సినిమా బాట లో సీరియల్ | serails all following movies | Sakshi
Sakshi News home page

సినిమా బాట లో సీరియల్

Jan 12 2014 2:16 AM | Updated on Aug 17 2018 2:24 PM

సినిమా బాట లో  సీరియల్ - Sakshi

సినిమా బాట లో సీరియల్

హీరో ఎక్కడికో వెళ్తుంటే... నలుగురైదుగురు కత్తులూ కటార్లతో వచ్చి చుట్టుముడతారు. హీరోని చంపాలనుకుంటారు. కానీ హీరో అంత చాన్స్ ఇవ్వడు. వాళ్లని తుక్కు రేగ్గొడతాడు.

 టీవీక్షణం
  హీరో ఎక్కడికో వెళ్తుంటే... నలుగురైదుగురు కత్తులూ కటార్లతో వచ్చి చుట్టుముడతారు. హీరోని చంపాలనుకుంటారు. కానీ హీరో అంత చాన్స్ ఇవ్వడు. వాళ్లని తుక్కు రేగ్గొడతాడు. మళ్లీ లేవనంతగా చితక్కొడతాడు.ఇలాంటివి ఇంతకుముందు సినిమాల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు రోజూ నట్టింట్లోనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే... టీవీ సీరియళ్లలోకి యాక్షన్ సీక్వెన్సులు జొరబడ్డాయి. కత్తులు దూసి, తుపాకులు పేల్చి వీక్షకుడిని కంగారు పెడుతున్నాయి. అసలు సీరియల్స్‌లో ఫైట్లు పెడదామని ఎవరికి ఆలోచన వచ్చిందో తెలీదు కానీ... ఆ మరుక్షణమే సీరియల్ హీరోలు యాక్షన్ హీరోలైపోయారు. పదేసి మందిని కూడా ఒంటరిగా ఎదుర్కోవడం, తుక్కుతుక్కు చేసేయడం, నరుక్కోవడం, కిడ్నాపులు, మానభంగాలు... అబ్బో... హింస!
 అలాగే ఒకప్పుడు ప్రతి సీరియల్‌కీ ఒక సిగ్నేచర్ సాంగ్ ఉండేది. ప్రారంభంలో పేర్లు వచ్చేటప్పుడు ఆ పాట వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు, సినిమాలోలాగే చాలా పాటలు ఉంటున్నాయి. సొంతంగా కట్టుకోలేనప్పుడు సినిమా పాటలు తెచ్చి మరీ పెట్టేస్తున్నారు. ఎపిసోడుకో పాట ప్రత్యక్షమవుతోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లప్పుడు వచ్చే పాటలయితే మరీ గ్రాండ్‌గా తీస్తున్నారు. అదిరిపోయే అలంకరణలు చేసి స్టెప్పులతో మతులు పోగొట్టేస్తున్నారు.
 
 ఇక రొమాన్స్. హీరో హీరోయిన్లు ప్రేమలో పడ్డప్పుడు మొదలవుతుంది గొడవ. ఒకరి కళ్లలో ఒకరు కళ్లుపెట్టి చూసుకోవడం, కొంటె చూపులు, తుంటరి వేషాలు... సినిమాకి తక్కువ సీరియల్‌కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. హిందీ సీరియళ్లలో అయితే రొమాన్సును కాస్త హద్దు దాటిస్తున్నారు కూడా. మనవాళ్లు ఇంకా అంత దూరం వెళ్లలేదు కానీ... వెళ్లరని గట్టిగా చెప్పడం కష్టమే.
 
 ఒకప్పుడు పరిమితంగా ఉండే సీరియళ్లు ఇప్పుడు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దాంతో పోటీ విపరీతంగా ఉంటోంది. అవతలి సీరియల్ కంటే తమ సీరియల్‌లో మరింత స్పెషాలిటీ ఉండాలనే పట్టుదల పెరిగింది. అది మెల్లగా సీరియల్‌కు సినిమా లక్షణాలను అంటగట్టింది. అయితే ఇవన్నీ అవసరమా అంటే, ప్రేక్షకుల కోసమే కదా అంటారు దర్శక నిర్మాతలు. మీరీ మార్పులు కోరుకుంటున్నారా అనడిగితే... అవి లేనప్పుడు కూడా చూశాం కదా అంటున్నారు వీక్షకులు. ‘‘ఇవన్నీ సినిమాల్లో ఎలాగూ ఉంటున్నాయి కదా. వీటిలో కూడా ఎందుకు? అయినా సీరియళ్లు కుటుంబమంతా చూస్తారు. పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కాస్త పద్ధతిగా తీయాలి’’ అంటారు పార్వతి అనే ప్రేక్షకురాలు.
 
 ఆమె చెప్పింది నిజమే కావచ్చు. సీ.. రియల్ అని పేరు పెట్టుకున్నందుకు కాస్తయినా వాస్తవాలను చెబుతూ, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేలా తీయడం అవసరం. అసలు మహిళలు సీరియళ్లకు కళ్లప్పగించేది తమ జీవితాల్లో జరిగేవాటినే వాటిలో చూపిస్తారనే. కానీ సీరియల్‌ని సినిమాలాగా చూపించెయ్యాలని తపిస్తున్న దర్శకులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే వాళ్లకే తెలుస్తుంది... ఈ మార్పు మంచిదో కాదో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement