రుచుల జాడ వేరు

Special Story By KA Munisuresh Pillai In Funday On 01/12/2019 - Sakshi

కె.ఎ. మునిసురేష్‌ పిళ్లె

‘మాధవీలత వొస్తుందా..’ అనుకున్నాడు బాలూ. అప్పటికి పదోసారో పదిహేనోసారో అనుకున్నాడు. మొబైల్‌ తీసి.. వాట్సప్‌లో వచ్చిన మెసేజీని చూసుకున్నాడు. ‘తనక్కూడా మెసేజీ వెళ్లి ఉంటుందా? ఎక్కడ ఉందో.. అసలు ఎవరికైనా తెలుసా? ఎలా ఉందో? ఛ.. ఈ డౌటు కరెక్టు కాదు. అలాగే ఉంటుంది. తప్పకుండా.’ అని కూడా అనుకున్నాడు. ‘వొస్తే బావుణ్ణు’ అని ఆశపడ్డాడు. రెండ్రోజుల కిందట ఓ చిన్ననాటి ఫ్రెండు ఫోన్చేశాడు. ‘దసరా సెలవుల మధ్యలో వచ్చే ఆదివారం అనుకుంటున్నాం.. కుదురుతుంది కదా’ అన్నాడు. ఇవాళ వాట్సప్‌లో మెసేజీ వచ్చింది. అందరికీ ఈ మెసేజీ పంపినట్లుంది. గ్రూప్‌ క్రియేట్‌ చేసి ఉంటే.. ఆమె నెంబరు అందులో దొరికే చాన్సుండేది. ఆరోజు దాకా ఎదురుచూడాల్సిందే. ప్రత్యేకించి ఆమె గురించి వీడిని అడిగేంత ధైర్యం లేదు. అడిగితే తప్ప ఆరా తెలియదు. ఇరుకులో పడింది మనసు. ‘దసరా దాకా ఆగగలను’ అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ‘వొస్తే సరే... రాకపోతే..’ ఆలోచనకే, డీలాపడిపోయాడు కూడా.
అప్పట్లో– మాధవీలత... పదోక్లాసులో కొత్తగా వచ్చి చేరింది. బాలాజీ ఉరఫ్‌ బాలూ కళ్లు మెరిశాయి. అలా మెరవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. 
బాలు చేతివేళ్లలో ఓ ఇంద్రజాలం ఉండేది. అది అతనికి జన్మతః వచ్చింది. అతని చేతివేళ్లలో ఇమిడే కుంచెలు– కదనరంగంలో విచ్చలవిడిగా దౌడుతీసే అశ్వాల విహారాలు అయ్యేవి.. చుట్టుముట్టే శత్రుసేనను చెల్లా చెదరు చేయడం లక్ష్యంగా మెరిసే ఖడ్గ ప్రహారాలు అయ్యేవి...! ఆ కుంచెల కింద రంగులు– అశ్వ విహారాలలో రేగే ధూళిలాగా.. ఖడ్గ ప్రహారాలలో మెరిసే కాంతుల లాగా.. నానా వయ్యారాలు పోయేవి, ఒద్దికను దిద్దుకునేవి. అంతిమంగా ఓ అద్భుత సౌందర్యం ఆవిష్కృతమవుతుండేది. బొమ్మలు గీయడం అతినికి బాగా ఇష్టం.
వచ్చిన విద్యకు వన్నె అద్దుకోవడానికి ఓ గురువు దగ్గర చేరాడు బాలూ. ఆయన వాడిలో సత్తా ఎంతో పలువిధాలుగా పరీక్షించాక... రవివర్మ వర్ణచిత్రాల ఫోటోలు ఇచ్చి.. వాటిని యథాతథంగా కాపీ చేసి ‘కలరింగ్‌’లో పరిణతి పొందే పని అప్పగించాడు. ఆ క్రమంలో అతని ఎదుటకు... హంసతో మౌన సరాగాలాడుతున్న ‘దమయంతి’ వొచ్చింది... తన బుగ్గలను చూసి చిన్నబోతున్న ఫలాలు, తన నీలికనుల ఎదుట వెలతెలబోతున్న ద్రాక్ష గుత్తితో మాద్రి వొచ్చింది...  వెన్నెల కురుస్తోంది, చందమామ కూడా వొచ్చేశాడు, నీవింకా రావేలరా కృష్ణా అంటూ సెలయేటిఒడ్డు రాతి తిన్నె మీద విరహోద్ధితయై నిరీక్షిస్తున్న రాధ వొచ్చింది... వారికి కొనసాగింపుగా, యిదిగో యిప్పుడిలా, యెల్లో ఓకర్‌ రంగు చుడీదార్‌ తొడుక్కుని... తరగతి గదిలోకి మాధవీలత వొచ్చింది!
తన కళ్లలోని మెరుపును అలాగే దాచిపెట్టుకున్నాడు. ఆ తరగతిలో ఉన్న అనేకమందితో పోలిస్తే.. మాధవీలత గొప్ప సౌందర్యరాశి కాదు. కానీ వాడి కళ్లకు ఆమె రవివర్మ చిత్రం. ఆ అబ్బురాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. నిజానికి తను నకలు చేసిన ‘వెన్నెల్లో రాధ’ను చూపించి.. ‘చూశావా నీ బొమ్మగీశాను, నెలకిందటే’ అని ఉంటే గనుక, కలిగే దిగ్భ్రమలో ఆమె వాడిని సులువుగా ఇష్టపడి ఉండేదే! కానీ అలాంటిదేమీ జరగలేదు. అలాగని, వాడి యిష్టాన్ని గుర్తించలేదని కాదు. కానీ యిద్దరి మధ్యా అవ్యక్తంగా ఉండిపోయింది. స్కూలు పూర్తయి, వాళ్లు దూరమయి, దశాబ్దాలు గడిచాయి.
తలపుల్లోంచి బయటకు వచ్చి... చేతివేళ్లకేసి చూసుకున్నాడు బాలాజీ. ఒకప్పుడు నిస్తేజంగా ఉండే కేన్వాసుకు ప్రాణాలు పోసి వర్ణరంజితం చేసిన వేళ్లు! కంప్యూటరు కీబోర్డు మీద టకటకలతో గిడసబారినట్లు కనిపిస్తున్నాయి. పెర్సీ షెల్లీ– ఒజీమాండియాస్‌ గుర్తొచ్చింది. అంతా గతించిన వైభవం. ‘కొత్త ఊపిరులూదగలనా’ అనుకున్నాడు. ఎదురుగా స్క్రీన్‌ మీద టాస్క్‌ బార్‌ లో తేదీ చూశాడు. ఎంత దూరముందో లెక్క వేసుకున్నాడు. 
అప్పట్లో లోపల దాచుకున్న.. ‘ఇష్టం’ ఓసారి ఒళ్లు విరుచుకుంది.
సురేంద్ర రాజు బక్కపలచటి వాడు. పీలగా పొట్టిగా ఉంటాడు. రంగువెలిసిపోయిన ఒక ఖాకీరంగు ప్యాంటు తొడుక్కున్నాడు. అది వాడి కంటె చాలా పెద్ద సైజుది. పాదాల వద్ద జాస్తి పొడుగుంటే కత్తిరించేసి.. మడిచి కుట్టించటానికి కూలీ దండగని అలాగే వదిలేశాడు. దారపు పోగులు ఊడుతూ, వేలాడుతూ ఉందది. బాగా వదులుగా ఉంటే, నడుముదగ్గర ప్యాంటును మొలతాడు కిందికి దోపి జారిపోకుండా భద్రత కల్పించాడు. చొక్కా కూడా ఇంచుమించు అలాగే ఉంది. అది తెల్లదే కానీ, కొన్నేళ్లుగా ఉతుకులు పడి గోధుమ రంగులోకి వచ్చింది. కాళ్లకి హవాయి చెప్పులున్నాయి. అవి జారిపోతాయేమోనని వేళ్లతో గట్టిగా బిగించి  పట్టుకుని నడుస్తుంటాడేమో.. బొటనవేలి దగ్గర గుంటలు పడి... నీలం రంగు తేలి ఉన్నాయి. 
‘‘ఐస్‌.. ఐస్‌...’’ అన్నాడు, బడి ఎదురుగా ఉన్న బండి వద్ద నిల్చుని. ఆ మాట వాడి అబ్బసొత్తు! అనువంశికంగా సంక్రమించింది వాడికది. ఒకటిన్నర అక్షరాలున్న ఆ ఒక్కపదాన్ని రెండుసార్లు జంటగా పలకడంలో వాడు రకరకాల చిన్నెలు చూపించగలడు. వాడి నాయిన కూడా ఐసు అమ్మేవాడు. మూత ఉన్న ఒక డబ్బాకు చక్రాలు బిగించి దాన్ని తోసుకుంటూ నడుస్తూ పల్లెలన్నీ తిరిగేవాడు. ఇప్పుడు ఆ డబ్బా రూపు కాస్త మారింది. కాపోతే.. తోపుడు బండిలాగా కాకుండా రిక్షా బండిలాగా తయారైంది. కాస్త పెద్దది. కొన్ని చిన్నెలు కొత్తగా వచ్చాయి. కానీ ఆ బండి వాడిది కాదు.. వాడు ఆ బండివాడి వద్ద కూలికి పనిచేస్తాడు. బడి ఎదురుగా ఉన్న ఆ ఐస్‌ బండికి ఇంటర్వెల్‌ సమయాల్లో వ్యాపారం బాగుంటుంది. లంచ్‌బ్రేక్‌లో పిల్లల్ని గేటు బయటకు పంపరు. కాబట్టి రెండు ఇంటర్వెళ్లకు మధ్య ఖాళీలో బండి ఓనరు ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. ఆ టైములో బండి దగ్గర సురేంద్ర రాజు ఉరఫ్‌ రాజు కూర్చుని ఉంటాడు. రోజుకు ఇరవై రూపాయలొస్తాయి కూలీగా. మధ్యాహ్నం అయిదురూపాయల కూడు తింటాడు. రాత్రి పెళ్లాన్ని పీక్కుతింటాడు. అదీ జీవితం. 
ఈలోగా– ఓ మోటారు సైకిలు రోడ్డు వారగా ఉన్న తనవైపు వస్తుండడం చూసి.. కొంటాడేమో అనుకుని.. మరోసారి ‘‘ఐస్‌.. ఐస్‌...’’ అని పొలికేక పెట్టాడు రాజు. ఆ మోటారు సైకిలు శాల్తీ సరిగ్గా వచ్చి బండి పక్కనే ఆగింది.
తన దగ్గర దొరికే ఐసు నామావళి ఎత్తుకోగానే.. అవతలివాడు చేత్తో వారించి.. మొహానికున్న హెల్మెట్‌ ముసుగు తీశాడు.. ఎక్కడో చూసినట్టే ఉంది గానీ గెమనంలోకి రాలేదు. ‘‘ఎంతలో ఈమంటావు నా’’ అన్నాడు. 
‘‘నీయబ్బా.. నన్ను గుర్తు పట్టలా’’ అన్నాడా శాల్తీ. వాడిని గుర్తు పట్టాక రాజు కళ్లు మెరిశాయి. వచ్చినవాడు– కాసేపు అవీ ఇవీ వాకబు చేశాడు. ‘‘ఆరోతేదీ ఆదోరం.. మనోళ్లంతా వొస్తారు.. పొద్దన్నే వొచ్చేయ్‌.. సాయంత్రం దాకా అక్కణ్నే... బోజనాలు గూడా...’’ అని, బండిస్టార్ట్‌ చేశాక ‘‘చిల్లరేమైనా ఈమంటా’’ అంటూ ఓ యాభైనోటు తీసి జేబులో పెట్టి చక్కాపోయాడు. రాజు కళ్లు మళ్లీ మెరిశాయి. ఎన్నిరోజులైంది? నాలిక తడుపుకుని గుటకలేశాడు. ఆదివారం రమ్మన్న సంగతి గుర్తొచ్చింది.. ‘ఆరోజు పెదపెద్దగా ఎదిగిన మనోళ్లంతా వొస్తారు. యివి గాదుగానీ.. యింకో ప్యాంటు యింకో సొక్కా యేస్కోని రావాల’ అనుకున్నాడు. 
‘అప్పుటోళ్లంతా వొస్తారేమో..’ అనుకున్నాడు రాజు.. మోటారు సైకిలు వాడి పిలుపును గుర్తు చేసుకుని.. ఆశెగా. వాడికి స్వీట్సంటే చానా ఇష్టం. బంధుజనంలో అవి పెట్టేంత పెద్ద విందులు ఇచ్చేవాళ్లు వాడికి లేరు. ఆ తాహతు ఉన్నవాళ్లు వీడిని దూరం పెడతారు. ‘అందుకే.. ప్రతిబతుక్కీ సావాసగాళ్లుండాల. వాళ్లయితే తాహతూ, తద్దినమూ జూసుకోకుండా... పలకరిస్తారు.’ అనుకున్నాడు కసిగా. ‘ఆదివారం రానీ.. మహరాజులు తినే కూడు తింటా.. స్వీట్లు, గడ్డ పెరుగూ, వేపుళ్లూ, అప్పడాలూ, ఐస్‌ క్రీమూ కిళ్లీలూ...’ మోటారు సైకిలు వాడి పిలుపు గెమనంలోకి వొస్తేనే వాడికి నోరూరుతోంది. ఆరోజు ఎంత దూరముంది యింకా..? వేళ్ల మీద లెక్కపెట్టాడు. 
ఆదివారానికి ప్రత్యేకంగా సిద్ధమవుతూ... ‘ఆకలి’ ఇప్పుడే ఒళ్లు విరుచుకుంది!!
టెంకాయలోకి నీళ్లెట్టా వొస్తాయంటే ఏం  జెప్తాం? మనకు తెలీని వాటికి బగమంతుడి లీల అని సరిపెట్టుకోవాల్సిందే. సంపదలు కూడా అంతే. అది ప్రభాకర్‌ విషయంలో మాత్రం నిజం. వాడి దగ్గరకు డబ్బు అనే పదార్థం ఎలా వచ్చి చేరింది అనేది ఇదమిత్థంగా ఎవ్వరికీ తెలియదు. కానీ.. వాడొక కాంట్రాక్టరు. అదనంగా చాలా డీల్స్‌ చేస్తుంటాడు.  ఎవడైనా వెళ్లి పది రూపాయలు చందా అడిగితే ఇరవై ఇస్తాడు. తాను గ్లాసు పట్టుకునే సమయానికి తన వెంట ఎవరుంటే, ఎందరుంటే...  వారందరినీ లెక్కలోకి తీసుకుని... సరిపడా ఫుల్‌ బాటిళ్లకు ఆర్డరిస్తాడు. అదే బళ్లో చదివాడు.. అత్తెసరుగానే గట్టెక్కాడు. ఏదో మాయ జరిగి, ఉన్నపళంగా చేరిన సంపదను పెంచుకుంటూ పోతూ.. కుబేరావతారం ఎత్తడంలో ప్రతిభ మాత్రం వాడిదే. తన పట్ల వక్రించకుండా... విధిని చెరపట్టి, సిరిని చేపట్టాడు.
విజయవాడలో ఒక డీల్‌ ఉంది. కానీ.. దానిని చక్కబెట్టగల కీలకం హైదరాబాదులో ఉంది. అయిదునక్షత్రాల హోటల్లో దిగాడు. బల్లమీదికి బ్లూ లేబుల్‌ రాగానే.. మూతవిప్పి గ్లాసులోకి ఒంపేసి.... ‘మీకు ఇంకో రూం వేశాను.. మీరు తొందరగా వెళ్లాలి. మొదలెట్టేయండి’ అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అవతలివ్యక్తి ‘ఇంకో రూం’లోని భావాన్ని గ్రహించాడు. ఆశెగా.. చీర్స్‌ మర్యాదలేవీ పట్టించుకోకుండా... తనంత తాను నాలుగు పెగ్గులు తాగేసి ‘ఇంకో రూం’కు వెళ్లిపోయాడు.  ప్రభాకర్‌ ఒక్కడే మిగిలాడు గదిలో! 
అప్పుడు మోగింది సెల్‌ ఫోను. ‘‘అన్నా బిజీనా...’’ అవతలి వాడు మిత్రుడే.. కానీ, వీడి సంపద పట్ల సహజంగా ప్రదర్శించి తీరవలసిన అణకువతో అడిగాడు. ‘‘లేదులే చెప్పు..’’ అన్నాక పది నిమిషాలు సాగిందా సంభాషణ.
ఆదివారం గురించే. కానీ.. ఆ ఫోనులో ప్రభాకర్‌కు వచ్చింది ఆహ్వానం కాదు– నివేదిక! ఎందుకంటే... ఈ కార్యక్రమాన్ని మొత్తం మొదలెట్టిందే వాడు. కాగల ఖర్చు మొత్తం తాను భరిస్తానన్నాడు. కార్యభారం మోయగల వారికి పురమాయించాడు. వారిలో ఒక మిత్రుడే ఇప్పుడు ఫోన్‌ చేసి ఏర్పాట్లు ఎంతదాకా వచ్చాయో... మిత్రుల్లో ఎవరెవరు ఇంకా అందుబాటులోకి రాలేదో.. సాంతం నివేదిక సమర్పించేశాడు ప్రభాకర్‌కి. 
ప్రభాకర్‌ తలచినదానికి, వలచిన దేనికీ కొదవలేదు. కానీ తన సంపదను ప్రదర్శించాలనే దాహం. అందరూ ఆహాఓహో అనాలి. ఇప్పుడు కూడా అంటున్నారు.. అది చాలడం లేదు. అందరినీ పిలిచి అనిపించుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. కాగల ఖర్చు ఓ లెక్కలోది కాదు. ‘‘ఇబ్బందేం లేదు. శనివారం సాయంత్రానికి నేనక్కడ ఉంటా.. కాస్త ప్లాన్‌ చేసుకుందాం... అంతా అదిరిపోవాలి’’ పురమాయింపు పూర్తిచేశాడు ప్రభా.
ఐశ్వర్యంతో తీరక  లోలోపల రగులుతున్న... ‘దాహం’ కూడా ఒళ్లు విరుచుకుంది.
నది ఒడ్డునే నాగరికతలు వెలుస్తాయని చరిత్ర చెబుతుంటుంది. నది ఒడ్డునే గుడులు వెలుస్తుంటాయి. ఆ ఊర్లో నది ఒడ్డునే బడికూడా వెలిసింది. సువర్ణముఖి గట్టునే రాజా పానుగంటి బంగారమ్మ సీతారామరాయనింవారి ఉన్నతపాఠశాల ఉంటుంది. విశాలమైన పాఠశాల. ఒకప్పుడు దాని ప్రాభవం చాలా పెద్దది. పొరుగు జిల్లానుంచి వొచ్చి ఎస్పీ బాలూ లాంటివాళ్లు కూడా చదివిన బడి అది. బ్రహ్మోత్సవాలకు గతిలేకపోయినా... నిత్య దీపారాధనకు కొరతలేని గుడిలాగా, ఇప్పుడు కాస్త కళ తగ్గినా.. పేదలకు చదువు చెప్పేందుకు మిగిలుంది. 
ఆదివారం అందరూ చేరారక్కడ. అందరూ పిల్లలైపోయారు. స్థాయులు తాహతులు– కులాలు మతాలు అన్నీ మరచిపోయారు.  బతుకు గమనంలో మరుగున పడిపోయిన జ్ఞాపకాలు. మనసు అట్టడుగు పొరల్లో పడిపోయి ఉండేవి.. తవ్వుకుంటున్నారు. దోసిళ్లతో జవురుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వెదజల్లుకుంటున్నారు. ఆ జల్లులో తడుస్తున్నారు. ఆనందిస్తున్నారు. కోలాహలం కొలువవుతోంది. 
అందరూ– కోపం, అలకలు తప్ప ద్వేషం తెలియని వయసునాటి మిత్రులు. ఆప్తులతో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. యిడుములు పంచుకుంటున్నారు. తెలియకుండానే కళ్లు చెమర్చుకుంటున్నారు. కళ్ల తడిలో గుండె చిక్కబెట్టుకుంటున్నారు. చిక్కనైన గుండె బరువు దించుకుంటున్నారు. తెరపి పడుతున్నారు. కోలాహలంలో హాలాహలం మాయమవుతోంది.
మధ్యాహ్నం విందుభోజనం కూడా అనుకున్నట్లే అదిరిపోయింది. స్టార్‌ హోటల్‌ స్థాయిలో ఉంది విందు. వాళ్లలో చాలా మంది, జీవితంలో ఎన్నడూ ఎరగని వంటకాలు... బెంగాలీ స్వీట్లు, విదేశీ పలహారాలు, విదేశాల నుంచి తెప్పించే పళ్లు ఏంటేంటో ఉన్నాయక్కడ. వచ్చినవారిలో ఏ పదిమందో తప్ప... తతిమ్మా ఎవ్వరూ అంత వైభవమైన విందును ఎరగరు. 
ఇంత విందులోనూ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ వాసూగాడి కోవా జాంగ్రీ.
మామూలుగా అయితే... ఆ మెనూలోకి రాగలిగేది కాదు అది. విందులో అందరికీ కోవాజాంగ్రీ పెడతానన్నాడు వాసు. ‘నిర్వహణ భారం మొత్తం ఒకడే మోస్తున్నాడు గనుక.. ఇది వద్ద’న్నారు కొందరు. ‘మన బాల్యం దానితో ముడిపడి ఉంది గనుక ఉండాల్సిందే’ అన్నారు మరికొందరు. చివరకు అది మెనూలో చేరింది. 
వాసూ వాళ్లందరితో పాటూ ఆ బడిలోనే చదివాడు. మిఠాయి దుకాణం వాళ్ల కుటుంబ వ్యాపారం. సెలవురోజుల్లో మధ్యాహ్నం వేళల్లో షాపులో తానే కూర్చునేవాడు. ఆ సమయంలో స్నేహితులొస్తే మకన్‌పేడా తినిపించేవాడు. కోవాజాంగ్రీ ధరెక్కువ. ఆ ఊరే కోవాకు పేరుమోసింది. కాళాస్తి కోవా అంటే బెంగుళూరు, హైదరాబాదులాంటి సిటీల్లో కూడా పేరే. రోజూ కొన్ని వందల కిలోల కోవాని.. ఆ సిటీలకి ఎగుమతి చేస్తుంటారు. ఆ ఊరోళ్లంతా... బంధువులు, మిత్రులకి కానుకగా ఇవ్వడానికి పాలకోవానో, వాసుగాడి దుకాణంలో కోవా జాంగ్రీనో తీసుకువెళుతుంటారు. అంత పేరు. కనుకే మెనూలోకి వచ్చేసింది. మొత్తానికి విందును అందరూ ఆస్వాదించారు. 
చాలా మంది చాలా ఆశలతో ఎదురు చూసిన ఆ ఆదివారం... వారందరి జీవితాల్లోకీ మరికొన్ని కొత్త అనుభూతులను నింపి.. జారుకుంది.
పొద్దు వాలిపోయింది. ఎక్కడివాళ్లక్కడ వెళ్లిపోయారు. వాసూ, నేనూ మిగిలేం. బడిలో ఉండే సభా వేదిక ‘భువనవిజయం’ మెట్ల మీద కూర్చున్నాం కబుర్లు చెప్పుకుంటూ. మసక చీకట్లలోంచి.. ఒక ఆకారం వచ్చింది మా వైపు. చూడబోతే– సురేంద్రరాజు! వచ్చి, వాసన తగలకుండా కాస్త ఎడంగా, దిగువ మెట్టు మీద కూర్చున్నాడు. 
‘‘ప్రోగ్రాం బలే జరిగింది నా’’ అన్నాడు.
‘‘అన్నలెవురున్నార్రా యిక్కడ.. పేర్లు మరిసిపొయినావా’’ అన్నాన్నేను.
నవ్వాడు. ఉన్నట్టుండి... ఓ మెట్టు పైకి జరిగి.. వాసుగాడీ చేతుల్ని, తన రెండు చేతుల్తో పట్టుకున్నాడు. ‘‘యింక నిమ్మలంగా సచ్చిపోతాన్రా..’’ అన్నాడు. అదిరిపోయాం మేం.
‘‘సిన్నప్పుట్నించీ మీ అంగట్లో కోవా జాంగిరీ తినాలని వుండేది నాకు. అప్పుట్లో రూపాయే.. ఆ రూపాయికి దోవెక్కడ. వారంలో ఏదో ఒకరోజు మా అయ్య అయిదు పైసలిస్తే ఎక్కవ. బడిబయట యీదిలో ఉప్పూకారం రాసిన మామిడి బద్దలు, రేగుపళ్లు వూరిస్తాంటే ఆటికి తగలేయకుండా ఆ అయిదు పైసలు దాసేదెట్టా? దాస్తినే బో.. ఎన్నాళ్లు దాస్తే నా దగ్గిర రూపాయి రావాల... నీ కాడికొస్తే నువు మకనపేడా పెడ్తావు.. యిది అడగడానికి దైర్నం రాదు..’’ కాస్తంత ఆగాడు. కళ్లలో ఊరుతున్నవాటిని గొంతులోకి జార్చుకుని మింగుతున్నట్టు ఆగి, మళ్లీ అన్నాడు. 
‘‘ఒరేయ్‌ వాసూ.. బతుకు ఇన్ని సమ్మత్సరాలు అయిపోయింది.. ఎప్పుడూ తిన్లా.. ఆ గెవనమే లేకుండా బోయింది. ఇయ్యాల తిన్నా.. బలే వుండాదిరా... అమ్రుతంగూడా యిట్నే వుంటాదేమో.. సిన్నప్పుడు కోరికరా.. తీరిపోయింది! యింత పెద్ద కోరికలేం లేవురా యింక... సాలు.. జనమ సాలించేస్తా...’’ రెణ్నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు.  కాసేపాగి లేచాడు.. చేయెత్తి దణ్నం పెట్టాడు. అడుగు తూలకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. 
‘‘అదేంది మామా.. వీడింత బాగుందని అంటాంటే.. ఆ ప్రభాకర్‌ గాడు నన్ను కొట్టందొకటే తక్కవ. కోవాజాంగ్రీ నోట్లో పెట్టుకుని ఒక్క ముక్క కొరికి మింగేసి, ‘సెండాలంగా ఉండాది.. మొత్తం డిన్నరంతా సెడగొట్టినావు గదరా.. సెత్త నాకొడకా’ అని తిట్నాడు మామా’’ అని అయోమయంగా చెప్పాడు వాసు నాతో. ‘‘మా మాస్టరుతో స్పెషలుగా జెప్పి, కోవా జాస్తిగా దట్టించి చేయించా మామా..  ఒకేసారి కలిపి, ఒకే బాణల్లోంచి దించినవే.. వోడికంత సెండాలంగా యెందుకునిందీ.. యీడికిట్టా అమ్రుతం మాదిరిగా యెందుకనిపించిందీ...’’ మళ్లీ పొడిగించాడు అదే అయోమయంలో.
రుచుల జాడ వేరంటే ఎలా నమ్మడం?
‘‘అంతేలేరా... నీ కోవాజాంగ్రీకి ఒక రేంజి వుండాదనుకో.. దానికి దిగవన వుండేటోడికి అది అద్భుతం.. ఎగవన వుండానని అనుకునేవోడికి అది చెత్త.. పదార్థం ఒకటే. దాని రుచి మాత్రం మనిషి మనిషికీ, వాడి లెవిలును బట్టి మారిపోతుంది’’ అన్నాన్నేను. 
పగలబడి నవ్వాడు వాడు. ‘‘దేవుడొక్కడే.. ఒక్కోడికీ ఒక్కోమాదిరి కనపడ్తాడని.. వరదరాజసోమి గుడి మండపంలో సాములు జెప్పినట్టు జెప్పినావు మామా...’’ అన్నాడు.
కాసేపు నెమ్మదించి.. ‘‘యింకో సంగతి జెప్పేదా’’ అన్నాడు. నా బదులుతో నిమిత్తం లేకుండానే.. ‘‘ఆ బాలూ గాడైతే టేస్టు జెప్పమని యిచ్చిన జాంగ్రీ తినేసి ‘సేదుగా వుండాది రా యెదవా’ అన్నాడు. రొవంత సేపే..! ఆనక బోజనాల కాడ ఇంకో జాంగ్రీ పెట్టించుకోని తిని... ‘సూపర్రా వాసూ.. అంగడికి ఫోన్జేసి రెండు కిలోలు పొట్లాలు కట్టించరా డబ్బులిచ్చేస్తా’ అన్నాడు మామా... యిదేందిది..’’ అన్నాడు నవ్వుతూనే. 
వాడికి ఏం చెప్పడం?
వచ్చినప్పటి నుంచీ– మనసుని, బడి ప్రహరీ గేటుకే తగిలించి పెట్టి... ఒక రకమైన నిరీక్షణలో మాటిమాటికీ అటుకేసి పరికిస్తూ... అదెప్పుడు ఉలిక్కిపడుతుందో అని ఎదురుచూస్తూ ఉండిపోయిన బాలూ... అప్పటికి ఈ లోకంలో లేడని... ఎలా చెప్పడం? భోజనాలకు క్షణాల ముందే... మాధవీలత వచ్చిందని, అచ్చం అప్పటిలాగానే.. దయమంతిలా, మాద్రిలా, వెన్నెల్లో రాధలా ఉన్నదని... రాగానే అందరినీ నవ్వులతో పలకరిస్తూనే, కళ్లతో దేవులాడి... నేరుగా బాలూ దగ్గరకెళ్లి ‘ఏం బాలూ బాగున్నావా’ అని అడిగిందనీ... ఆ తర్వాత ఉన్నంతసేపూ వాడితోనే కూర్చుందనీ, కలిసే భోజనాలకూ వెళ్లారనీ... కోవాజాంగ్రీ రెండో కిలో పొట్లం తనకేనని... ఎందుకు చెప్పడం?
‘‘అదంతేలేరా.. రుచి ఒక్కోసారీ ఒక్కో మాదిరి ఉంటాది’’ అన్నాను.
‘‘యేందో మామా... మా ముత్తాతల కాణ్నించీ మిఠాయి యాపారమే జేస్తండాం. మనం జేసే స్వీటు ఒక్కొక్కరికీ ఒక్కో రుచి ఎందుకుంటాదో.. ఒకే మనిసికి ఒక్కోసారి ఒక్కోమాదిరి ఎందుకుంటాదో.. నా మట్టిబుర్రకి తెలియదులే మామా?’’ అనేశాడు తేల్చేస్తున్నట్లుగా నవ్వి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top