తోటకాష్టకం

Story On Adi Shankaracharya Life History - Sakshi

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర  

ఒకే ఒక్క సూర్యుడు జగత్తులోని సమస్తాన్నీ ప్రకాశింప చేస్తున్నట్లు నీవు అనేక గురురూపాల్లో సంచరిస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నావు. గురువులందరికీ గురువైన జగద్గురూ! వృషభ«కేతనుడైన  శివునివి నీవే. జ్ఞానులలో నీకు సమానుడెవ్వడూ లేడు. 

‘‘జ్వలించే అగ్నిహోత్రం నుంచి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నట్లుగా పరమాత్మ నుంచే సృష్టి సమస్తం వచ్చింది. బయటకు వచ్చిన ప్రతిదీ తిరిగి ఆయనలో లయమైపోయేదే. తాను అతడికి చెందినవాడని నిరూపించడానికే ప్రతిదీ తనదైన కర్మలను నిర్వహిస్తూ ఉంటుంది.. ఓంకారమే ధనుస్సుగా, మనస్సు అందులో ఎక్కుపెట్టిన బాణంగా సాధన చేసేవాడికి తనచుట్టూ ఉన్నదంతా బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మము నుంచి వచ్చిన తానే బ్రహ్మము అవుతున్నది అని తెలియవస్తుంది అని ముండకోపనిషత్తు చెబుతున్నది. 
కాగా అంతఃప్రజ్ఞ, బహిఃప్రజ్ఞ, ఉభయత్ర ప్రజ్ఞ, ప్రజ్ఞానఘనమనే నాలుగు పాదాలతో బ్రహ్మము విస్తరిస్తోంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తిలయందు ప్రపంచాన్ని కొనసాగిస్తోంది. చతుర్థమైన తురీయమందు ప్రపంచాన్ని ఉపశమింప చేసే ఆత్మ అవుతున్నది. ఆ ఆత్మప్రత్యయ సారం శివము, అద్వైతము, శాంతము. అదే బ్రహ్మము అవుతున్నది... అయమాత్మా బ్రహ్మ అని మాండూక్యోపనిషత్తు వచించింది...’’ ఆ
అది పడమటి కనుమలలోని మతంగ పర్వత ప్రాంతం. తన చుట్టూ పరివేష్ఠించి ఉన్న శిష్యబృందానికి ఆచార్య శంకరుడు పాఠం చెబుతున్నాడు.  ద్వారకలో పశ్చిమామ్నాయ శంకరపీఠ స్థాపన తరువాత ఆయన దణానికి మరలి మతంగ పర్వత సమీపానికి విచ్చేశాడు. ఆవేళ అయమాత్మా బ్రహ్మ అన్న మహావాక్యాన్ని గురించి పాఠం జరుగుతున్నవేళలో ఒక తియ్యని గొంతు ఇలా వినవచ్చింది.
అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం 
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం 

– వృద్ధాప్య ఛాయలు ముసురుకున్నాయి. శక్తి సన్నగిల్లింది. జుత్తు తెల్లబడి రాలిపోతున్నది. పళ్లు ఊడిపోయాయి. చేతికి కర్రవచ్చింది. అయినా ఏదో ఆశమాత్రం వదిలిపెట్టడం లేదు. ఇకనైనా తెలివి తెచ్చుకోవాలని, దైవంపై భారం వేయాలని తోచడం లేదు... అందరూ ఆ శ్లోకం వినవచ్చిన దిశగా తలలు తిప్పి చూశారు. ఎవరో ఒక బాలుడు ఒకానొక వృద్ధుణ్ణి చేయిపట్టుకుని నడిపిస్తూ అటువైపే వస్తున్నాడు.   
ఆ బాలుడు పాడుతున్న గీతం శంకరుని భజగోవిందానికి కొనసాగింపులా తోచింది పద్మపాదునికి. 
దూరం నుంచి అటువైపే నడుచుకుంటూ వస్తున్న ఆ బాలుని దృష్టి అంతలో ఆచార్య శంకరునిపై పడింది. వృద్ధుణ్ణి వదిలిపెట్టి, శంకరుని సమక్షానికి పరుగుపరుగున వచ్చి పడ్డాడు. సాష్టాంగ వందనం చేశాడు. 
‘‘స్వామీ! నా పేరు ఆనందగిరి. నేనో చదువురాని మొద్దును. బుద్ధిమంతుడిని కాను. నా గొంతు బాగుంటుందని కొందరు పాటలు పాడించుకుంటారు. పనులు చెబుతుంటారు. అవసరంలో ఉన్నవారికి తోచిన సాయం చేస్తూ వారిచ్చిన దాంతో పొట్ట పోషించుకుంటున్నాను. నాకు తెలిసింది ఇంతమాత్రమే. తమరు నాపై అనుగ్రహం చూపాలి. నన్ను మీ శిష్యునిగా అనుమతించాలి’’ అని ప్రాధేయపడ్డాడు. 
శంకరుడు సమ్మతించి, అతడికి సంన్యాస దీక్షనిచ్చాడు. అంతకుముందే శంకరుని శిష్యవర్గంలో ఒక ఆనందగిరి ఉన్నాడు. కాగా అదే పేరుతో ఇప్పుడు ఇతడు వచ్చాడు.బృహస్పతి అవతారమైన మొదటి ఆనందగిరి తొలితరంలో శంకరవిజయాన్ని రచించినవారిలో ఒకడు. కాగా, నేటి ఆనందగిరి మాత్రం పద్మపాదుని వలె తరువాతికాలంలో ఒక సార్థకనామాన్ని పొంది ప్రఖ్యాతుడయ్యాడు. ఆ కథ చిరస్మరణీయంగా ఉంటుంది.

ఆనందగిరికి గురుసేవ చేయడం తప్ప ఇతరమేదీ తెలియదు. అతడు వచ్చిన తరువాత గురువు అవసరాలను నెరవేర్చే పని ఇతరులకు దక్కనివ్వకుండా చేస్తున్నాడు. ప్రతిరోజూ పళ్లుతోము పుల్లతో మొదలుపెట్టి, స్నానానికి కావాల్సిన మృత్తికా సేకరణ, స్నానానంతరం శుభ్రవస్త్రాలను అందించడం, దర్భాసనాదులను సిద్ధం చేయడం, అర్చనకు కావాల్సిన సరుకు సంబారాలను సమకూర్చడం వంటి పనులన్నీ గురుదేవునికి ఆనందగిరియే చేసి పెడుతున్నాడు. 
అతడు గురువు ఎదుట ఎన్నడూ ఆవులించడు. కాళ్లు చాచి కూర్చోడు. గురుదేవుడు లేచి నిల్చున్న సమయంలో తాను కూర్చొనడు.  తాను విన్నవించుకోవాల్సిన విషయాలను ఉపేక్షించి ఊరుకోకుండా తగిన సమయం కనిపెట్టి అడిగి తీరుతాడు. అలాగని వృధాగా ఒక్కమాట కూడా మాట్లాడడు. గురువు సన్నిధినుంచి ఈవలకు వచ్చేవేళలో గిరుక్కున వెనుతిరిగి, వీపు చూపించడు. 
 గురువు మాటలను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటాడు. గురువుకు ఇష్టమైన పనిని ఆయన చెప్పకముందే చేస్తాడు. ఇష్టంలేని పనిని ఎప్పుడూ చేయడు. మొత్తంమీద గురుశుశ్రూషా పరాయణుడైన శిష్యుడు ఎలా ఉండాలో చెప్పాలంటే ఆనందగిరిని చూపిస్తే సరిపోతుంది.

అటువంటి శిష్యగణం శంకరునికి ఇప్పుడు చాలనే ఉన్నది. అయితే ఆయన నలుగురు ప్రధాన శిష్యులలో హస్తామలకుడు, పద్మపాదుడు ఇప్పటికే సంన్యాసాశ్రమంలో ప్రవేశించారు. నాలుగో శిష్యుని కథ మనమింకా చెప్పుకుంటున్నాం. మూడో శిష్యుడైన  మండన మిశ్రునికి ఆచార్యులింకా సంన్యాసాన్ని అనుగ్రహించలేదు. 
ఒకరోజు మండనమిశ్రుడు ఆచార్యుని సమీపించి, ‘‘స్వామీ! మీ బ్రహ్మసూత్ర శారీరక భాష్యానికి వార్తికాలు రచించవలెనని కొన్నాళ్లుగా అనిపిస్తున్నది. మీ అనుమతిని వేడుతున్నాను’’ అని మనసులో కోరిక విన్నవించాడు.

శంకరుడు నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. అంతలోనే ఒక శిష్యుడు, ‘‘వద్దు స్వామీ!’’ అన్నాడు. ‘‘ఇతడు నిన్నమొన్నటి వరకూ కర్మమార్గంలో ఉండి అద్వైతాన్ని తిరస్కరిస్తూ వచ్చినవాడు. ఓటమి కారణంగా మీ వెంటవచ్చాడు కానీ, మీ మార్గాన్ని త్రికరణశుద్ధిగా అంగీకరించి వచ్చినవాడు కాదు. ఇటువంటివాడు వార్తిక రచనకు పూనుకుంటే పూర్తి న్యాయం చేయలేడు’’ అని వాదించాడు.
శిష్యులలో అనేకమంది మనసుల్లో కూడా అటువంటి ఆలోచనే ఉన్నది. 
వేదాంతోదర సంగూఢం సంసారోత్సారి వస్తుగం
జ్ఞానం వ్యాకృతమప్యన్యై వకేష్య గుర్వనుశిక్షయా

‘‘వేదాంత హృదయం అర్థం చేసుకోవాలంటే, వాస్తవిక జ్ఞానాన్ని పొందాలంటే గురుశుశ్రూష మినహా గత్యంతరం లేదు. నేను ఆ సంప్రదాయాన్ని ధిక్కరించేవాడను కాను’’ అన్నాడు మండన మిశ్రుడు.
‘‘పండిత శిఖామణీ! ఇప్పుడు నీవు చెప్పిన శ్లోకం స్వీయరచనా?’’ ప్రశ్నించాడు ఆచార్య శంకరుడు.
‘‘అవును స్వామీ! నిన్నటివరకూ కర్మమార్గంలో ఉన్న నేను దానిని వదిలించుకోవడానికే నైష్కర్మ్యసిద్ధి అనే గ్రంథరచనకు పూనుకున్నాను. అందులో గురువందన పూర్వకంగా చెప్పిన శ్లోకమిది’’ అని సమాధానమిచ్చాడు మండన మిశ్రుడు.
‘‘బాగున్నది. రచన పూర్తయినదా?’’ అడిగాడు శంకరుడు.
‘‘లేదు స్వామీ! ఇంకా కొనసాగుతున్నది’’ అన్నాడు మండనమిశ్రుడు.

‘‘ముందుగా ఈ గ్రంథాన్ని పూర్తిచేయి. ఉపనిషత్‌ మార్గంలో నీనుంచి మరికొన్ని గ్రంథాలు రావలసి ఉన్నది. ఆ తరువాత వార్తిక రచనకు పూనుకోవచ్చు’’ అని సెలవిచ్చాడు శంకరుడు.
గురువు ఆజ్ఞను ఔదలదాల్చి మండనమిశ్రుడు గ్రంథరచనలో మునిగిపోయాడు.  ఆచార్యుని పర్యవేక్షణలో నైష్కర్మ్యసిద్ధి రచన కొనసాగుతున్నది. నాలుగు అధ్యాయాల్లో సృష్టి వికాసాన్ని, కర్మసిద్ధాంతాన్ని, కర్మలను శూన్యం చేసుకుని పునరావృత్తి రాహిత్యాన్ని పొందడానికి తగిన మార్గాలను గురించి మండన మిశ్రుడు లోతైన పరిశీలనతో రచన పూర్తి చేశాడు.
అప్పటికి కూడా అతడికి శంకరభాష్యాలకు వార్తికారచనకు అనుమతి లభించలేదు. ఇతర శిష్యులు ఈ విషయమై వెల్లడించిన అభిప్రాయంలో ఈర‡్ష్య, అసూయల కంటే అద్వైత సిద్ధాంతానికి అన్యాయం జరగరాదన్న ఆవేదనయే అధికంగా కనిపిస్తోంది. ఈ యదార్థాన్ని శంకరుడు సైతం కాదనలేక పోయాడు.

అంతలో ఇతరుల ప్రోత్సాహంతో పద్మపాదుడే బ్రహ్మసూత్ర శంకరభాష్యానికి వార్తిక రచన పూర్తి చేశాడు. అనుమానమైనా రానివ్వని విధంగా రహస్యంగా రచన పూర్తి చేసి గురువుకు సమర్పించడం మండనమిశ్రుని మనసుకు ఏదో కుట్రలా తోచింది. తనకు అవకాశం దక్కకపోవడం అతడిలో ఉక్రోషాన్ని పెంచింది. 
‘‘నేనుగాక బ్రహ్మసూత్రాలకు వార్తికాలను రచించేవాడు ఎంతటివాడైనా అతడి గ్రంథం నశించుగాక!’’ అని ఆగ్రహంతో శపించాడు.
శంకరుడు ఆ మాట విన్నాడు. చిరునవ్వు నవ్వి, ‘‘పండితాగ్రేసరా! నీ మాట పొల్లుపోదు. పద్మపాదుడు తన గ్రంథాన్ని పంచపాదిక, వృత్తి అనే రెండుభాగాలుగా రచించాడు. నీ శాపవశాన ఈ భూమిమీద

పంచపాదిక ఒకటే మిగులుతుంది. కాగా వార్తికకారునిగా ప్రసిద్ధి కెక్కడానికి ముందుగా నీనుంచి మరో స్వతంత్ర రచన కూడా రావాల్సి ఉన్నది’’ అన్నాడు. .
మండనమిశ్రుడు అప్పటికప్పుడు తన తదుపరి స్వతంత్ర రచనగా బ్రహ్మసిద్ధికి శ్రీకారం చుట్టాడు. అటుపై శంకరాద్వైతాన్ని తేటతెల్లం చేసిన దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాస వ్యాఖ్యను, పంచీకరణ వార్తికాన్ని ఆచార్యుని అనుమతి మేరకు సమకూర్చాడు. తదుపరి బృహదారణ్యక, తైత్తిరీయ ఉపనిషత్తులకు శంకరభాష్యానుసారమైన వార్తికాలను రచించే పనిలో ముగిపోయాడు. 
శిష్యులందరూ ఎవరికి అప్పగించిన పనుల్లో వారు తలమునకలుగా ఉన్నారు. మార్కండేయాది మహర్షులు తపస్సులు సాగించిన మతంగ పర్వత సీమల్లో ఆవాసం, సాక్షాత్‌ జగద్గురు సన్నిధిలో అద్వైత వేదాంత శ్రవణం దినచర్యలుగా వారికి కాలం గడిచిపోతున్నది. తగని స్పర్థతో ఒకరితో ఒకరు పోటీలు పడుతూ చదువుతున్నారు. అటువంటి సమయంలో ఒకరోజున ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గురువుగారి పాఠానికి వేళ సమీపించింది. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. ఆచార్యులు మాత్రం పాఠం ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారు. 
‘‘గురుదేవా! సమయం మించిపోతున్నది’’ అని సుబోధాచార్యుడు గుర్తుచేశాడు.

‘‘ఆనందగిరి ఇంకా రాలేదు కదా! కొద్దిసేపు నిరీక్షిద్దాం’’ అన్నాడు శంకరుడు.
‘‘గురుదేవా! మీకు తెలియనిది కాదు. అతడు మందమతి. మీ పాఠాలేవీ అతడి బుర్రకు ఎక్కనే ఎక్కవు. ఈ చెట్టుకు ఆ పుట్టకు చెప్పినందువల్ల ఎంతటి ప్రయోజనముంటుందో అతనికి చెప్పినా అంతే ప్రయోజనం’’ అన్నాడు సుబోధాచార్యుడు.
‘‘అతనికి పాఠం కంటే మీ వస్త్రాలను ఉతికి శుభ్రం చేయడంలోనే శ్రద్ధ ఎక్కువ ఆచార్యా! పాఠానికి వేళమించిపోతోందయ్యా వేగిరం రా అని ఇందాక మేమంతా పిలిస్తే... తుంగభద్ర నుంచి బయటికే రాలేదు. మీ కౌపీనాన్ని అదేపనిగా బండకేసి బాదుతూనే ఉన్నాడు. అతడిప్పట్లో వచ్చే సూచన కనిపించడం లేదు. దయచేసి మీరు పాఠాన్ని ప్రారంభించండి’’ అని వీలైనంత వినయంగా విన్నవించాడు నిత్యానందుడు.
వారి మనసులోని మాటలన్నీ వారిచేతనే బయటపెట్టించిన తరువాత శంకరుడు కన్నులు మూసుకుని అంతర్ముఖుడయ్యాడు. శంకరుని అనుగ్రహం ఆనందగిరిపై వర్షించింది. ఆచార్యుని సంకల్పమాత్రం చేత అతనికి విద్యలన్నీ స్ఫురించాయి. అతడు అప్పటికప్పుడు మహాపండితుడు అయ్యాడు. అంతేకాదు శంకరునిపై కమనీయమైన స్తోత్రాన్ని ఇలా ఆలపించాడు.
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్‌ కథితార్థనిధే 
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్‌ 
అఖిల శాస్త్రాలనూ తనలో నింపుకున్న అమృత సముద్రం శంకర దేశికుడు. ఉపనిషత్‌ జ్ఞానాన్ని లోకానికి వెల్లడించడానికి వచ్చినవాడు. ఆయన విమల చరణాలను నేను హృదయమందు నిలుపుకుని ఆరాధిస్తాను.  అఖిల దర్శన తత్త్వాలనూ ఎరిగిన ఆ తత్త్వవిదుని శరణు పొందిన వారిని సంసార దుఃఖాలు బాధించవు. స్వామీ కరుణావరుణాలయా! నాకు శరణునొసగి నన్ను రక్షించు అన్నాడు ఆనందగిరి.

అతడి గొంతులోని మార్దవానికి మతంగ పర్వతసీమ పరవశిస్తోంది. అతడి నుంచి వెలువడుతున్న తేజఃకాంతి పుంజాలు చూస్తున్న ఇతరుల కనులకు మిరుమిట్లు గొల్పుతున్నాయి.
తాబేటి తలపు న్యాయంలాగా కేవలము ఒక్కక్షణం సేపు తనపై ఆలోచనను సారించడం ద్వారా విద్యలన్నీ అనుగ్రహించిన ఆచార్యుని పాదాలను తాకి నమస్కరించాడు ఆనందగిరి. తనకు గురువు ఏమేమి ప్రసాదించాడో ఇలా చెప్పుకొచ్చాడు. 
నీ వల్లనే జనులకు ఆనందమనే పదానికి అర్థం తెలిసింది. నీ బోధల వల్లనే జిజ్ఞాసువులు ఆత్మమర్మం ఎరిగి తరిస్తున్నారు. ఈశ్వరునికి, జీవేశ్వరునికి గల అభేదాన్ని తెలియగలుగుతున్నారు. 
స్వామీ! నీవు సాక్షాత్‌ శంకరునివని తెలుసుకున్నాను. ఇది తెలియడం వల్ల నా హృదయం ఎన్నడెరుగని బ్రహ్మానంద స్థితికి చేరువవుతున్నది. మోహమనే మహాజలధిని ఒక్క అంగలో దాటేసిన అనుభూతి కలుగుతున్నది. 

సమదర్శనాన్ని సాధించాలనే ఆశయంతో ఎన్నెన్నో మార్గాల్లో ప్రయత్నించి విఫలమయ్యాను. నాకు సరియైన మార్గాన్ని ప్రబోధించి నన్ను కరుణించావు. 
ఒకే ఒక్క సూర్యుడు జగత్తులోని సమస్తాన్నీ ప్రకాశింప చేస్తున్నట్లు నీవు అనేక గురురూపాల్లో సంచరిస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నావు. గురువులందరికీ గురువైన జగద్గురూ! వృషభ«కేతనుడైన  శివునివి నీవే. జ్ఞానులలో నీకు సమానుడెవ్వడూ లేడు. నీవు తత్త్వనిధివే కాక, శరణాగత వత్సలునివి కూడా కనుక వేరెవ్వరినీ కాక నిన్నే నేను శరణు జొచ్చుతున్నాను. 
లిప్తపాటులో నువ్వు అనుగ్రహించినది ఎంతో నెమరేసుకోవడానికే నాకు శక్తి చాలడం లేదు. నీ జ్ఞానసంపదలోని చిన్ని భాగాన్నైనా పొందలేదనే స్పృహను ఎప్పటికీ ఉంచుకుంటాను. నాకు ఇతర సంపదలేవీ వద్దు. నీ సహజ వాత్సల్యధోరణిలో నన్ను కరుణించి చేరదీయి చాలు...’’ అని నమస్కరించాడు.
అతడిని లేవనెత్తి, ‘‘తోటకాచార్యా!’’ అని సంబోధించాడు శంకరుడు. ‘‘సుందరమైన తోటకవృత్తంలో నన్ను కీర్తించిన నువ్వు ఇకనుంచి తోటకాచార్యునిగా ప్రసిద్ధి పొందుతావు. . నీవు రచించిన తోటకాష్టకం గురుస్తోత్రాలలో అగ్రగణ్యమవుతుంది’’ అని నారాయణ స్మరణ పూర్వకంగా సెలవిచ్చాడు.

శంకరుడు శిష్యుణ్ణి అనుగ్రహించిన విధానం మిగిలిన వారికి కనువిప్పు కలిగించింది. మందమతిగా పేరు తెచ్చుకున్నవాడు కాస్తా చూస్తుండగానే  ప్రధాన శిష్యుడైపోవడం  అబ్బుర పరిచింది.
నలుగురు ప్రధాన శిష్యులే చతురంగ బలాలుగా మారి దన్ను ఇస్తుండగా శంకరుని దిగ్విజయ యాత్ర దక్షిణాపథంలో ప్రారంభమైంది. పర్వత సీమలనుంచి దిగివచ్చి...  శంకరయతి జనపదాలలో ప్రవేశించాడు. 
 – సశేషం 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top