చర్చల కోసం ఒత్తిడే చైనా లక్ష్యం

Ashutosh Guest Column On China Attacks Galwan Valley - Sakshi

విశ్లేషణ

సరిహద్దుల్లో భారత బలగాలపై చైనా ఆకస్మిక దాడి 1962 తర్వాత భారత్‌ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా బలగాలు భారత్‌ను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల కూటమిలో భారత్‌ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్‌ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో భారత్‌ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడింది. ఫలితంగానే భారత్‌కు ముగుదాడు వేయడం లక్ష్యంగా చైనా సైనిక దాడిని తలపెట్టింది. ఒక అగ్రరాజ్యం స్థాయికి చేరుకున్న చైనా భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంతో మన భూభాగంలోకి  ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్‌ పేర్కొన్నట్లుగానే భారత్‌ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఇది భారత్‌ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు.

 హెన్రీ కిసింజర్‌ కంటే ఉత్తమంగా చైనాను మరే దౌత్యవేత్త కూడా అర్థం చేసుకోలేరు. 1962లో భారత్‌–చైనా యుద్ధ నేపథ్యంలో కిసింజర్‌ ఒక ఆసక్తికరమైన ఘటనను వర్ణించారు. 1962 అక్టోబర్‌లో నాటి చైనా అధినేత మావో జెడాంగ్‌ బీజింగ్‌లో చైనా అత్యున్నత సైనిక కమాండర్లు, రాజకీయ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చిన ఘటనను కిసింజర్‌ గుర్తు చేశారు. అది భారతదేశంతో చైనా సైనిక సంఘర్షణలో మునిగి ఉన్న సమయం. ఆనాటి ప్రతిష్టంభనను తేల్చిపడేయాలని మావో నిర్ణయించుకున్నారు. చైనా, భారత్‌లు శాశ్వత శత్రుత్వంతో అంతరించిపోవని మావో ఆ సమావేశానికి హాజరైన వారితో చెప్పారు. ఇరుదేశాలు మళ్లీ సుదీర్ఘ శాంతి కాలాన్ని గడుపుతాయని, కానీ అలా జరగాలంటే చైనా బలప్రయోగంతో భారత్‌ను దెబ్బతీసి తిరిగి చర్చల బల్లవద్దకు తీసుకురావాల్సి ఉంటుందని మావో చెప్పారు. ఆ తర్వాతే చైనా అనూహ్యంగా, భారత్‌ భూభాగంపై విధ్వంసకర దాడికి దిగి మళ్లీ మునుపటి ఆధీన రేఖకు తరలిపోయింది. ఈ క్రమంలో భారత్‌ నుంచి  కైవసం చేసుకున్న భారీ ఆయుధాలను కూడా చైనా వెనక్కు ఇచ్చేసింది.

నేడు, చైనా 1962 తర్వాత భారత్‌ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. గాల్వాన్‌ లోయలో చైనా బలగాలతో తాజాగా జరిగిన దొమ్మీలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. గాయపడిన సైనికుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. తూర్పు లద్దాఖ్‌లో 60 చదరపు మైళ్ల విస్తీర్ణంలో భారత భూభూగాన్ని చైనా ఆక్రమించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. ఈ సంక్షోభం ఏప్రిల్‌ నెలలోనే ఉన్నట్లుండి మొదలైంది కానీ భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. చైనా దూకుడు చర్యకు ఒక్క నిర్దిష్ట కారణాన్ని కూడా భారత ప్రభుత్వం కానీ, నిపుణులు కానీ ఎత్తి చూపలేకపోయారు. 

చైనా కూడా తన దూకుడు చర్యకు కారణాన్ని ఇప్పటివరౖకైతే          వెల్లడించలేదు. కానీ చైనా బలగాలు ప్రదర్శించిన పరమ నిర్లక్ష్య వైఖరి గాభరా కలిగిస్తుంది. ఈ సమస్యకు ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా సైనిక బలగాలు భారత్‌ను చావు దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. ఇరుసైన్యాల కమాండర్ల మధ్య చర్చలు జరిగిన తర్వాత చైనా, భారత బలగాలు కొన్ని కిలోమీటర్ల వెనక్కు తరలిపోయినట్లు సమాచారం. అయితే ఆధీన రేఖను దాటివచ్చింది చైనా బలగాలు అయితే భారత సైనిక బలగాలు ఎందుకు తిరోగమించాయి అన్నది నా అవగాహనకు అందనిది. భారతీయ భూభాగంలోకి ప్రవేశించింది చైనా బలగాలే. దీనివెనుక స్పష్టమైన ఉద్దేశం వెల్లడి కానందున, భారతీయ సైనికులను ఇలా చావుదెబ్బ తీయడం అనేది భారత్‌పై ఒత్తిడి ప్రయోగించి దాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే జరిగిందని చెప్పవచ్చా? మరి సమస్య ఇదే అయితే చర్చలు దేనిపై జరుపుతారు, ఎందుకు జరపుతారు అనేది మరో ప్రశ్న.

గత రెండు వారాలుగా భారత్‌పై తన ఆగ్రహానికి పలు కారణాలను పేర్కొంటూ చైనా ప్రభుత్వ అధికార వాణి అయిన ది గ్లోబల్‌ టైమ్స్‌ సూచనప్రాయంగా తెలుపుతూ వచ్చింది. దీనికి రెండు బలమైన కారణాలు బయటకు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది అమెరికాతో భారత్‌ సన్నిహితంగా మెలగడం క్రమంగా పెరుగుతోంది. ఇండియా–పసిఫిక్‌ రీజియన్‌లో చైనా వ్యతిరేక కూటమిని సృష్టించడానికి భారతదేశం, అమెరికా ప్రయోజనాల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటోందని చైనా బలంగా నమ్ముతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల కూటమిలో భారత్‌ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్‌ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో అమెరికా తరపున భారత్‌ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడిపోయింది. తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో హౌడీ మోదీ కార్యక్రమంలో డొనాల్డ్‌ ట్రంప్‌కు గౌరవ ఆహ్వానం పలకడం, అహమ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో ట్రంప్‌కు భారీ ఎత్తున స్వాగతం పలకడం అనేవి చైనాను మండించాయి. భారత్‌తో అమెరికా మైత్రీ భాషణను చైనా చూస్తూ ఊరుకోలేదని 2020 ఫిబ్రవరి 23వ తేదీనే గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక రాసింది కూడా. ట్రంప్‌ భారత్‌ పర్యటనలో ఉన్నప్పుడు ఆ పత్రిక అలా రాసిందని మర్చిపోకూడదు.

కాగా, 2020 జూన్‌ 5న గ్లోబల్‌ టైమ్స్‌ మరొక వ్యాసం ప్రచురించింది. మోదీ రెండో దఫా పాలనను ప్రారంభించినందున, చైనా పట్ల భారత్‌ వైఖరి మారిపోయింది. చైనాను లక్ష్యంగా చేసుకుంటున్న అమెరికా పధకాలు చాలావాటిలో భారత్‌ క్రియాశీలకంగా పాల్గొం టోందని చెప్పడం న్యాయంగా ఉంటుందన్నది ఆ వ్యాససారాంశం. ఆ తర్వాత  స్పష్టంగానే చైనా తన వైఖరి గురించి సూచనలు పంపడం మొదలెట్టింది. చైనా హెచ్చరికలను భారత నాయకత్వం పట్టించుకోవలసి ఉండింది. నిస్సందేహంగానే ఒక దేశం ఆదేశాలకు అనుగుణంగా భారత్‌ వంటి సౌర్వభౌమాధికారం కలిగిన దేశం తన విదేశీ విధానాన్ని నిర్వహించుకోవడం వంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కానీ తన పొరుగునే ఉన్న చైనా వంటి శక్తివంతమైన దేశం అభిప్రాయాలను భారత్‌  విస్మరించలేదన్నది కూడా వాస్తవమే. 

రెండు, జమ్మూ కశ్మీర్‌ భౌగోళిక ముఖచిత్రాన్ని మార్చివేయడానికి మోదీ ప్రభుత్వం తలపెట్టిన ప్రయత్నం చైనా నాయకత్వానికి ఇష్టం లేదు. ఆర్టికల్‌ 370 రద్దుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ, లద్దాక్‌లోని అక్సాయి చిన్‌ని కూడా భారత్‌ తన భూభాగంగా చూస్తోందని చెప్పడం చైనాను రెచ్చగొట్టింది. ఈ విషయమై చైనా సీనియర్‌ అధికారి వాంగ్‌ షిదా ఇటీవలే ఒక వ్యాసం రాశారుకూడా. ఆర్టికల్‌ 370 రద్దు అనేది పాకిస్తాన్, చైనాల సార్వభౌమాధికారానికి తీవ్ర సవాలుగా నిలిచిందని వాంగ్‌ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాకిస్తాన్‌కు చైనా బలంగా మద్దతునివ్వడం ప్రారంభించింది. చైనా ఒత్తిడి కారణంగానే గత 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశం లాంఛనప్రాయంగా చర్చకు వచ్చింది. 

కాబట్టి, భారత భూభాగంలోని గాల్వన్‌ లోయ వంటి ప్రాంతాల్లోకి చైనా దళాలు ప్రవేశించడం అనేది సాధారణమైన ఘటన కాదని, ఆ దేశానికి ఇంకా పెద్ద కారణాలు ఉన్నాయనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే. దీనికి అనుగుణంగానే భారతదేశం తన దౌత్యాన్ని నిర్వహించుకోవలసి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీకి తప్పు సలహాలు ఇచ్చినట్లు కనబడుతోంది. చైనా అగ్రనాయకత్వాన్ని సంతృప్తిపరచడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదు. ఇప్పుడు ఆధీనరేఖలో భారతీయ సైనికుల హత్యా ఘటనతో ప్రధాని తన పదవీ బాధ్యతలను నిర్వహించడం కష్టమవుతుంది. పైగా మితిమీరిన జాతీయవాదాన్ని, యుద్ధోన్మాదాన్ని జపిస్తున్న తన పార్టీలోని సైద్ధాంతిక శ్రేణులు కాని, బయటి శక్తులు కానీ ఇప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను మాత్రమే ఇప్పుడు సరైన పరిష్కారమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ ఒత్తిడికి లోబడకపోతే మోదీ నాయకత్వంపై వీరు దాడి చేయవచ్చు కూడా.

అయితే ఇక్కడ వివాదాస్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారత్‌ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందా?  రెండు కారణాలతో ఈ ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం అని చెప్పాల్సి ఉంటుంది. మొదటిది, చైనా తన సైనిక చర్యల సమయాన్ని అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంది. భారత్‌ కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌ డౌన్‌లో ఉన్నప్పుడు, కుప్పకూలిపోయిన ఆర్థిక వ్యవస్థతో తలమునకలై ఉన్నప్పుడు భారతీయ భూభాగంలోకి చైనా అడుగుపెట్టింది. రెండు, చైనా ప్రతి సంవత్సరం 261 బిలియన్‌ డాలర్లు రక్షణరంగంపై వెచ్చిస్తుండగా, భారత్‌ 71 బిలియన్‌ డాలర్లను మాత్రమే రక్షణ రంగంపై వెచ్చిస్తోంది. 2000 సంవత్సరం నుంచి చైనా పకడ్బందీ పథకం అమలు చేస్తూ 2049 నాటికల్లా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయాలని కంకణం కట్టుకుంది. 

ఇక బీజేపీ నాయకులు, మద్దతుదారుల విషయానికి వస్తే మోదీ నాయకత్వంలోని భారత్‌ 1962 నాటి నెహ్రూ పాలన నాటి భారత్‌లా లేదని గర్వంగా ప్రకటిస్తున్నారు. జాతీయ టీవీ చానెల్స్‌ కూడా ఇలాంటి వాణినే డాంబికంగా ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు ఆకర్షణీయంగానే ధ్వనించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే నేడు చైనా ఒక అగ్రరాజ్యం. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రభావితంగా ఉంటున్న అమెరికాను ఆ స్థానం నుంచి తొలగించాలనే స్పష్టమైన ఆకాంక్షతో చైనా ముందుకెళుతోంది. పైగా భారత్‌ ఒక బాధ్యతాయుతమైన దేశం. సరిహద్దు ఘర్షణలను తగ్గించడానికి దౌత్యపరమైన, తెరవెనుక చర్చలపైనే భారత్‌ ఆధారపడాలి. భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంలో చైనా మన భూభాగంలోకి ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్‌ పేర్కొన్నట్లుగానే భారత్‌ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఇది భారత్‌ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు.

అశుతోష్‌
వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top