నాయి. ‘ఇలాగే ఐటీ దాడులు, ఈడీ సోదాలు సాగిస్తుంటే మోదీని రాజకీయంగా ఫినిష్‌ చేస్తాను’ అంటున్న బాబు ప్రగల్భాలకు మే 23తో తెరపడనుంది.

ఇటీవల ఆపద్ధర్మ (నిజానికి అధర్మ) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గమనిస్తున్న వారికెవరికైనా ఆయనకు చిత్తచాంచల్యం, డిమెన్షియా (మతిమరుపు, అప్రస్తుత, హేతురహిత ప్రసంగాలు), నార్సిజం (తానే ప్రపంచంలో గొప్పవాడిననీ, తన నీడకు కూడా ఎవరూ సరిపోలరనీ భావించడం) ఇంకెవరికైనా తనకంటే ఏ విషయంలో అయినా గొప్పవాడంటే భరించలేకపోవడం (సెల్ఫ్‌ ఎస్టీమ్డ్‌ పర్వర్షన్‌) ఇలా పలు మానసిక సంబంధ రుగ్మతల్లో దేనితోనైనా లేక అన్నింటితోనైనా బాధపడుతున్నారని అనిపిస్తుంది. మరీ సన్నిహితులు బాగా గ్రహించగలుగుతారు కానీ ఇంకా ఇలాంటివారితో తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవలసి ఉందనుకునే ఆశ్రితులు మాత్రం తమ నేత పై రుగ్మతలతో ఏది మాట్లాడినా, మాయాబజార్‌లో దుశ్శాసనుడు ‘సెభాష్‌ మామా, సెభాష్‌.. అదే మన తక్షణ కర్తవ్యం’ అని శకునికి వంతపాడినట్లు తమ నేతను పొగడుతూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా కాస్త హేతుబద్ధంగా వివరించబూనుకుంటే ఆ నేత శిరచ్ఛేదన వంటి శిక్ష విధించలేడు గనుక తత్సమానమైన శిక్షతో అలా వివరించబూనిన ఆశ్రితుడిని అణగదొక్కే యత్నం చేస్తారు. గతంలో తెలంగాణ టీడీపీ దళితనేత మోత్కుపల్లి నర్సింహులు అందుకు మంచి ఉదాహరణ. ఆ సత్యం గ్రహించిన లౌక్యులు వర్ల రామయ్య వంటివారు బాబుకు వంతపాడుతూ, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు పొందుతున్నారు. అయినా యూటర్న్‌ బాబు ఎప్పుడే టర్న్‌  తీసుకుం టాడో తామూ అదే యూటర్న్‌లు తీసుకుందామని సర్వవేళలా, ఆయన కనుసన్నల్లో కదలాడుతుంటారు ఆ ఆశ్రితుల్లో చాలామంది.

ప్రధాని మోదీ నేడు ఏపీ ప్రధాన శత్రువనీ, మోదీకి వ్యతిరేకంగా పోరాడగల సమర్థుడు తానేనని ఏడెనిమిది నెలలనుంచీ బాబు చెబుతున్నారు.  ఇంతకుముందు మోదీ వంటి మహోన్నత నేత ‘నభూతో నభవిష్యతి’ అని ఈయనగారే అన్నారన్న విషయం అటుంచుదాం కానీ టీడీపీ నేతలు సైతం వారికీ తప్పదు కనుక అంతేగా, అంతేగా అంటున్నారు. ఇంతగా మోదీపై ఆగ్రహం ఎందుకువచ్చిందో తెలుసా? చంద్రబాబే స్పష్టంగా చెప్పారు. ‘ఇలాగే ఐటీ దాడులు, ఈడీ సోదాలు సాగిస్తుంటే మోదీని రాజకీయంగా ఫినిష్‌ చేస్తాను’ అన్నారాయన.  ఇలా ఫినిష్‌ చేస్తాను అనడం ఆయన ఆగ్రహ తీవ్రతను తెలియచేస్తుంది.

ఇప్పుడు మోదీని రాజకీయంగా ఫినిష్‌ చేస్తారట. మోదీ ఐటీ దాడులను, ఈడీ సోదాలను తన బినామీలపై, తన ఆశ్రితులపై ఆపితే ఫినిష్‌ చేయరన్నమాట. గతంలోలాగే మోదీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారన్నమాట. నాలాంటి అమాయక చక్రవర్తులు మాత్రం మోదీ తన మెజారిటీ మతతత్వ ధోరణితో దేశాన్ని మెజారిటీ–మైనారిటీ అనే విభజన చేసి మరోసారి భారత్‌ను విచ్ఛిన్నం చేస్తారని భయపడుతున్నారు. ఈ విషయంలో బాబు మోదీని నిలదీయరు సరికదా.. 2014 ఎన్నికల్లో ఒక్క మైనారిటీ వ్యక్తినయినా తన తెలుగుదేశం పార్టీ తరపున విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో అడుగుపెట్టకుండా చేసి మోదీ తాత్వికతను ఆచరణాత్మకంగా అనుసరించి, మోదీ భక్తిని చాటుకున్నారు. ఇక మోదీ తనవంతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వంతో మతితప్పి మాట్లాడుతున్న వారిని నిస్సంకోచంగా వెనకేసుకొస్తున్నారు. మాలెగావ్‌ మెజారిటీ మతోన్మాద దాడుల్లో నిందితులను పట్టుకోవడంలో తీవ్రంగా శ్రమించడమే కాకుండా, ముంబై ఉగ్రవాద దాడుల్లో ఉగ్రవాదుల కాల్పులకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన ముంబై ఉగ్రవాద వ్యతిరేక దళ (ఏటీఎస్‌) చీఫ్‌ హేమంత్‌ కర్కరే తన శాపం వల్లే మరణించాడని బాహటంగా ప్రకటించిన సాధ్వి ప్రజ్ఞను, నోరుతెరిస్తే పరమత ద్వేషంతో ప్రసంగించే యూపీ సన్యాసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వంటివారిని మోదీ వెనకేసుకొస్తున్నారు. లౌకికరాజ్యంలో ఇలాంటి మతోన్మాద కువిమర్శకులపై చర్య తీసుకునే బదులు వారిని మోదీ సమర్థించడం కుదరదు. మోదీని రాజకీయంగా ఫినిష్‌ చేస్తాను అని చంద్రబాబు బెదిరించడం తప్ప మోదీని ఈ కోణంలో పల్లెత్తుమాట అనరు. మోదీ పాలనలో మన లౌకికరాజ్యాన్ని పొరుగున ఉన్న పాకిస్తాన్‌ లాగా మతతత్వ రాజ్యంగా మార్చే తీవ్ర ప్రయత్నం చేసినా బాబు ఉలకరు. ఐటీ దాడులు, ఈడీ సోదాలు తనపై, తనవారిపై జరగకుండా ఉంటే చాలు. తన సంపూర్తి, సహాయ సహకారాలను బాబు.. మోదీకే అందించగలరన్నమాట.

మోదీ ఈ ఎన్నికలలో గెలవడమే ప్రధానమైనట్లు అందుకు వాడుకునేందుకు కాదేదీ అనర్హం అంటున్నట్లు వ్యవహరిస్తారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అమర జవానుల శవాలను కూడా తన రాజకీయ ప్రయోజనం కోసం మోదీ వాడుకుంటూ ఆ అమర జవానులకు అంకితం చేస్తూ వారికోసం మీ ఓటు వేయండి అంటూ అమరవీరుల పేరుమీద బీజేపీకి ఓటు అడిగేంతగా దిగజారిన మోదీని మన చంద్రబాబు ఏమాత్రం నిలదీయరు. మన సైన్యం మన లౌకిక రాజ్యానికి నిబద్ధతతో ఉంటుంది కానీ అల్పత్వంతో ఎన్నికల్లో ఒక పార్టీకి కొమ్ముకాసే కిరాయి దళాలు కావంటూ చంద్రబాబు మోదీని విమర్శించలేరు. ఈయన నైజమే అది. ప్రధాని సైన్యాన్ని కూడా రాజకీయం చేస్తారా, ఇంతటి దివాళాకోరుతనమా అని చంద్రబాబు.. మోదీ కాలర్‌ పట్టుకోరు. రేపు ఖర్మం చాలక తిరిగి మోదీ ప్రధానమంత్రి అయితే, ఇంకేమన్నా ఉందా? తన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, సెక్స్‌ రాకెట్‌ కుంభకోణాలు ఇలాంటి వందలాది ఘటనలపై సత్వర విచారణ జరిపించి న్యాయస్థానాల ద్వారా తనకు జైలు శిక్ష విధిస్తే... తన తదనంతరం తన పుత్రుడికి కూడా ఇదే గతి పట్టిస్తే.. పైగా మోదీ వ్యవస్థలను వాడుకోవడంతో ఎవరికీ తీసిపోరు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే తనపై 17 కేసులను విచారణకు రాకుండా స్టేలు తెచ్చుకోగలిగినప్పుడు, తనకంటే  కుటిల విద్యలో రెండాకులు ఎక్కువే చదివిన మోదీ ప్రధాని హోదాతో కోర్టు ద్వారానే అంతటి శిక్ష వేయిస్తాడేమో.. ఈ కోణంలో ఓట్ల కోసం మోదీ అవలంబిస్తున్న పతనమార్గాన్ని ఎత్తిచూపి, ‘ఇలా చేస్తే నిన్ను రాజకీయంగా ఫినిష్‌ చేస్తాను’ అని చంద్రబాబు అనగలరా? అందుకే ఐటీ దాడులు, ఈడీ సోదాలు తన బినామీలపై, తన ఆశ్రితులపై సాగిస్తుంటే మాత్రం మోదీని రాజకీయంగా ఫినిష్‌ చేస్తానని బాబు ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విభజన సమయంలో కేంద్రం, మోదీ చేసిన అన్యాయాల్లో మొదటిది.. వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం. అప్పుడే ప్రత్యేక హోదా వచ్చి ఉన్నట్లయితే, పరిశ్రమల స్థాపన కారణంగా బాబు, ఆయన అంతేవాసుల రియల్‌ ఎస్టేట్‌ దందాకు ఇంత అవకాశం ఉండేది కాదు. ఇన్నేళ్లుగా ప్రత్యేక హోదాపై మౌనంగా ఉండటమే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ అంటే అదే మహాప్రసాదమని ప్రకటించారు బాబు. పైగా నాలుగున్నరేళ్లుగా బాహుబలి పత్రికా ప్రకటనల బొమ్మల రాజధానిని  చూపించి, ఒక్క శాశ్వత రాజధాని భవనాన్ని కూడా ప్రారంభించని చంద్రబాబు ఇప్పటికైనా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నిన్ను రాజకీయంగా ఫినిష్‌ చేస్తానని ప్రకటించగలిగారా? పైగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం.. ఐటీ దాడులు, ఈడీ సోదాలు తనపై, తనవారిపై జరపకుండా ఉంటే మోదీ ముందు మళ్లీ సాగిలపడేందుకు బాబు సిద్ధమే.

పైగా మోదీపై తాను విరుచుకుపడుతున్నట్లు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విరుచుకుపడటం లేదని బాబు ఆరోపణ. నలభై ఏళ్ల అనుభవం (ఎందుకు? ప్రజలను వంచించడానికా?) ఉన్నదని ఆయనకు బ్యాండ్‌ బాజా వాయించేందుకు సిద్ధంగా ఉన్న సొంత మీడియా ఎంతగా పొగిడినా, అది చంద్రబాబు అసమర్థతకు చిహ్నం కాదా? మరోవైపున చిన్నవాడైన వైఎస్‌ జగన్‌ తెలుగుదేశం అధినేతలాగా వట్టిమాటలతో కాలక్షేపం చేయకుండా, నిర్దిష్టంగా ప్రత్యేక హోదా కోసం పోరాడినవాడు. ఆయన పార్టీయే కాదు.. స్వయంగా జగనే ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష, ఉద్యమాలు చేశారు.

హోదా ప్రాధాన్యం గుర్తించినందుకే కోతికొమ్మచ్చి గంతులెయ్యకుండా రేపు కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాని ఏపీకి ఇచ్చే బిల్లుపై సంతకం చేస్తే ఆ ప్రభుత్వానికే వైఎస్సార్‌ సీపీ మద్దతు ఉంటుందని జగన్‌ చెప్పారు. పైగా మా రాష్ట్ర ప్రయోజనం మా నిర్ణయాలకు గీటురాయి. మన రాష్ట్ర పురోగమనం కోసం సహకరించే అందరితో ప్రత్యేకంగా మన పొరుగు రాష్ట్రాలతో అందునా మన తెలుగుజాతి ఉన్న మరో రాష్ట్రమైన తెలంగాణతో సఖ్యతతో ఉంటాం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం వారి మద్దతు కోరతాం.. అని నిస్సందేహంగా, నిజాయితీగా బహిరంగంగా జగన్‌ ప్రకటించారు. ప్రజల కోసం మాటతప్పనని, మడమ తిప్పనని, తాననుకున్న ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి తీరుతానని, తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడవడమే కాకుండా, అంతకు తీసిపోకుండా మరింత నిబద్ధతతో, మరింతగా ప్రజాశ్రేయస్సు మార్గాన పయనిస్తాను అని హుందాగా, ధైర్యంగా ప్రకటించిన యువనేత జగన్‌. ఆ యువనేత ఔచిత్యం ముందు చంద్రబాబు ఉన్మత్త ప్రేలాపనలు అపహాస్యం పాలవుతున్నాయి. ‘‘కానీ చిరకాలమున్ననే కార్యమగును’’ అన్నది మన చంద్రబాబుకు వర్తిస్తుంది. అయితే మన తెలుగు ప్రజల చొరవ, చైతన్యం, అదృష్టం ఫలితంగా బాబు గారి పదవీభ్రష్టత్వం మే 23న తిరుగులేని సత్యం అని తేలబోతోంది. మోదీతో చంద్రబాబు లాలూచీ కుస్తీ అందరం చూసిందే కదా! ఇక ఇలాంటి ఆటలు సాగవు.. సత్యమేవ జయతే!

వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
డాక్టర్‌ ఏపీ విఠల్‌
‘ మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top