అంటుకునే వ్యాధి

special story to teen driving habits - Sakshi

కవర్‌ స్టోరీ

డ్రగ్స్‌... మత్తులో ముంచెత్తుతాయి. భ్రాంతిని కలిగిస్తాయి. ఒకసారి వీటి వలలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఎక్కువగా టీనేజ్‌లోకి అడుగుపెట్టే కుర్రకారు వీటి ఉచ్చులో చిక్కుకుంటుంటారు. ఇందులోంచి బయటకు రాలేని వారు అకాల మరణాలకు బలైపోతున్నారు. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరు. ఊరకే ఉద్రేకపడిపోతుంటారు. దేనిపైనా దృష్టి నిలపలేరు. వ్యక్తిగత శుభ్రతను పట్టించుకోరు. ముద్ద ముద్దగా మాట్లాడతారు. వారి వద్ద చిత్రమైన వాసన రావచ్చు. ఇలాంటి లక్షణాలున్న పిల్లలు మీ పరిసరాల్లో తారసపడితే వెంటనే వారి  తల్లిదండ్రులను అప్రమత్తం చేయండి.  ‘ఇంటర్నేషనల్‌ డే అగైనెస్ట్‌ డ్రగ్‌ అబ్యూజ్‌ అండ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫికింగ్‌’ (జూన్‌ 26) సందర్భంగా మీకోసం తెచ్చిన వ్యాసం ఇది. మాదక ద్రవ్యాల వాడకం అక్రమం అని మనకు తెలుసు. మరి ట్రాఫికింగ్‌ అంటే?.. దాని రవాణా. మనిషి నుంచి మనిషికి రవాణా అవ్వడాన్ని కూడా డ్రగ్స్‌ చట్టంలో ట్రాఫికింగ్‌ అనే అంటారు. డ్రగ్స్‌ వాడిన వారిమీద కఠిన చర్యలు ఉండొచ్చు, లేదా క్షమించి కొత్త జీవితానికి అవకాశం ఇవ్వొచ్చు. కానీ సరఫరా చేసే వారిమీద మాత్రం కఠిన చర్యలు తప్పవు! ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధే ఈ ట్రాఫికింగ్‌. మన పరిసరాలు, మన కాలనీలు, ఇటువంటి దుష్టులతో అప్రమత్తంగా ఉండాలి! 

కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో కుర్రాళ్లు దమ్ముకొట్టడం, మందుకొట్టడం వంటివి ప్రారంభిస్తారు. క్రమంగా ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారుతాయి. సిగరెట్లతోనో, మద్యంతోనో సరిపెట్టుకోరు కొందరు. మరింత థ్రిల్‌ కోరుకుంటారు. జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసం కొందరు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం మరికొందరు డ్రగ్స్‌ వైపు అడుగులేస్తారు. ఒకటికి రెండుసార్లు వాడితే చాలు, వాటి మత్తులో పూర్తిగా కూరుకుపోతారు. మాదకద్రవ్యాలపై దాదాపు ప్రపంచ దేశాలన్నీ నిషేధాన్ని అమలు చేస్తున్నా, మాఫియా ముఠాల ద్వారా వీటి సరఫరా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ప్రేమపూర్వకమైన వాతావరణం లేని ఇళ్లలోని పిల్లలు, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు ఎక్కువగా డ్రగ్స్‌ మాయలో చిక్కుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఇందులో చిక్కుకుంటే చాలు, అప్పటి వరకు సజావుగా సాగుతున్న చదువు చెట్టేక్కేస్తుంది. కెరీర్‌ సర్వనాశనమవుతుంది. నిత్యం డ్రగ్స్‌ మత్తులో జోగుతుండే వారి దరిదాపులకు రావాలన్నా జనం జంకుతారు. సన్నిహితులు సైతం దూరమవుతారు. డ్రగ్స్‌ మాయాజాలంలో పడినవారు సామాజిక సంబంధాలను కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి కుటుంబ సభ్యులే అండగా నిలవాల్సి ఉంటుంది. వారిని ఆ ఊబిలోంచి బయటకు తేవడానికి ఓపికగా ప్రయత్నించాల్సి ఉంటుంది.

డ్రగ్స్‌తో ఇవీ అనర్థాలు
డ్రగ్స్‌లో నానా రకాలు ఉన్నాయి. పొగ పీల్చేవి కొన్ని, ముక్కు ద్వారా పీల్చేవి కొన్ని, నోటితో తీసుకునేవి కొన్ని, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునేవి కొన్ని... ఇవి కలిగించే అనర్థాలు రకరకాలుగా ఉంటాయి. ఎక్కువగా వాడుకలో ఉన్న డ్రగ్స్, అవి కలిగించే అనర్థాలు తెలుసుకుందాం...
గంజాయి: సాధారణంగా చిలుంలోనో, సిగరెట్లలోనో దట్టించి పొగపీలుస్తారు. గంజాయి ఆకులతోనే తయారు చేసే భంగును పాలల్లో లేదా లస్సీ వంటి పానీయాల్లో కలుపుకొని తాగుతారు. గంజాయి, భంగు ప్రభావంలో ఉన్నవారిలో కళ్లు ఎర్రబారడం, పెద్దగా నవ్వడం, బిగ్గరగా మాట్లాడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి బానిసలైన వారిలో అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, తనపై తానే ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొకైన్‌:    కొకైన్, కొకైన్‌ తరహా స్టిములెంట్స్‌ తీసుకున్న వారిలో డ్రగ్‌ ప్రభావం ఉన్న సమయంలో కనుపాపలు విప్పారడం, అతి చురుగ్గా ప్రవర్తించడం, తెలియని ఆనందంలో తేలిపోవడం, పెద్ద కారణం లేకుండానే త్వరగా కోపంతో రెచ్చిపోవడం, ఆందోళనతో అస్థిమితంగా ఉండటం, విపరీతంగా మాట్లాడటం, నిద్రాహారాలు లేకుండా గంటల తరబడి గడపగలగడం, నోరు, ముక్కు పొడిబారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
యాంటీ డిప్రెసెంట్‌ డ్రగ్స్‌: ఆల్‌ప్రోజోలాం, డైజెపాం వంటి యాంటీ డిప్రెసెంట్స్‌ డ్రగ్స్‌ను నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారికి, డిప్రెషన్‌తో బాధపడేవారికి వైద్యులు సూచిస్తుంటారు. ఎలాంటి సమస్యలు లేకున్నా, కొందరు వీటికి అలవాటు పడుతుంటారు. వీటిని మోతాదుకు మించి తీసుకునే వారిలో తప్పతాగినట్లు మత్తుగా తూగడం, చీదర కలిగించేలా ప్రవర్తించడం, మాటలు ముద్దముద్దగా రావడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హెల్యూసినోజెనిక్‌ డ్రగ్స్‌: ఎల్‌ఎస్‌డీ వంటి డ్రగ్స్‌ హెల్యూసినేషన్‌ అంటే భ్రాంతి కలిగిస్తాయి. ఇవి తీసుకునేవారు ఈ లోకంతో పనిలేనట్లుగా ఉంటారు. దేని మీదా దృష్టి నిలపలేకపోతారు. నోట్లోంచి చొంగకారుతూ కంపరం పుట్టించేలా ఉంటారు. కండరాలపై నియంత్రణ కోల్పోతారు. వీరికి ఆకలి తీరుతెన్నుల్లోనూ, మూడ్స్‌లోనూ మార్పులు వస్తాయి.  అసందర్భంగా నవ్వడం లేదా ఏడవడం, కోపంతో విరుచుకుపడటం, వస్తువులను విసిరిగొట్టడం, ఒక్కోసారి ఇతరులపై దాడికి తెగబడటం లేదా తమకు తామే హాని చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హెరాయిన్‌: హెరాయిన్‌ ప్రభావంలో ఉన్నవారిలో కనుపాపలు ముడుచుకుపోవడం, కంట్లో వెలుగుపడినా కనుపాపలు పెద్దగా స్పందించకపోవడం, నిద్రవేళల్లో మార్పులు రావడం, విపరీతంగా చెమట పట్టడం, దగ్గు, ఆకలి మందగించడం, కండరాలు బిగుసుకుపోతుండటం, మాటిమాటికీ ముక్కు ఎగబీల్చుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వాసన పీల్చే డ్రగ్స్‌: ముక్కుతో వాసనపీల్చే డ్రగ్స్‌ రకరకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కారుచౌకగా దొరికే వైటెనర్‌కు ఎక్కువమంది అలవాటు పడుతుంటారు. ఇలాంటి వాసన పీల్చే డ్రగ్స్‌కు అలవాటు పడినవారిలో కళ్లు నీళ్లతో నిండినట్లుగా కనిపించడం, గాజుకళ్లలా మారడం, దృష్టి సరిగా నిలపలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నోట్లోంచి చొంగకారుతూ అసహ్యకరంగా కనిపించడం, కండరాలపై నియంత్రణ లేకపోవడం, ఆకలి తీరుతెన్నుల్లో మార్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డ్రగ్‌ అడిక్ట్స్‌ను ఇలా గుర్తించవచ్చు
∙కళ్లలో ఎర్రజీరలు కనిపిస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంటుంది. కనుపాపలు సాధారణ స్థితి కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా మరింతగా కుంచించుకుపోయినట్లుగానో తయారవుతాయి.
∙ఆకలి, నిద్ర తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తాయి. అతిగా తినడం లేకుంటే ఆకలి మందగించడం, గంటల తరబడి మత్తుగా నిద్రపోవడం లేదా అతి చురుగ్గా నిద్రలేకుండా గంటల తరబడి గడపడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
∙వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ పూర్తిగా లోపిస్తుంది. మంచిబట్టలు వేసుకోరు. వేళకు స్నానం చేయరు. మురికిగా కనిపిస్తారు. 
∙ఒళ్లు వణుకుతుండటం, మాట ముద్ద ముద్దగా రావడం, వేగంగా కదలలేకపోవడం, విచిత్రంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు, ఒంటి నుంచి దుస్తుల నుంచి విచిత్రమైన వాసన రావడం వంటి లక్షణాలు గమనిస్తే అలాంటి వారు డ్రగ్స్‌ మాయలో చిక్కుకున్నట్లే భావించాలి.

అలవాటైన వారికి డ్రగ్స్‌ దొరక్కుంటే...
డ్రగ్స్‌కు బాగా బానిసలైపోయిన వారికి అవి దొరక్కుంటే వారిలో మరింత విపరీత లక్షణాలు కనిపిస్తాయి. వారి భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు కనిపిస్తాయి. క్రూరమైన భావనలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఒక్కోసారి కోపాన్ని అదుపు చేసుకోలేక దాడులకు పాల్పడటం, చివరకు హత్యలకు తెగబడటం వంటి దారుణాలకు పాల్పడతారు. పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తారు. తమకు తామే హాని చేసుకుంటారు. ఒక్కోసారి ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడతారు.

ప్రభుత్వాల వైఫల్యం
ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డ్రగ్స్‌ వినియోగం పెరుగుతూనే వస్తోంది తప్ప సిగరెట్ల వాడకం తగ్గుముఖం పట్టినట్లు డ్రగ్స్‌ వాడకం తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఆధునిక నిఘా వ్యవస్థలు కలిగి ఉన్న అగ్రరాజ్యాల ప్రభుత్వాలు సైతం డ్రగ్స్‌ మాఫియా ముఠాలను, డ్రగ్స్‌ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నాయి. యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యూఎన్‌ఓడీసీ), ప్రపంచబ్యాంకు, డబ్ల్యూహెచ్‌ఓ సంస్థలు 2015లో విడుదల చేసిన ‘ఫ్యాక్ట్‌షీట్‌ ఆన్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఇల్లిసిట్‌ డ్రగ్స్‌’ నివేదిక మాదక ద్రవ్యాలను నిలువరించడంలో ప్రభుత్వాల వైఫల్యానికి అద్దంపట్టేదిగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఏటా ఉత్పత్తవుతున్న మాదకద్రవ్యాల పరిమాణంతో పోల్చుకుంటే ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్న మాదకద్రవ్యాల పరిమాణం నామమాత్రంగా ఉంటోంది.
 
ఇందులోని వివరాలు ఇలా ఉన్నాయి...

ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 6,380 టన్నుల నల్లమందు ఉత్పత్తవుతోంది. ఇందులో 2,080 టన్నుల నల్లమందును యథాతథంగా వినియోగిస్తుంటే, మిగిలిన 4,300 టన్నుల నల్లమందును ప్రాసెస్‌ చేసి 480 టన్నుల హెరాయిన్‌ను తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నల్లమందు, హెరాయిన్‌ వాడే వారి సంఖ్య దాదాపు 5.3 కోట్ల మంది వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 2015లో భద్రతా బలగాలకు పట్టుబడిన నల్లమందు 587 టన్నులు, హెరాయిన్‌ 80 టన్నులు మాత్రమే. మిగిలిన సరుకునంతా డ్రగ్‌ మాఫియా ముఠాలు యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నాయి. గంజాయి, కొకైన్‌ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. రసాయనిక మాదకద్రవ్యాల విషయానికొస్తే, 2015లో వాటి ఉత్పత్తి 190 టన్నులు ఉంటే, పట్టుబడినవి 23 టన్నులు మాత్రమే. నిఘా సంస్థలకు దీటుగా డ్రగ్స్‌ మాఫియా ముఠాలు కూడా ఎప్పటికప్పుడు హైటెక్‌ పోకడలను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన ‘ఫ్యాక్ట్‌షీట్‌’ ప్రకారం 2013– 2015 మధ్య కాలంలో ఈ లావాదేవీలు 50 శాతం మేరకు విస్తరించాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

డ్రగ్స్‌ మాఫియా కథా కమామిషు
మాదకద్రవ్యాల వాడకం చాలా శతాబ్దాల నుంచే ఉన్నా, మాఫియా ముఠాల అవతరణ మాత్రం దాదాపు రెండు శతాబ్దాల కిందటే జరిగింది. పంతొమ్మిదో శతాబ్దిలో అమెరికాకు వలస వచ్చిన చైనా ముఠాలు అమెరికన్లకు నల్లమందును అలవాటు చేశారు. పారిశ్రామిక విప్లవం ఊపందుకుంటున్న కాలంలో నల్లమందు నుంచి హెరాయిన్, మార్ఫిన్, కోడీన్‌ వంటి మాదకద్రవ్యాల తయారీ మొదలైంది. అమెరికా అంతర్యుద్ధ కాలంలో గాయపడ్డ సైనికులకు అప్పటి వైద్యులు నొప్పి నివారిణిగా మార్ఫిన్‌ను ఇచ్చేవారు. నల్లమందు అనర్థాలను గ్రహించిన తర్వాత అమెరికన్‌ ప్రభుత్వం నల్లమందు, దాని అనుబంధ ఉత్పత్తులపై ఆంక్షలు విధస్తూ 1914లో హ్యారిసన్‌ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వైద్యేతర అవసరాల కోసం నల్లమందు, హెరాయిన్‌ వంటి వాటిని ఉపయోగించడాన్ని నిషేధించింది. నిషేధాజ్ఞలు రుచించని చైనా వ్యాపారులు నల్లబజారును సృష్టించుకున్నారు. న్యూయార్క్‌ నగరాన్ని కేంద్రంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా నల్లమందు, హెరాయిన్‌ వంటివి విక్రయించేవారు. అమెరికాలో సాంస్కృతికంగా జాజ్‌ యుగం మొదలైన 1930లలో గంజాయి వాడుక పెరిగింది. మాదక ద్రవ్యాల వ్యాపారం లాభసాటిగా ఉండటంతో అమెరికాలో కొన్ని కుటుంబాలకు కుటుంబాలే అక్రమంగా వీటిని దిగుమతి చేసుకుని, రహస్యంగా అమ్మకాలు సాగించసాగాయి. వియత్నాం యుద్ధ కాలంలో హెరాయిన్‌ వాడుక మరింతగా పెరిగింది.

ఆ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్‌ సైనికుల్లో దాదాపు 15 శాతం మంది హెరాయిన్‌కు బానిసలుగా మారడంతో అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. వియత్నాం యుద్ధం ముగిసిన కొద్ది కాలంలోనే డ్రగ్స్‌ అక్రమ వ్యాపారం భారీ స్థాయిలో విస్తరించింది. లాటిన్‌ అమెరికా దేశాల్లో డ్రగ్స్‌ మాఫియా ముఠాలు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు పట్టనివ్వని స్థాయికి చేరుకున్నాయి. మెక్సికన్‌ స్మగ్లర్‌ పాబ్లో ఎస్కోబార్‌ డ్రగ్స్‌ మాఫియాకు అంతర్జాతీయ డాన్‌గా ఎదిగాడు. ఎస్కోబార్‌ ముఠా 1975లో ఒక విమానంలో రవాణా చేస్తున్న 600 కిలోల కొకైన్‌ను కొలంబియా పోలీసులు పట్టుకున్నారు. తమ సరుకును పట్టుకున్న నలభై మంది పోలీసులను మాఫియా ముఠా సభ్యులు పిట్టల్లా కాల్చి చంపేశారు. అప్పట్లో ఈ సంఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. డ్రగ్స్‌ అక్రమ రవాణాకు అడ్డొచ్చిన వారికి కిడ్నాప్‌ చేయడం, అవసరమైతే హత్యలు చేయడం ఎస్కోబార్‌ ముఠాకు మంచినీళ్ల ప్రాయం కావడంతో ఎవరూ ఆ ముఠా జోలికి వచ్చేందుకు సాహసించేవారు కాదు. అప్పట్లో ఎస్కోబార్‌ ముఠా రోజువారీ ఆదాయం ఏకంగా 6 కోట్ల డాలర్ల (రూ.404 కోట్లు) వరకు ఉండేదంటే ఏ స్థాయిలో డ్రగ్స్‌ వ్యాపారం కొనసాగించేదో ఊహించుకోవాల్సిందే. ఎస్కోబార్‌ బాటలోనే వివిధ దేశాల్లో వందలాది మంది డాన్లు తయారయ్యారు. దారితప్పిన యువకులు వారి పంచన చేరి నేరాల బాట పట్టారు. అమెరికా, కెనడా, మెక్సికో, బ్రెజిల్, పెరు, వెనిజులా, బొలీవియా, కొలంబియా, హోండురాస్, నికరగ్వా, ఇటలీ, ఐర్లాండ్, ఇంగ్లండ్, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్పెయిన్, పోలండ్, హంగెరీ, స్లోవేకియా, చెక్‌ రిపబ్లిక్, బెల్జియం, కొరియా, జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నాం, శ్రీలంక, భారత్, ఇజ్రాయెల్, టర్కీ, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డ్రగ్స్‌ మాఫియా ముఠాలు ఇప్పటికీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

మన దేశంలో మాఫియా
మన దేశంలో మాఫియా ముఠాలు స్వాతంత్య్రానికి కొద్ది సంవత్సరాల ముందే ఉనికిలోకి వచ్చాయి. ముంబై కేంద్రంగా తొలి తరం డాన్‌లు హాజీ మస్తాన్, కరీంలాలా మొదట్లో బంగారం, వెండి స్మగ్లింగ్‌ చేసేవారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా కూడా లాభసాటిగా ఉండటంతో ఈ రంగంలోకీ అడుగుపెట్టారు. కొంతకాలానికి వరదరాజన్‌ ముదలియార్‌ ఈ రంగంలోకి వచ్చాడు. దావూద్‌ ఇబ్రహీం 1980లలో ఈ రంగంలోకి వచ్చి, ‘డీ కంపెనీ’ పేరిట ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. డీ కంపెనీ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం, ఆయుధాల అక్రమ రవాణ వంటి నానా ఘాతుకాలకు తెగబడింది. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన 1993 నాటి ముంబై పేలుళ్ల వెనుక ఉన్నది డీ కంపెనీ అనే సంగతి తెలిసిందే. ముంబై పేలుళ్ల తర్వాత దేశం విడిచి, పాకిస్తాన్‌లో తలదాచుకున్న దావూద్‌ ఇబ్రహీంను అమెరికా ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించింది. దావూద్‌ ఇబ్రహీం భారత్‌ను విడిచి వెళ్లిన తర్వాత ఇక్కడేమీ డ్రగ్స్‌ మాఫియా ముఠాలు అంతరించిపోలేదు. పైగా ముంబై వెలుపల దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరించాయి. పంజాబ్‌ మాఫియా, గోవా మాఫియా ముఠాలు అంతర్జాతీయ మాఫియా ముఠాలతో కుమ్మక్కై విచ్చలవిడిగా ఇక్కడకు మాదకద్రవ్యాలను చేరవేస్తున్నాయి. పంజాబ్‌ మాఫియా ధాటికి అక్కడి యువత మత్తులో కూరుకుపోయి నాశనమైపోతున్న పరిస్థితులపై వచ్చిన ‘ఉడ్‌తా పంజాబ్‌’ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళలో ఏకంగా ఐస్‌క్రీం పార్లర్లలోనే డ్రగ్స్‌ అమ్మకాలు సాగిస్తున్న ఉదంతం కొన్ని సంవత్సరాల కిందట కలకలం రేపింది. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు వార్తలకెక్కాయి. బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, యూపీ, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో గంజాయి అక్రమసాగు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. 

కిక్కు లెక్కలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రెండేళ్ల కిందట విడుదల చేసిన ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్‌ వాడుతున్న వారి సంఖ్య 25.5 కోట్ల వరకు ఉంటుంది. గంజాయి వాడుతున్న వారి సంఖ్య 18.3 కోట్లు, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి సంఖ్య దాదాపు 1.20 కోట్ల వరకు ఉంటుంది. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల 2016లో 1.44 లక్షల మంది మరణించారు. ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిలో 16 లక్షల మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌తో బాధపడుతుంటే, మరో 61 లక్షల మంది హెపటైటిస్‌–సితో బాధపడుతున్నారు. స్టెరిలైజ్‌ చేయని సూదులతో ఒకరి నుంచి ఒకరు డ్రగ్స్‌ తీసుకుంటుండటంతో ఈ వ్యాధులు మహమ్మారిలా ముట్టడిస్తున్నాయి. డ్రగ్స్‌ వాడకం వల్ల హెపటైటిస్‌–సి సోకిన వారిలో 2.22 లక్షల మంది, హెచ్‌ఐవీ సోకిన 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచంలో డ్రగ్స్‌ వాడేవారు    25.5 కోట్లు
గంజాయి వాడేవారు        18.3 కోట్లు
ఇంజెక్షన్‌ డ్రగ్స్‌ వాడేవారు    1.20 కోట్లు
డ్రగ్‌ అడిక్ట్స్‌లో హెచ్‌ఐవీ బాధితులు    16 లక్షలు
హెపటైటిస్‌–సి బాధితులు    61 లక్షలు

డ్రగ్‌ అడిక్ట్స్‌ను బయటపడేయడం ఎలా?
ఇంట్లోని పిల్లలెవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తీరని వేదన కలుగుతుంది. నిష్కారణంగా జీవితాన్ని పాడు చేసుకుంటున్న పిల్లలపై కోపం ముంచుకొస్తుంది. కేవలం లోలోన కుమిలిపోవడం వల్ల లేదా వారిపై కోపతాపాలు చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, పరిస్థితి మరింతగా అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. అందువల్ల డ్రగ్స్‌కు బానిసలైన వారితో మరింతగా ఓపికగా, సహనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి కోసం మరింతగా నాణ్యమైన సమయాన్ని వెచ్చించి వారితో మాట్లాడి, ధైర్యం చెప్పి వారిని ఈ ఊబి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి. అందుకోసం వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి.

∙డ్రగ్స్‌ మాయలో చిక్కుకున్న వారిపై కోపతాపాలు ప్రదర్శించకుండా, అనునయించడం ద్వారా మాత్రమే మార్చడం సాధ్యమవుతుంది. 
∙‘ఇకపై నువ్వు డ్రగ్స్‌ తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం... అలా చేస్తాం.. ఇలా చేస్తాం’ అంటూ ఎమోషన్‌ బ్లాక్‌మెయిల్‌కు దిగకండి. అలా చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది.
∙డ్రగ్స్‌ వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి వారిపై ప్రభావం చూపేలా ఓపికగా వారికి వివరించడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. 
∙డ్రగ్స్‌ మత్తులో ఉన్నప్పుడు వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను వాళ్లకే తెలిసేలా చేయండి. వారెంత నష్టపోతున్నదీ వారి అనుభవంలోకి తేవడం ఒక మార్గం.
∙డ్రగ్స్‌ కారణంగా వారు కోల్పోయే ఆత్మగౌరవం, సామాజికంగా వారికి కలుగుతున్న గౌరవభంగం గురించి వారికి తెలిసేట్లు చేయండి. 
∙డ్రగ్స్‌ అందనివ్వకుండా చేయడం, వాటిని పారేయడం వంటి చర్యలకు పాల్పడకండి. అలా చేస్తే, వారు మరింతగా డ్రగ్స్‌ కోసం ప్రయత్నిస్తారు. కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలను మానుకోండి.
∙డ్రగ్స్‌ బారిన పడిన వారిని దండించడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం, వారికి ఉపదేశాలు ఇవ్వడం, వారితో వాదించడం సరికాదు. వారిని చిన్నబుచ్చడం, ఆత్మన్యూనత కలిగేలా చేయడం ద్వారా వారిని అలవాటుకు దూరం చేయగలమనుకుంటే పొరపాటే! 
∙డ్రగ్స్‌ నుంచి వారిని బయటపడేయాలంటే వారికి కావాల్సింది మీ నుంచి బేషరతు భరోసా. ‘మేం నీ వెంటే ఉన్నాం’ అనే భావనను వారిలో కల్పించాలి. దురలవాటును మానేశాక దాని గురించి మా వద్ద సిగ్గుపడేలా ప్రవర్తించాల్సిన పరిస్థితిని కల్పించబోమనే నమ్మకం కలిగించాలి. నిరంతరం ప్రోత్సహిస్తూ డీ అడిక్షన్‌ చికిత్స ద్వారా వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావాలి.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top